Category Archives: మానవ సంబంధాలు

ఇందుకా తెలంగాణా?! థూ… జీవితం!

మంచితనం, మానవత్వం, తెలివి, సంస్కారం – ఏమీ లేని నడుస్తున్న శవాల తెలంగాణాకి స్వాగతం పలికిన ముష్కరులారా… మీ పాపం పండింది! తమ ఒంట్లో చీము, నెత్తురూ ఉన్న తెలంగాణావాదులైనా, సమైక్యాంధ్రవాదులైనా సంస్కారం అన్న లక్షణం తమలో ఉందని నమ్మితే, తాము యింకా మనుషులమేనని నమ్మితే యిప్పటికైనా యీ పుండాకోరుల మీద తిఱగబడండి! ఇందుకా తెలంగాణా?! థూ…! నిన్న ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను చూసి వీరావేశం తప్పించి మఱేమీ మిగలక మనుషులుగా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు తెలిసిన ఎవఱైనా వాళ్ళకి తిలదానం చేసి కర్మకాండ జఱిపించాలి. ఇలాంటి చీడపురుగులు బ్రదికే సమాజం తెలంగాణా అయినా ఒకటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే. ఇలాంటి హీనులను యెలాంటి కారాగారానికి పంపించినా ఆ కారాగారాలు కూడా అవమానంగా భావిస్తాయి.

“మఱి తెలంగాణాలో ఫలానా జఱిగినప్పుడు నువ్వు నోరు మూసుకున్నావే”మని అడగబోయే ప్రతివాదులకు నా జవాబు:

నేను ఒక్కడిని నోరు మూసుకుంటే జఱిగే గొప్ప సంగతులేవీ ఆగిపోవు, మీ మీ బుద్ధికుశలత వాడి నేను నోరు మూసుకున్న సందర్భాల్లో మీరు నోరెత్తండి. నాకు చేతనయింది నేను చేస్తున్నాను… మనిషికి నష్టం కలిగించే యెలాంటి చర్యనైనా, ఎక్కడైనా నేను ఖండించి నాకు చేతనయింది చేస్తున్నాను. శాసనసభకు పంపిన ప్రజాసేవకులు తమ చర్యలకు అడ్డుండదన్న దురహంకారంతో అదే ప్రాంగణంలో కొట్టినప్పుడైనా నోరెత్తాను, తెలంగాణా సంస్కృతి తెలుసుకోకుండా యీసడించినవాళ్ళు అనుంగు స్నేహితులైనా నోరెత్తాను. మనిషిగా బ్రదికినప్పుడే అసలేమైనా చెయ్యగలం! నాలోనో మఱొకరిలోనో తప్పులు వెదుకుతూ కూర్చోవటమే మీకు చేతనైన పనయితే అదే చెయ్యండి. అది కాక యింకేమైనా చేతనైతే అదీ చెయ్యండి. శాంతిని సాధించలేని బ్రదుకు దండుగ! పురాణపురుషులు కూడా పాపం పండే దాకా ఆగారు, తప్పదు! ఆ పాపం ఫెటేలున పగిలిందిప్పుడే!

సమాజం మొత్తమూ గొడ్డువోలేదని, విద్యను గడించినవాళ్ళలో వినయం ఉంటుందని, వివేచన ఉంటుందని, మంచు చెడుల విచక్షణా ఉంటుందని, ఏది సమర్థనీయమో యేది కాదో తెలుసుకోగల కనీసజ్ఞానం యిప్పటి దాకా కనిపించపోయినా యిప్పుడైనా కళ్ళు తెఱిపిస్తుందని నా ఆశ. ఇవే మాటలు తెలంగాణా యాసతో వ్రాస్తే మఱింత మంది తమలో మనిషితనాన్ని గుర్తిస్తామనుకుంటే మొత్తమూ తెలంగాణా యాసలోనైనా వ్రాస్తాను. సంస్కృతి యేదైనా చిన్న చూపు ఉండకపోవటమే ముఖ్యం. “నా తెలంగాణా కోటి రతనాల వీణ” అన్న దాశరథి కూడా “ఈ తెలంగాణా” గుఱించి ఆ మాట అని ఉండేవాడా అన్నది ఒక్కసారి ఆలోచిస్తే మనకే తెలుస్తుంది నిన్న జఱిగిన ఘాతుకమెంత నీచమైనదో!

సిగ్గు పడవలసిన విషయంలో కొంచెమైనా సంతోషం కలిగిందంటే ఒక సమాజంగా మనం చచ్చిపోయామని అర్థం! మన లాంటి పీనుగులని పీక్కుతినటానికి తెలంగాణాకు చెందిన రాబందులు కూడా రావు!

