Monthly Archives: డిసెంబర్ 2007

మరణం – బ్రతుకు ఆటకు తప్పని ముగింపు

వ్రాయదగిన, వ్రాయవలసిన అంశాలు బోలెడు నా కళ్ళ ముందే కనిపిస్తున్నా, నా బుఱ్ఱ నిండుగా ఉన్నా కూడా "ఆ… తరువాత వ్రాయొ"చ్చనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను. చివరికి నన్ను కదిలించి పూనుకునేట్టు చేసిన సంఘటన "మరణం". ఇది నేను తెలిసినవాళ్ళెవరో చనిపోతే వచ్చిన తొందరపాటో తన్నుకువచ్చిన బాధనో కాదు. నిజానికి ఈవారం వార్తాపత్రికల్లో వచ్చి, నా కంటబడిన మూడు మరణవార్తలూ నాకు తెలిసిన, నేను తెలియని వాళ్ళవే: కొణిదెల వెంకటరావు, బేనజిర్ భుట్టో, పి. జనార్దనరెడ్డి – ఈ ముగ్గురిలో ఒకరిది సహజమరణం, మరొకరిది హత్య, ఇంకొకరిది హఠాన్మరణం. …ఏదైతేనేం… అన్నీ ఒకటే – మరణం! రెండు నెలల క్రితం కూడా ఒక మరణవార్త విన్నాను… అది నాకు ఎంతో కావలసిన ఒక దగ్గరి బంధువుది. సంతాపం ప్రకటించాలనుకున్నా ఆ బాధ అయినవాళ్ళను చేరదన్న నిస్సహాయస్థితి.

వీళ్ళంతా మనుషులే… నాకు ఏమవుతారో, ఏమి కారో, …ఏమీ కారో! అయితేనేం… అందరి మరణం ఒకేలా కలచివేసింది. …కాదు, ఒక్కో మరణం ఒక్కొక్క తీరుగా… అన్నీ కలిసి ఒకటే మనసును దాదాపుగా ఒకేసారి కలచివేసాయి, అంతే! …అంతేనా? చెప్పలేనిది ఎంతో ఉంది.

నేను తెలుగు చలనచిత్రసీమ "మెగాస్టార్" చిరంజీవికి అభిమానిని ఏమీ కాదు… అయినా అతని తండ్రి మరణం నాలో బాధను కలిగించింది. నేను బేనజిర్ జీవితాన్ని కానీ, రాజకీయాన్ని కానీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు… అయినా హత్య వార్త చూసిన కళ్ళు కొన్ని క్షణాల వరకు కనిపిస్తున్న వార్తని నమ్మలేదు. నేను కాంగ్రెస్‌వాదినీ కాను, జనార్దనరెడ్డినీ ప్రత్యక్షంగా ఎఱగను… అయినా అర్ధరాత్రి అతని మరణవార్త చూడగానే ఇంట్లో కాలు నిలవక బైటికి వచ్చి మేలుకునే ఉన్న నా సహచరులతో ఆ వార్త తాలూకు దిగ్భ్రమను పంచుకున్నాను. గతసంవత్సరం సద్దామ్ హుస్సేన్‌ని ఉరి తీసినప్పుడు కూడా ఏదో తెలియని, ఇదమిద్ధంగా చెప్పలేని ఇబ్బందికరమైన భావన. (నేను సద్దామ్ సానుభూతిపరుడిని కాదని మనవి.) మరణమంటే కలిగిన ఒక రకమైన …జుగుప్స. "జుగుప్స" అన్న భావనే సరైనదా అంటే …తెలియదు నాకూ!

మరణమంటే…?
విధి చేసిన దారుణమా? మదిలో అనంత(ర) స్మరణమా?
జ్ఞాపకాల తోరణమా? జ్ఞాపకాలతో రణమా?
అనుభవాలు రగిల్చిన వ్రణమా? అనుభూతులు మిగిల్చిన ఋణమా?
ఎవరూ మనకేమీ కాకుండా…పోవటమా??
ఎవరికి ఏమైనా మనకేమీ కాకపోవటమా?!

ఏ మరణం ఎక్కువ బాధాకరం?
తెలిసినవారిదా, తెలియనివారిదా?
"పిచ్చి ప్రశ్న!" అనిపించింది…
 ఈ ప్రశ్న మనసులోకి రాగానే!
వెంటనే ప్రశ్నించిన మనసే హెచ్చరించింది –
జవాబు సులువు కాదని!
"పిచ్చి ప్రశ్న" అనిపించే ప్రతి ప్రశ్నా
సులువైన జవాబు లేనిదే అయి ఉంటుందేం?
…జీవితమనే "పిచ్చి ప్రశ్న"కు
మరణమే "సులువైన జవాబు" అవుతుందా?

ఎవరి మరణవార్త తెలిసినా
మనసులో ఏతత్క్షణంలోనే ఎన్నో ఊహలు…
పుట్టుకకీ చావుకీ ప్రతీకలుగా
అలా పుట్టి ఇలా గిడతాయి
"పునరపి జననం పునరపి మరణం"

"ఆత్మ నాశనము లేని"దన్న గీతాకారుడు
ఇన్ని మరణాల మధ్యన తమ తమ ఆత్మలను
హత్య చేసుకుని బ్రతుకుతున్నవాళ్ళను
లక్ష్యపెడతాడా?
ప్రతి ఘటనకీ స్పందించి స్పందించి
స్పందించటమే మరచిపోయేటంతగా
సొంత ఉనికిని కోల్పోతున్న ప్రాణాలను
పట్టించుకుంటాడా?
"కర్మణ్యేవ-అధికారస్తే మాపలేషు కదాచన"
అన్న హెచ్చరిక మనసులో చేరింది –
"ప్రశ్నించుకో, జవాబు కోసం వెతకొ"ద్దని మెత్తగా వినబడింది!
జీవనవేదం సరిక్రొత్తగా అర్థమైంది!

…మరణవార్త చెవినబడ్డ ప్రతిసారీ శ్రీశ్రీ గుర్తుకొస్తాడు… శ్రీశ్రీని కదిలించిన కొంపెల్ల జనార్దనరావు మరణం గుర్తుకొస్తుంది. "నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన – ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?" అని ప్రశించిన వేటూరి వేదాంతం గుర్తుకొస్తుంది. "అనుకోలేదని ఆగవు కొన్ని" అన్న ఆత్రేయ ఆవేదన గుర్తుకొస్తుంది. ఎంతటివాడినైనా కదిలించే ఆ మృత్యురూపం గుర్తుకొస్తుంది. "దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది – ఇంత కన్న సైన్యముండునా?" అన్న గురువు సీతారామశాస్త్రి హెచ్చరిక గుర్తుకొస్తుంది. …నాకు నేను గుర్తుకొస్తాను! (బేనజిర్ చనిపోయిందని తెలిసిన 6-7 గంటలకు, జనార్దనరెడ్డి మరణవార్త తెలిసిన 1-2 గంటల్లోపు మనసులోని తడులకు, సడులకు, సుడులకు అక్షరరూపాన్నిచ్చే యత్నం.)