గమనిక: ఇది సమీక్ష కాదు! “మఱెందుకు వ్రాసినట్టు?” అనే ప్రశ్నకి సమాధానం టపాలోనే ఉంది.
(నిష్పూచీ: ఈ టపా వ్రాస్తున్నపటికి నేనింకా రామ్‌గోపాల్‌వర్మ తీసిన “దొంగల ముఠా” చూడలేదు. చూసినా నా క్రింది అభిప్రాయంలో మార్పుండబోదు. చూడకపోయినా అలాంటి అభిప్రాయమేర్పఱచుకోవటం తప్పు కాదు.)
కేవలం 6.5 లక్షల రూపాయలతో సినిమా తీసి చూపించారు రామ్‌గోపాల్‌వర్మ. సంతోషం! (గురుదక్షిణగా వర్మ పేరునే దర్శకుడిగా ప్రకటిస్తూ రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడైన (జె.డి.) చక్రవర్తి గతంలో తీసిన మధ్యాహ్నం హత్య చిత్రానికి అయిన ఖర్చు 18 లక్షలని అప్పట్లో విన్నాను. నిజానిజాలు తెలియవు.) “అది మంచి ప్రయోగం!” అని అనను. ఎందుకంటే తెఱ మీద ఆ శ్రమ తాలూకు ఫలితం కనీస ప్రమాణాలతోనే ఉండబోతోందని వర్మకి ముందే తెలుసు. ఇక 6.5 లక్షల రూపాయలతో తీయటం అందఱికీ సాధ్యమా అంటే కాదనే చెప్పాలి. వర్మ అంతటి దర్శకుడు పిలిస్తే రవితేజ, ఛార్మి, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, లక్ష్మీప్రసన్న, బ్రహ్మాజీ, సుబ్బరాజు, సుప్రీత్ మొదలైనవాళ్ళంతా పారితోషికం లేకుండా పని చేస్తారు కానీ మీరూ నేను పిలిస్తే చెయ్యరు, క్రొత్తవాళ్ళని పెడితే చూడరు. “ఇలాంటి వినూత్న ప్రయోగాలనైతే ఆదరిస్తా”మంటూ “బయటి నుంచి మద్దతు ప్రకటించే వాళ్ళు” చాలా మందికి డి.టి.యస్. (నిశ్శబ్దం), అతడు+ఆమె=9, వంశం లాంటి సినిమాలు విడుదలైనట్టు కానీ, అలాంటివెన్నో చిత్రాలు తయారీలో ఆగిపోయిన సంగతి కానీ తెలిసి ఉండకపోవచ్చు. (“ప్రచారం చెయ్యకుంటే మా తప్పా?” అంటారా? నేను తెలుసుకున్నది కూడా వార్తాపత్రికల నుంచే మఱి! పైగా డి.టి.యస్. చిత్రంలో నటించిన ఆదిత్య ఓం, వంశంలో నటించిన చంద్రమోహన్, బాలాదిత్య, నాగబాబు క్రొత్తవాళ్ళు కాదు.) ఆ చిత్రాలెలా ఉన్నాయన్న సంగతి వదిలేస్తే వాటిలో ఉన్న ప్రయోగాత్మకతకి గుర్తింపు దక్కలేదనేది మాత్రమే నా ఉద్దేశం.
ఛాయగ్రహ నిర్వాహకులు/దర్శకులు లేకుండా, 5 మంది కెమెరామెన్‌తో, 5 ప్రధాన పాత్రలతో, 5 రోజులు చిత్రీకరణ జఱుపుకొని, 5 వారాల నిర్మాణోత్తర కార్యక్రమాల తఱువాత విడుదలైన చిత్రం దొంగల ముఠా. ప్రయోగం పేరుతో వర్మ పరమ చెత్త సినిమా తీసాడని చాలా మంది ఉద్దేశం. “సినిమాలు తీసేది యేదో నిరూపించటానికా, లేక వినోదం కోసమా?” అనడిగారు కొందఱు సమీక్షకులు. “కథాకథనాలలో క్రొత్తదనం లేకుండా సినిమాలు తీసి రచ్చకెక్కి ప్రచారంతో బ్రతికేస్తున్న రామ్‌గోపాల్‌వర్మ”ని చెఱిగేసిన అలాంటి ప్రేక్షకసమీక్షకులకు నా ప్రశ్న: “జేమ్స్ క్యామెరూన్ తీసిన అవతార్ చిత్రంలో మీకు కనిపించిన క్రొత్తదనమేమిటి?” …నాకు తెలుసు, వెంటనే “అవతార్ లాంటి మహాద్భుతానికీ, దొంగల ముఠా లాంటి చెత్తకీ పోలికనా?!” అంటారని. ఏం, తప్పేంటి?! ఒకడు ప్రయోగం పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రొత్త ప్రపంచాన్ని సృష్టించాడుట. ’50ల, ’60ల దశకాలలోనే ప్రతి పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రమూ సృష్టించలేదా క్రొత్త ప్రపంచాలను? ఫలానా లాంటి సినిమా తీయాలని నిర్ణయించుకుని, 12 యేళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రమించి కథాపరంగా, పాత్రల చిత్రణాపరంగా క్రొత్తదనమనేది ఈషణ్మాత్రమైనా లేని అవతార్ చూడాటానికి లేని యిబ్బంది కేవలం ఛాయాచిత్రాలు తీసుకోవటానికి వాడే 5 కెమెరాలతో 5 రోజుల్లోనైనా ఒక చలనచిత్రాన్ని తీయవచ్చని చూపిస్తేనే వచ్చిందా? అవతార్ చిత్రాన్ని ఈ శతాబ్దపు అద్భుతంగా, “తెల్లోడి మాయ”గా తేల్చేసిన చాలా మంది “మేథావి ప్రేక్షకసమీక్షకులు” నా లాంటి మూర్ఖుడికి సమాధానాలు చెప్పరు. కనీసం వాళ్ళకైనా ఆ సమాధానాలు తెలిస్తే చాలని నాకనిపిస్తుంది.