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతి భ్రమ్శాత్ బుద్ధినాశా బుద్ధినాశా పణశ్యతి

(భగవద్గీత – ఇది తెలంగాణా కాదు, రాయలసీమ కాదు, కోస్తాంధ్ర కాదు… హర్యానాలో జఱిగింది.)

పచ్చనైన ప్రతి కథకూ తల్లివేరు పడతులు

“యత్ర నార్యస్తు పూజ్యన్తే రమతే తత్ర దేవతాః” అని చెప్పింది మనుస్మృతి. అదే మనుస్మృతి “న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి” అంటూ స్త్రీలకు ఆంక్షలు విధించింది. ఇలా అనగానే మన స్త్రీవాదులకు “మనువు” మీద మనసు మండుతుంది. మనుస్మృతి పాటించాలని అనటంలేదు. (పాటించాలంటే మఱి తద్దినపు భోజనంలో బ్రాహ్మణుడికి ఖడ్గమృగం మాంసం వడ్డించాలిట!) భారతీయ సమాజంలో అంతర్లీనంగా అంతటా ఉండే ఛాందసం అమ్మాయిలకు నయానో భయానో ఆజన్మాంతమూ సర్దుకుపోవటమే నేర్పుతుంది. ఇంట్లో వాళ్ళకెంత స్వేచ్ఛనిచ్చినా సమాజం మొత్తంలోనూ అంతటి భావవైశాల్యం లేదు కనుక యెన్నెన్నో రకాలుగా మన స్త్రీలు సర్దుకుపోవటాన్ని ఒక జీవనశైలిగా స్వీకరించటం జఱుగుతుంది. దానితో వాళ్ళు స్వచ్ఛందంగానూ ఆనందంగానూ తమ స్వాతంత్ర్యాన్ని భర్త, కుటుంబం, సమాజం వంటి బాహ్యాధిపతులకు విడిచిపెడతారు. ఇదే అన్ని సమస్యలకూ మూలమనిపిస్తుంది. మౌనమే భూషణంగా ఆధారపడటము, సర్దుకుపోవటము ఆడవాళ్ళకి అలవాటైపోయిన పరిస్థితిలోనే దోషముంది!

తనకంటూ ఒక రూపము, ఆకారము రావటానికి స్త్రీ మీద ఆధారపడిన పురుషుడు స్త్ర్యాధిపత్యాన్ని – ఈ పదం కూడా క్రొత్తగా పుట్టించవలసి వచ్చినంతగా – ఎందుకు తట్టుకోలేడు? తనలోని ప్రతి అంగము, ఆలోచనా రూపు దిద్దుకున్నది స్త్రీ వలననే అన్న విషయమెలా మఱచిపోగలడు? ఏమిటి మగతనం గొప్ప? 46 క్రోమోజోముల్లో ఒకే ఒక్క క్రోమోజోము వేఱుగా ఉండటమా?! అయినా మగవాడైనంత మాత్రాన యేమిటి లాభం? కనీసం తనకి వచ్చిన భావోద్వేగాన్ని సంపూర్తిగా వ్యక్తపఱచలేనంతటి అశక్తుడు యీనాటి మగవాడు! మగవాడి ఆధిపత్యం సహజసిద్ధంగా వర్తిల్లటంలేదు, ఆడవాళ్ళు ఆధిపత్యం కోసం పట్టుబట్టక వదిలిపెట్టడం వలన మగవాడికి మిగిలిన “ఘనత” అది. ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందంటారు. ఆ స్త్రీ తన తల్లి కావచ్చు, భార్య కావచ్చు, మఱో బంధువు కావచ్చు – వాళ్ళకి ఏదో రకంగా దాసోహమన్న పౌరుషాన్ని గుఱించి మనమింతగా గుండెలు పొంగించుకోవాలా? స్త్రీలకు రిజర్వేషన్లు “ఇవ్వటం”, స్వేచ్ఛని “ఇవ్వటం” – ఈ యివ్వటమేంటి అసలు?! ఒకరికి స్వేచ్ఛనిచ్చే “హక్కు”, “అధికారం” ఎవఱికున్నాయి?! వాళ్ళకి “ఉండవలసిన” స్వేచ్ఛని పరిహరిస్తున్నది పురుషాధిక్య సమాజం కాదా?! (ఒకప్పుడు మన దేశంలో మహారాజ్ఞులు, శక్తిస్వరూపిణులు లేరా? హుఁ, ఉంటే మాత్రమేం లాభం? వాళ్ళ వాళ్ళ కాలాల్లో వాళ్ళూ యిబ్బందుల నెదుర్కొన్నవాళ్ళే కదా!) స్త్రీత్వంలోని సహజ హృదయవైశాల్యం వలన సమానత్వాన్ని అయినా, మఱొకరి ఆధిక్యాన్ని అయినా అత్యంత సహజమైన విషయంగా పరిగణించి చిఱునవ్వుతో ఆమోదిస్తుంది. ఆధిపత్య యుద్ధం తప్పించినందుకు కృతజ్ఞులమై ఉండక స్త్రీల మంచితనాన్ని చేతగానితనంగా చూసే మూర్ఖత్వానికి ముందు తరాలలోనైనా స్వస్తి చెబితే మేలు. అందుకు స్త్రీలని మెచ్చి మేకతోలు కప్పనక్కఱలేదు, కనీసం మనుషులుగా వాళ్ళని గౌరవించటం మొదటి మెట్టు కాగలదు!

