Monthly Archives: ఆగస్ట్ 2008

నేడు తెలుగు భాషా దినోత్సవం

(తొలుత “ఆర్కుట్”లోని ఒక కూటమిలో వ్రాసిన యీ టపాని తగుమాత్రంగా దిద్ది యిక్కడ ఉంచుతున్నాను.)

మొట్టమొదటగా మనం గ్రహించవలసినది తెలుగు భాష అంతరించిపోలేదు, అంతరించదు కూడా అన్న విషయం!

ప్రతి భాషకు “మనుగడ ప్రశ్నార్థకమే” అన్న పరిస్థితి ఒక్కోసారి తత్కాలీన ప్రజల మనస్సుల్లో రావచ్చు గాక! కానీ, వేయి సంవత్సరాలకు పైగా తల వంచకుండా రెపరెపలాడుతున్న మన భాష బావుటా వెలవెలబోయే పరిస్థితి కనీసం మన తరం బ్రతికి ఉండగా రాదు! తెలుగు భాష సముద్రం వంటిది. కొన్ని ఇతర భాషా పదాలు ప్రవాహాలుగా వచ్చి చేరినంత మాత్రాన ఇందులోని “రుచి” మారదు, కాలుష్యం పెరగదు, అడుగంటిపోదు! (మధురమైన భాషను ఉప్పు నీటి సముద్రంతో పోల్చటం అనౌచిత్యమే కావచ్చు కానీ “రుచి” అన్నది “స్వధర్మం” అన్న అర్థంలో తీసుకోమని మనవి. మరో సంగతి: రుచి అన్న పదానికి “ఉప్పు” అన్న అర్థం కూడా ఆపాదించబడింది

శాస్త్ర/సాంకేతిక పారిభాషిక పదాలకు (Scientific/technical jargon) తెలుగు పదాలు లేకపోవడం అనర్థం కాదు, కానీ ఉంటే దైనందిన విద్యార్థి జీవితంలోనూ తెలుగును ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒక భాష బ్రతికి ఉండాలంటే దానికి కావలసింది ఆ భాషకు “దినం” పెట్టి ఉత్సవాలు చెయ్యటం కాదు! పిల్లలతో ఆ భాషలోనే సంభాషించటంతో భాషకు కొత్త ఊపిరులు పోసుకోదు నిజానికి! Mummy, Daddy అని పిలిచినంత మాత్రాన అమ్మ, నాన్న అన్న భావనలోని ప్రేమ తగ్గదు! (నేను తెలుగులోనే సంబోధిస్తానని మనవి.) ఎన్నో సాంస్కృతిక, రాజకీయ అంతరీకరణలు (transformations), యుద్ధాలు తట్టుకుని చరిత్రలో నిలిచిన తెలుగు భాషకు మన రోజువారీ సంభాషణలే ప్రాణవాయువులు అవుతాయనుకోవటం సరి కాదు! చేయవలసిన పని మరొకటి ఉంది… అది ఎంత మంది చేస్తున్నాము?! “అదేంటి?” అంటారా? తెలుగు భాషలో పుస్తకాలు వెలువరించటం, తెలుగు పుస్తకాలు కొని/అరువు తీసుకొని చదవటం, వెలుగులోకి రాని మంచి పుస్తకాలను నలుగురికి పరిచయం చేయటం – “ఇవి చేస్తున్నామా?” అన్నది ప్రతి ఒక్కరూ వేసుకోవలసిన ప్రశ్న! “ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు” అన్న సామెత మనదే! దురదృష్టవశాత్తూ అది మనకు చక్కగా వర్తిస్తుంది! …నేటి అవసరాలకు తగినట్టు కొత్త పదాలతో భాషను పరిపుష్ఠం చేయటం ఎంత అవసరమో కాలానుగతంగా వస్తున్న సామెతలు, లోకోక్తులు, జాతీయాలు తెలుసుకుని వాటిని అవసరమైనప్పుడు వాడుకోవటం కూడా భాషావికాసానికి అవసరం! మన దృష్టిలో అవన్నీ “ఎప్పుడో బళ్ళో చదువుకుని వదిలేసిన సంగతులు”! సంధులు, సమాసాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఛందస్సు అనవసర కష్టాలు

మనకు “పుస్తకాలు చదవటం bore”, ప్రాచీన కళలైన “సాంప్రదాయక సంగీతనృత్యాలు slow” వంటి ఎన్నో అభిప్రాయాలు రోజూ వినిపిస్తూనే ఉంటాయి. (వినపడటంలేదు అంటే దానికి అర్థం మన కూడా వీటి గురించి ఆలోచించటమూ, చర్చించటమూ మానేసామని!) అదేంటో… ఈ అభిప్రాయాలు వెలువరించిన వాళ్ళు ఒక్క పుస్తకమైనా మనసు పెట్టి చదివారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి! కర్ణాటక సంగీత సంప్రదాయంలో స్వరపరచిన ఒక్క తిల్లానా అయినా విన్నారా అనిపిస్తుంది “మన సంగీతం slow” అన్న మాట వింటే! త్యాగరాజు కాలంలోనూ పాశ్చాత్య సంగీతపు సమాదరణ ఉండేదని, స్వయంగా ఆయనే కొన్ని కృతులని పాశ్చాత్య రీతుల ప్రభావంతో స్వరరచన చేసారని సదరు “విమర్శకు”లకు తెలియదు కాబోలు! పాశ్చాత్యపు సంగీతం ఆదరించారు కనుక కర్ణాటక సంగీతం వినమనటంలేదు… కానీ, ఒకటి విని నచ్చినంత మాత్రాన రెండోది తప్పు అనుకోవటం శోచనీయం!

