(ఈ టపాకి స్వీయ ఆంగ్లానువాదాన్ని యిక్కడ చదవగలరు.)
పొరపాటున చెయి జాఱిన తరుణం తిరిగొస్తుందా?
ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా?
…
పొరపడినా, పడినా జాలి పడదే కాలం మన లాగా!
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చే దాకా!
(ఇవి “సిరివెన్నెల” సీతారామశాస్త్రి కూర్చిన మాటలే అయినా మన మనసుల భాష యిది – అది ఏకవచనమే! ఎందుకంటే యీ హెచ్చరికలు చేస్తున్నది మన అందఱి సొంత గొంతుక!)
… ”నీ ప్రశ్నలు నీవి” యని మనకు గుర్తు చేసిన కాలం “ప్రశ్నలోనే బదులు ఉంది” అనీ అంత కన్నా ముందే చెప్పింది. విన్నామా, గ్రహించామా, నేర్చుకున్నామా, పాటించామా అన్నది ముఖ్యం. 2010 వెళ్ళిపోకా తప్పదు. 2011 రాకా తప్పదు. ఆ మధ్యన మనమెంత బాగుపడ్డాము, ఎంత మందిని/దేన్ని ఎలా బాగు చేసాము, ఎన్ని/ఏం పాఠాలు నేర్చుకున్నాము? అన్నవే ముఖ్యం. క్రొత్త సంవత్సరం మఱిన్ని పాఠాలు తెచ్చే లోపు పాత పాఠ్యక్రమం (స్య్ల్లబుస్) మొత్తమూ పునఃపునః ఔపోసన పట్టడం మన వంతు. అది చేయకపోతే ఎన్ని క్యాలెండర్‌లు మాఱినా కాలం-డర్ (కాలమంటే భయం) మాఱదు. క్రొత్త యేటిని మనం ఆహ్వానించటం కాదు చెయ్యవలసినది – అది మన పూనిక లేకపోయినా యెలాగూ వస్తుంది. క్రొత్త యేడనే మందిరంలో మనం అడుగు పెట్టబోయే ముందు మనకై మనమే పూనుకుని ఆత్మశుద్ధి చేసుకోవాలి. మన ప్రతి ఆచారం వెనుక ఒక భయం కానీ భక్తి కానీ ఉంటాయంటారు. ఈ నూతనసంవత్సరాహ్వానం భయంతో చేస్తున్నామా, భక్తితో చేస్తున్నామా, భయమూ భక్తీ మఱచిన మౌఢ్యంతో చేస్తున్నామా అన్నది మనకు తెలియాలి… కాలం మనల్ని దాటిపోకముందే.