“ఉద్యోగమ్ పురుషలక్షణమ్” అన్న మాట పట్టుకుని స్త్రీలు ఉద్యోగాలు చేయరాదనేవాళ్ళు కొందఱు. సంస్కృతంలో “ఉద్యోగమ్” అంటే “ప్రయత్న”మనీ “పురుష” అన్న మాట మనుషులందఱికీ వర్తిస్తుందనీ గ్రహిస్తే “ప్రయత్నం చెయ్యటం మానవ లక్షణం” అని చెప్పారని అర్థమవుతుంది! “ఇంటికి దీపం ఇల్లాలు” అన్నది కూడా ఒక స్త్రీ వెలుగులీనే స్థాయిలో పురుషుడు వెలగలేడని అన్వయం కావచ్చు. అలాంటి దీపాలన్నీ నాలుగు గోడల మధ్యనే ఉండాలన్న స్వార్థం భావ్యమా? స్త్రీలు యింట్లోనూ, ఉద్యోగంలోనూ రెండింటా పని వత్తిడిని తట్టుకోలేరని కొందఱి “బాధ”. ఇంట్లోనే అన్ని రకాల పనులు చెయ్యగలిగే స్త్రీ బైట మఱో పని చెయ్యలేదా?! ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళు తగు సహాయమందిస్తే వత్తిడి తగ్గుతుంది కూడా! కాదా? అసలు స్త్రీ యింట్లో చేసే పనులకు విలువ కట్టగల షరాబులెవ్వఱు? ఉన్నారు… ఎవఱి జీవితాన్ని వాళ్ళే బ్రదికే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తల్లులు సగటున చేస్తున్న ఇంటి పనులకు జీతంతో తూకం వేసింది ఒక సంస్థ. కొన్నేళ్ళ క్రితం చేసిన యీ పరిశోధనలో తేలిన విషయమేంటంటే జీతాలివ్వటమంటూ జఱిగితే ఒక్కో స్త్రీ చేస్తున్న పనులకి (రూపాయలలోకి మార్చితే) సంవత్సరానికి 54 లక్షల రూపాయలు ఇవ్వాలట!! అ.సం.రా దేశంలోనే అలా ఉంటే తల్లిగా/భార్యగా అన్నీ తానే అయి పని చేసే మన దేశంలో?! కనీసం ఊహించగలమా? పైగా “తల్లి ప్రేమని మించింది లే”దంటారు. స్త్రీలందఱికీ వేఱుగా “పిల్లలని ప్రేమించటమెలా?” అని పాఠాలు బోధిస్తున్నారా, లేదే? సహజసిద్ధంగా స్త్రీలలో ఉండే నిస్స్వార్థమైన ప్రేమ తల్లి ప్రేమ రూపంలో కనిపిస్తోందే కానీ వాళ్ళకి అలా ప్రేమించటానికి సమకూర్చబడిన జ్ఞానమూ, రెండో మనసూ లేవు! అది స్త్రీకి స్వతస్సిద్ధమైన లక్షణం కానప్పుడు స్త్రీలే అలా ప్రేమించగలరనుకోవటం కూడా తప్పే! తండ్రి అంతగా ప్రేమిస్తే కాదన్నదెవఱు?! మగవాడు కూడా అలా ప్రేమించలేకపోతే తండ్రి తప్పే కానీ తల్లి గొప్ప కాదు! (ప్రేమిస్తున్నామంటూ స్త్రీల వెనుక విసుగు లేకుండా తిఱిగే పురుషులు ఆ మాత్రం ప్రేమించగలరు లెండి!)