మన వాళ్ళకు ఉండే మరో జాడ్యం “గొప్పలు చెప్పుకోవటం”! బొట్టు పెట్టుకోవటం మన సంప్రదాయం, అందరికీ నమస్కరించటం మన సంప్రదాయం, తెలుగు భాష తీయనైనది… ఇలా ఎన్నైనా చెబుతాం. ఎందుకు “గొప్ప” అంటే ఇదమిత్థంగా చెప్పలేక తడబడతాం! “గొప్ప” అని తెలిసి అందరికీ చెప్పుకోవాలనిపించటం తప్పు కాదు కానీ ఎందుకు గొప్ప అన్నది తెలుసుకునే జిజ్ఞాస లేని జాతి మనది అన్నది నిష్ఠురసత్యం! “దేశభాషలందు తెలుగు లెస్స” అని చెప్పుకుని గర్వపడతామే కానీ అక్కడ “దేశం” అంటే వేల భాషలకు ఆలవాలమైన భారతదేశం కాదని, అప్పట్లో ఉన్నది చిన్నా చితకా రాజ్యాలేనని గ్రహించము! మాతృభాష అన్నది ఒక గొప్పతనంగా భావిస్తామే కానీ ఆ కాలంలో ఆయా రాజ్యాల ప్రజలందరూ పొరుగు రాజ్యాల భాషలు నేర్చుకునేవారని గ్రహించము! మన భాష అతి ప్రాచీనమైనదని చెప్పుకుని అందుకు ఉన్నవీ, లేనివీ ఆధారాలు కల్పించుకుంటాం! తమదే ప్రాచీనభాష అన్నందుకు తమిళులని తప్పు పడతాం! అంతే కానీ, నిజంగానే తమిళభాష తెలుగు కన్నా ముందే పుట్టిందేమోనని, కనీసం దాని లిపి దాదాపు 1500 యేళ్ళుగా మారలేదని మనం గ్రహించుకోము!

…తెలుగు భాషను కించపరిచే ఉద్దేశం నాకు ఏనాడూ లేదు! విశ్లేషణాత్మక/విమర్శనాత్మక/తార్కిక దృక్పథాలు కరువై, ఇలాంటి పదాలే బరువైన మన తరానికి తెలుగు భాషని అంతమొదించేంతటి సత్తువ లేదు! తెలుగు భాషను ప్రాణప్రదంగా పూజించేవాళ్ళకు కొదువా లేదు! మనకు పార్శ్వపు అంధత్వం (selective blindness), పార్శ్వపు మతిమరపు (selective amnesia) ఉండటమూ, మన భాషాసంస్కృతుల పట్ల మనకు అవగాహన, అభిమానము లేకపోవటము వంటి ఎన్నో కారణాలు మనమే అనునిత్యం పరీక్షించుకుని మనలని మనం దిద్దుకోవలసిన అవసరం ఉంది… అది కూడా మన అవసరమేనని గ్రహిస్తే చాలు – అదే తెలుగు భాషకు పదివేలు, భావి తరాలకు మనం చేసే మేలు! (పార్శ్వం అంటే selective కాదు… “ఒక వైపు” అని మాత్రమే. కనుక దీనిని సందర్భోచితమైన అనుసరణగానే స్వీకరించానే తప్పించి నిక్కచ్చి అనువాదం కాదు.)

కొన్ని వివరణలు:

  1. ఆముక్తమాల్యద”లోనిదిగా ప్రముఖమైన “దేశభాషలందు తెలుగు లెస్స” అనే వ్యాఖ్య కృష్ణదేవరాయలే రచించినట్టు నమ్మితే “దేశం” అన్న పదం “విజయనగర సామ్రా”జ్యాన్ని సూచిస్తుంది. కానీ, శ్రీనాథుడిదిగా చెప్పబడుతున్న “జనని సంస్కృతంబు సకల భాషలకును / దేశభాషలందు తెలుగు లెస్స / …” అన్న ఆటవెలది పద్యం ఒకటి ఉంది. కానీ, ఏది ముందు వ్రాసినదో ఇదమిత్థంగా తెలియదు! మన కవులు తమకు తాము తక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వలనేనేమో… వారి గురించిన విషయాలు వారి రచనల్లో ఎక్కువగా కనిపించవు. అందుకని వారి దేశకాలాలను మనం నిర్ధారించలేని స్థితిలో ఉన్నాము. ఈ విషయాలేవీ మనలో చాలా మందికి తెలియదు! తెలిసినా కూడా పరిశోధించే ఉద్దేశము, పరిశీలించే ఉత్సుకత లేవు చాలా మందిలో!
  2. తమిళులు చేసిన స్వార్థపుటన్యాయం వేరే ఉంది: తమిళభాష ప్రాచీనమైనదని ప్రభుత్వం తీర్మానించిన వెంటనే ప్రాచీనభాషలను గుర్తించటానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించిన కాలవ్యవధిని 2000 సంవత్సరాలకు పెంచటం!
    3. మన భాషకు లిపి నేటి స్థాయికి చేరినది ఎప్పుడో తెలుసా? ముద్రణ యంత్రాలు మన దేశానికి వచ్చిన తరువాత – అంటే 19వ శతాబ్దంలో!