రామ్‌గోపాల్‌వర్మ యెన్ని మాటలు చెప్పి యెంత నాసిరకమైన సినిమాని యెంత విసుగు కలిగించేలా తీసారన్నదే చాలా మందికి కనిపించవచ్చు గాక తెఱ మీద. నాకు మాత్రం చిట్టి (తక్కువ నిడివి) చలనచిత్రాలు తీసే చాలా మంది ఔత్సాహికులకు ఒక నమ్మకాన్నిచ్చారనిపిస్తుంది. పారితోషికం తగ్గించుకుని చలనచిత్ర నిర్మాతలకు మేలు చేయమని యెన్ని రకాలుగా అడిగినా తల ఒగ్గని నటులు నిర్ద్వంద్వంగా ముందుకు రావాలంటే చలనచిత్ర నిర్మాణకారులు చూపించవలసిన నమ్మకం తాలూకు నిలువెత్తు రూపం కనిపిస్తుంది. లాభాల్లో వాటాలే తప్పించి పారితోషికమివ్వకపోవటమన్న పద్ధతి చలనచిత్రరంగానికి మున్ముందు యే రకమైన క్రొత్త ఊపిరులూదగలదో కనిపిస్తుంది. “ఒక సినిమా చేస్తుండగా మఱో సినిమా గుఱించి ఆలోచిస్తే మహాపాపం, కళాసరస్వతికి అవమానం! అది యేకాగ్రతని దెబ్బ తీస్తుంది.” అని “ఆడలేక మద్దెల ఓడు” అన్నట్టు కబుర్లు చెప్పే చాలా మంది దర్శకులకు చెంపపెట్టులా కనిపిస్తుంది. కోడిరామకృష్ణ, దాసరి నారాయణరావు లాంటి ఉద్దండులు ఏకసమయంలో అనేక చిత్రీకరించిన సందర్భాన్ని గుర్తుకు తెస్తుంది. ఆశాభావం చిగురిస్తుంది.
కొసమెఱుపు: మన ఖర్మ యేమిటంటే సినిమాని ఆరున్నర లక్షల్లో తీసినా అరవై కోట్లతో తీసినా ప్రేక్షకుల నెత్తిన పడే టికెట్ ధరలో మార్పు లేకపోవటం. అది మాఱకపోతే నాలాంటి వాడికి యెన్ని ఆశలు చిగురించినా ప్రేక్షకుడికి జేబు చిఱుగుతూనే ఉంటుంది. ఎప్పటి లాగే అ.సం.రాలో ఈ చలనచిత్రానికి టికెట్ ధర $12. మఱి యీ దొంగల ముఠా వలన వచ్చే బాధలు తీర్చేదెవఱు?!
(షరా: కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు చిత్రం కూడా నేనింకా చూడలేదు. ఒకవేళ అదీ బాగాలేదనిపించినా దానికీ, దీనికీ దీని తఱువాత రామ్‌గోపాల్‌వర్మ తీయబోయే చిత్రాలకి, అంతకు ముందు వర్మ తీసిన చిత్రాలకీ ముడి పెట్టబోను. దేని సంగతి దానిదే! మఱొక సంగతి కూడా చెప్పాలి: “వర్మ యింత కన్నా బాగా తీయగలడు” అనిపించటంలో ఆశ్చర్యం లేదు. కానీ, “పెట్టనమ్మ యెలాగూ పెట్టలేదు, ఎప్పుడూ పెట్టే ముం*వి నీకేమయిం”దన్న బిచ్చగాడి సామెత చెప్పినట్టు కళాభిక్ష కోసం చూస్తున్న నాలాంటి వాడికి దర్శకుడు సరిగా తీయలేదని అతన్ని తిట్టే హక్కు మాత్రం ఉండదు. “నచ్చకపోతే చూడకండి. ఎలాగైనా చూడమని యెవడేడిసాడు?” అని వర్మయే అన్నారు ఎన్నోసార్లు.)