చలనచిత్రాల్లో, సాహిత్యంలో, ఇతర కళల్లో, సమాజంలో, జీవితంలో, విద్యలో, ఉద్యోగాల్లో, పెళ్ళిలో, కుటుంబంలో, ఇంట్లో… దాదాపుగా ప్రతీ చోటా మగవాళ్ళు ఆడవాళ్ళని అణగద్రొక్కే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అసలు తన జీవితంలోకి తొలి అడుగైనా వేయక ముందే తన జీవితాన్ని నిర్దేశించదలచిన మగవాడి కోసం యే ఆడదైనా యెందుకు సర్దుకుపోవాలి? తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూనే మఱొకరిని తన జీవితంలోకి ఆహ్వానించాలని నా కోరిక! స్త్రైణ్యం ముందు పౌరుషమెంత చిన్నబోతుందో గ్రహించి ప్రతి పురుషుడూ ఆ స్త్రైణ్యాన్ని కేవలం ఒప్పుకోవటం కాక దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని అచ్చెఱువొందాలని, ఆరాధించాలని నా ప్రార్థన! మన గుఱించి మనం మఱచిపోయినా మనల్ని కనిపెట్టుకుని ఉన్న ఆ మఱొకరికి ప్రణమిల్లటం తప్పనిసరి!

స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అనీ, పురుషుడు పురుగు లాంటివాడనీ కాదు నా భావన. బేలగా కనిపించినంత మాత్రాన మన వయసు స్త్రీ మన కన్నా లోతుగా ఆలోచించగలిగి, జీవితాన్ని మన కన్నా ధైర్యంగా ఎదుర్కొనగలిగి ఆ పైన ఆ బేలతనాన్ని కూడా ఆస్వాదించగలదని మఱచిపోరాదు. మగవాడు మ్రాన్పడిపోయిన యెన్నో సందర్భాలలో – పురాణాలలో కైకేయి, సత్యభామలతో సహా – స్త్రీ సారథ్యంలోనే సమస్యలు పరిష్కరింపబడటం కద్దు. ఒక దర్శకురాలిగా (director), కార్యనిర్వహణాధికారిగా (manager), సంయామికగా (administrator), ఒక ఆర్థికవేత్తగా (economist), ఒక గురువుగా (teacher), …మగవాడి ఊహకు కూడా అందని యెన్నో రకాలుగా తన జీవితంలో విభిన్నమైన భూమికలు పోషించే స్త్రీకి నా జీవితమే జోహారుగా అర్పిస్తాను!

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రచురించాను కానీ యీ మొత్తమూ నేను గతంలో ఆర్కుట్‌లోని ఒక కూటమిలో ఆంగ్లాంధ్రాలు కలిపి వ్రాసిన ఒక వ్యాసపరంపర – దానినిప్పుడు తెనిగించాను.)

షరా: 1. గతంలో మాతృదినోత్సవం నాడు వ్రాసిన టపాలో యిలాంటి దినాల మీద నా అభిప్రాయాన్ని పంచుకున్నాను కనుక మఱలా చెబితే చర్వితచర్వణమవుతుంది.
2. “పచ్చనైన ప్రతి కథకూ తల్లివేరు పడతులు…” అన్న పంక్తి 1988వ సంవత్సరంలో విడుదలైన “ఆడదే ఆధారం” అన్న చలనచిత్రం కోసం శ్రీ సీతారామశాస్త్రి వ్రాసిన “మహిళలు మహరాణులు…” అన్న నిందాత్మక(స్తుతి)గీతంలోనిది.

అమ్మ వ్రాసిన పాటలు: గోదాదేవి కళ్యాణం

క్రితం వారాంతంలో గుడికి వెళ్ళినప్పుడు “గోదాదేవి కళ్యాణం” అన్న ప్రకటన చూసి “ఆ రోజుకైనా ఏదో ఒకటి వ్రాయాలి గోదాదేవి మీద!” అనుకున్నాను. భారతదేశంలో తెల్లవాఱింది కదా అని యింట్లో అమ్మానాన్నలతో మాట్లాడాను. మాటల్లో అమ్మ చెప్పింది తానో పాట వ్రాసానని. ఆ మాట వినగానే చాలా సంతోషం కలిగింది. అమ్మ వ్రాసిన పాటలు చూసి చాలా కాలమే అయింది. ఇంతలో మఱో ఆనందకరమైన మాట విన్నాను: ఆ పాట గోదాకళ్యాణం గుఱించి యని. “ఆహా, ఇందుకే కాబోలు యెన్నడూ లేనిది నాకు అనిపించింది యీసారి వ్రాయాలని!” అనుకున్నాను. నేను వ్రాస్తే కన్నా అమ్మ వ్రాస్తేనే ఆనందం కదా, ఎంతైనా! సరే, వినిపించమన్నాను. చదివింది. పాడమన్నాను. “నాన్న పాడతారు” అని నాన్నని పిలిచింది. నాన్న పాట విని కూడా చాలా కాలమే అయింది. పైగా నాన్న పాడతారనగానే అర్థమైంది సాహిత్యానికి తానే బాణీ కట్టి ఉంటారని! నా ఊహ నిజమే… హిందోళ రాగంలో సులభమైన బాణీలోకి సాహిత్యం అలా ఒదిగిపోయింది! పండుగ నాటి శుభోదయాన అమ్మ సాహిత్యానికి నాన్న బాణీ కట్టి పాడటం – ఎంత మందికి కలుగుతుందో కదా యింతటి హాయి! ఆ పాటయ్యాక అమ్మ తాను మఱో పాట వ్రాస్తున్నానని ఇవాళ బ్యాంక్‌కి సెలవు కాదు కనుక పూర్తి చేసే అవకాశం లేకపోయిందని చెబుతూ నన్ను ఆ పాట “కాస్త అడ్జస్ట్ చేసి మఱో రెండు చరణాలు వ్రాయి” అని అమ్మ చెబితే సంతోషానికి బదులు బాధే వేసింది. అమ్మ పాటని నేను దిద్దటమా?!? నా తొలి గురువు నన్ను అర్థించటమా! అంతటి అపరాధం నేను చేయలేను. ఇది అమ్మ చేతనే పూర్తి చేయించాలని నిశ్చయించుకున్నాను. కానీ, నా ఆనందం ఆపుకోలేక యీ టపా… రెండు పాటలతోనూ. (దిద్దుకోలు: పైన వ్రాసిన పాఠ్యం యథాతథంగా ఉంచాను కానీ అమ్మ మఱునాటికల్లా రెండో పాట పూర్తి చేసింది, మొదటి పాట కూడా చిన్నదిగా ఉందని తనకి కూడా అనిపించటంతో మఱో రెండు చరణాలు చేర్చింది. ఆ మేఱకు క్రింది పాటల పూర్తిపాఠాలను పొందుపఱిచాను.)

రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ | బాణీ: నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస శర్మ

పల్లవి:
మంగళవధువై గోదాదేవి పల్లకి యెక్కెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!

చరణం 1:
కురులతో పూవులకొండెను చుట్టి నుదుటను కళ్యాణతిలకము దిద్ది
భుజమున పలుకుల చిక్లుకను దాల్చి కులుకుల చెలియలు తన వెంట రాగా

చరణం 2:
నీలాల కన్నుల వజ్రాల కాంతులు, కెంపుల చెక్కిళ్ళు, పగడపు పెదవులు
పచ్చల అంచుల పట్టు వస్త్రాలు – బంగరు తనువుకు నవరత్న సిరులు

చరణం 3:
కోవెలలో కొలువైన శ్రీరంగనాథుని కోరి వచ్చిన ముగ్ధ గోదాదేవి
మనసు యిచ్చెనా, మాల వేసెనా, తానే పూమాలగ మాఱిపోయెనా!

చరణం 4:
సరసుడౌ శ్రీరంగనాథుని సరసన పూవుల ఊయల ఊగిన వేళ
మమతల మాలలు గళమున వేసి పరిణయమాడెను జగదేకవిభుని

ఆఖరి పల్లవి:
మంగళవధువౌ గోదాదేవి పరిణయమాడెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!

*

రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ

పల్లవి:
మధురమధురమీ గోదాచరితం
ముగ్ధహృదయమే వధువైన వైనం

చరణం 1:
తులసీవనముల పావనత్వమే విష్ణుచిత్తుని తనయగ మాఱె –
తాను దాల్చిన పూలమాలనే ప్రణయలేఖగా రంగనికంపె 

చరణం 2:
పరమపవిత్ర పూజావిధిని పాశురములలో వివరించినది
భక్తసులభుడౌ శ్రీరంగవిభునితో “అద్వైతము”నే ఆశించినది

చరణం 3:
మార్గశిరాన మంచువానలో తొలిఝాములలో జలకములాడి
వైకుంఠపతియౌ శ్రీరంగనాథుని వ్రతనిష్ఠలతో మెప్పించినది

చరణం 4:
గోదా భక్తికి ముఱిసిన హరియే దివి నుండి భువికి దిగివచ్చెనులే
అంతరంగమున కొలువైన రంగడు వైభోగముగా వరియించెనులే!

క్రొత్త “యేటి” అభిషేకం: ఆత్మావలోకనానికి అవకాశం

(ఈ టపాకి స్వీయ ఆంగ్లానువాదాన్ని యిక్కడ చదవగలరు.)

పొరపాటున చెయి జాఱిన తరుణం తిరిగొస్తుందా?
ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా?

పొరపడినా, పడినా జాలి పడదే కాలం మన లాగా!
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చే దాకా!

(ఇవి “సిరివెన్నెల” సీతారామశాస్త్రి కూర్చిన మాటలే అయినా మన మనసుల భాష యిది – అది ఏకవచనమే! ఎందుకంటే యీ హెచ్చరికలు చేస్తున్నది మన అందఱి సొంత గొంతుక!)

… ”నీ ప్రశ్నలు నీవి” యని మనకు గుర్తు చేసిన కాలం “ప్రశ్నలోనే బదులు ఉంది” అనీ అంత కన్నా ముందే చెప్పింది. విన్నామా, గ్రహించామా, నేర్చుకున్నామా, పాటించామా అన్నది ముఖ్యం. 2010 వెళ్ళిపోకా తప్పదు. 2011 రాకా తప్పదు. ఆ మధ్యన మనమెంత బాగుపడ్డాము, ఎంత మందిని/దేన్ని ఎలా బాగు చేసాము, ఎన్ని/ఏం పాఠాలు నేర్చుకున్నాము? అన్నవే ముఖ్యం. క్రొత్త సంవత్సరం మఱిన్ని పాఠాలు తెచ్చే లోపు పాత పాఠ్యక్రమం (స్య్ల్లబుస్) మొత్తమూ పునఃపునః ఔపోసన పట్టడం మన వంతు. అది చేయకపోతే ఎన్ని క్యాలెండర్‌లు మాఱినా కాలం-డర్ (కాలమంటే భయం) మాఱదు. క్రొత్త యేటిని మనం ఆహ్వానించటం కాదు చెయ్యవలసినది – అది మన పూనిక లేకపోయినా యెలాగూ వస్తుంది. క్రొత్త యేడనే మందిరంలో మనం అడుగు పెట్టబోయే ముందు మనకై మనమే పూనుకుని ఆత్మశుద్ధి చేసుకోవాలి. మన ప్రతి ఆచారం వెనుక ఒక భయం కానీ భక్తి కానీ ఉంటాయంటారు. ఈ నూతనసంవత్సరాహ్వానం భయంతో చేస్తున్నామా, భక్తితో చేస్తున్నామా, భయమూ భక్తీ మఱచిన మౌఢ్యంతో చేస్తున్నామా అన్నది మనకు తెలియాలి… కాలం మనల్ని దాటిపోకముందే.

మాతృదేవోభవ!

“నువ్వు వ్రాసిన ‘అమ్మ’ కవిత (Google) Buzz చెయ్యచ్చుగా?” అని అడిగిన ఒక మిత్రరత్నానికి నేను చెప్పిన సమాధానం “నేనిలాంటి ‘రోజు’లకి importance ఇవ్వను… సరేలే, అయినా ఆ కవిత Buzz చేస్తాలే” అని. ఆ పనే చెయ్యబోతే నేను అమ్మ గుఱించి గతంలో వ్రాసిన పాట గుర్తొచ్చింది. అదీ ఇదీ కలిపి blog చేద్దామనుకున్నా. అంతలోనే అనిపించింది. “‘అమ్మ’ అన్న కవిత ఇప్పటికే పుస్తకంలో ప్రచురితమయింది, ఆ పాటేమో మఱొకరి బాణీకి వ్రాసినది. మఱి ఈరోజున ‘నాది’ అనుకోదగ్గట్టుగా మఱో క్రొత్త రచన చేద్దా”మనుకుని వ్రాసిన కవిత “అమ్మంటే…?” అన్నది. అమ్మంటే నాకు తెలిసేట్టు చేసిన మా అమ్మకూ, సమస్తచరాచరసృష్టికీ అమ్మే ఆధారమంటూ స్ఫూర్తినిచ్చిన ఎందరో కవులకు, రచయితలకు, అమ్మలా నన్ను ఆదరించిన అందఱికీ నెనఱులతో, జీవకోటిలోని ప్రతి అమ్మకీ నమస్కరిస్తూ… పైన పేర్కొన్న మూడు రచనలూ ఇక్కడ:

http://urlm.in/enty/onDays.jpg – ఆగస్ట్ 13, 2003 నాడు ఈనాడు దినపత్రికలో ఈ “దినాల” పైన నేను వెలిబుచ్చిన అభిప్రాయం (ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు!) (షరా: ఈ వ్యాఖ్యలో “సోదరిల” అనే సంకర మాట నాది కాదు – సంపాదకుల పుణ్యం. “సోదరులు” అంటే అన్నదమ్ములే కాదు, అక్కచెల్లెళ్ళు కూడా అనే సంగతి యెప్పటికి గ్రహిస్తారో!)

కనబడుట లేదు!

పేరు: చాంచల్యం కరిగిన బాల్యం!
గుర్తులు:
తప్పిపోయిన సమయంలో స్వచ్ఛమైన మనసు తొడుక్కుని ఉంది,
మనిషితనం తప్పించి మరే భాషా రాదు,
మనసు భాష కొంచెం అర్థం చేసుకోగలదు
“పైకి తెలియకపోయినా
అందరూ నిన్నే వెతుకుతున్నారు…
నీవు వెళ్ళినప్పటి నుంచి
బ్రతుకుతల్లి నవ్వుని మరచిపోయింది!
వచ్చెయ్యి, నిన్ను నన్నుగా చేసుకుంటా!”

మరణం – బ్రతుకు ఆటకు తప్పని ముగింపు

వ్రాయదగిన, వ్రాయవలసిన అంశాలు బోలెడు నా కళ్ళ ముందే కనిపిస్తున్నా, నా బుఱ్ఱ నిండుగా ఉన్నా కూడా "ఆ… తరువాత వ్రాయొ"చ్చనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను. చివరికి నన్ను కదిలించి పూనుకునేట్టు చేసిన సంఘటన "మరణం". ఇది నేను తెలిసినవాళ్ళెవరో చనిపోతే వచ్చిన తొందరపాటో తన్నుకువచ్చిన బాధనో కాదు. నిజానికి ఈవారం వార్తాపత్రికల్లో వచ్చి, నా కంటబడిన మూడు మరణవార్తలూ నాకు తెలిసిన, నేను తెలియని వాళ్ళవే: కొణిదెల వెంకటరావు, బేనజిర్ భుట్టో, పి. జనార్దనరెడ్డి – ఈ ముగ్గురిలో ఒకరిది సహజమరణం, మరొకరిది హత్య, ఇంకొకరిది హఠాన్మరణం. …ఏదైతేనేం… అన్నీ ఒకటే – మరణం! రెండు నెలల క్రితం కూడా ఒక మరణవార్త విన్నాను… అది నాకు ఎంతో కావలసిన ఒక దగ్గరి బంధువుది. సంతాపం ప్రకటించాలనుకున్నా ఆ బాధ అయినవాళ్ళను చేరదన్న నిస్సహాయస్థితి.

వీళ్ళంతా మనుషులే… నాకు ఏమవుతారో, ఏమి కారో, …ఏమీ కారో! అయితేనేం… అందరి మరణం ఒకేలా కలచివేసింది. …కాదు, ఒక్కో మరణం ఒక్కొక్క తీరుగా… అన్నీ కలిసి ఒకటే మనసును దాదాపుగా ఒకేసారి కలచివేసాయి, అంతే! …అంతేనా? చెప్పలేనిది ఎంతో ఉంది.

నేను తెలుగు చలనచిత్రసీమ "మెగాస్టార్" చిరంజీవికి అభిమానిని ఏమీ కాదు… అయినా అతని తండ్రి మరణం నాలో బాధను కలిగించింది. నేను బేనజిర్ జీవితాన్ని కానీ, రాజకీయాన్ని కానీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు… అయినా హత్య వార్త చూసిన కళ్ళు కొన్ని క్షణాల వరకు కనిపిస్తున్న వార్తని నమ్మలేదు. నేను కాంగ్రెస్‌వాదినీ కాను, జనార్దనరెడ్డినీ ప్రత్యక్షంగా ఎఱగను… అయినా అర్ధరాత్రి అతని మరణవార్త చూడగానే ఇంట్లో కాలు నిలవక బైటికి వచ్చి మేలుకునే ఉన్న నా సహచరులతో ఆ వార్త తాలూకు దిగ్భ్రమను పంచుకున్నాను. గతసంవత్సరం సద్దామ్ హుస్సేన్‌ని ఉరి తీసినప్పుడు కూడా ఏదో తెలియని, ఇదమిద్ధంగా చెప్పలేని ఇబ్బందికరమైన భావన. (నేను సద్దామ్ సానుభూతిపరుడిని కాదని మనవి.) మరణమంటే కలిగిన ఒక రకమైన …జుగుప్స. "జుగుప్స" అన్న భావనే సరైనదా అంటే …తెలియదు నాకూ!

మరణమంటే…?
విధి చేసిన దారుణమా? మదిలో అనంత(ర) స్మరణమా?
జ్ఞాపకాల తోరణమా? జ్ఞాపకాలతో రణమా?
అనుభవాలు రగిల్చిన వ్రణమా? అనుభూతులు మిగిల్చిన ఋణమా?
ఎవరూ మనకేమీ కాకుండా…పోవటమా??
ఎవరికి ఏమైనా మనకేమీ కాకపోవటమా?!

ఏ మరణం ఎక్కువ బాధాకరం?
తెలిసినవారిదా, తెలియనివారిదా?
"పిచ్చి ప్రశ్న!" అనిపించింది…
 ఈ ప్రశ్న మనసులోకి రాగానే!
వెంటనే ప్రశ్నించిన మనసే హెచ్చరించింది –
జవాబు సులువు కాదని!
"పిచ్చి ప్రశ్న" అనిపించే ప్రతి ప్రశ్నా
సులువైన జవాబు లేనిదే అయి ఉంటుందేం?
…జీవితమనే "పిచ్చి ప్రశ్న"కు
మరణమే "సులువైన జవాబు" అవుతుందా?

ఎవరి మరణవార్త తెలిసినా
మనసులో ఏతత్క్షణంలోనే ఎన్నో ఊహలు…
పుట్టుకకీ చావుకీ ప్రతీకలుగా
అలా పుట్టి ఇలా గిడతాయి
"పునరపి జననం పునరపి మరణం"

"ఆత్మ నాశనము లేని"దన్న గీతాకారుడు
ఇన్ని మరణాల మధ్యన తమ తమ ఆత్మలను
హత్య చేసుకుని బ్రతుకుతున్నవాళ్ళను
లక్ష్యపెడతాడా?
ప్రతి ఘటనకీ స్పందించి స్పందించి
స్పందించటమే మరచిపోయేటంతగా
సొంత ఉనికిని కోల్పోతున్న ప్రాణాలను
పట్టించుకుంటాడా?
"కర్మణ్యేవ-అధికారస్తే మాపలేషు కదాచన"
అన్న హెచ్చరిక మనసులో చేరింది –
"ప్రశ్నించుకో, జవాబు కోసం వెతకొ"ద్దని మెత్తగా వినబడింది!
జీవనవేదం సరిక్రొత్తగా అర్థమైంది!

…మరణవార్త చెవినబడ్డ ప్రతిసారీ శ్రీశ్రీ గుర్తుకొస్తాడు… శ్రీశ్రీని కదిలించిన కొంపెల్ల జనార్దనరావు మరణం గుర్తుకొస్తుంది. "నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన – ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?" అని ప్రశించిన వేటూరి వేదాంతం గుర్తుకొస్తుంది. "అనుకోలేదని ఆగవు కొన్ని" అన్న ఆత్రేయ ఆవేదన గుర్తుకొస్తుంది. ఎంతటివాడినైనా కదిలించే ఆ మృత్యురూపం గుర్తుకొస్తుంది. "దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది – ఇంత కన్న సైన్యముండునా?" అన్న గురువు సీతారామశాస్త్రి హెచ్చరిక గుర్తుకొస్తుంది. …నాకు నేను గుర్తుకొస్తాను! (బేనజిర్ చనిపోయిందని తెలిసిన 6-7 గంటలకు, జనార్దనరెడ్డి మరణవార్త తెలిసిన 1-2 గంటల్లోపు మనసులోని తడులకు, సడులకు, సుడులకు అక్షరరూపాన్నిచ్చే యత్నం.)

“ఆ నలుగురు” – నాకు నమ్మకాన్నిచ్చిన చిత్రం

మొదటి సారిగా మనసులో కలిగిన భావాన్ని వెంటనే ఇక్కడ వ్రాస్తున్నాను – అంతగా నన్ను కదిలించింది ఈ చిత్రం. కుటుంబానికి, సమాజానికి సమానమైన ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జీవితం ఈ చిత్రం. ఆ వ్యక్తి గెలిచినట్టుగా చూపించి ఈ చిత్రాన్ని ముగించటం నాలాంటి ఎందఱికో స్ఫూర్తినిస్తుంది. చిత్రకథానుగుణంగా కథానాయకుడు మరణించటం నిరాశావహ దృక్పథాన్ని సూచించినా ఆ మరణానికి కారణమైన నిరాశని అతని గెలుపు త్రోసి రాజంటుంది, ఈ చిత్రాన్ని చూసి స్ఫూర్తి పొందే వారికి ఆ నిరాశ అనవసరమని అనిపింపజేస్తుంది. సినిమా అన్న మాధ్యమం యొక్క అంతర్గత శక్తిని ఈ చిత్రంలోని సందేశం ప్రశంసాత్మకంగా ఉపయోగించుకుంది. ఈ చిత్రం ఇంకా చాలా మందికి సామాజిక స్పృహను, సంఘం కోసం బ్రతకాలనే తపనను కలిగించగలదని నా నమ్మకం.

వెంకటేశ్ మరణం – విషాదభరితం, ఆలోచనాస్పదం, స్ఫూర్తిజనితం

వెంకటేశ్ – అతవి జీవితం గురించి అతను మరణించే ముందు దాకా చాలా మందికి తెలియదు, నాతో సహా. తీరా తెలిసే సరికి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. మరణించిన వెంకటేశ్ ఆశయం వెనుక అతని మాతృమూర్తి ఆదర్శభరితమైన పెంపకముంది. ఆ తల్లి ఈనాటికీ పడుతున్న తపన వెనుక ఆ బిడ్డ చివరి కోరిక ఉంది.

నేడు మన మధ్యన లేని ఒక అసహాయ జీవి ఆవేదన, ఆశయ సాధన, మన దేశపు చట్టంలో ఒక బలీయమైన మార్పు కోసం అతని మరణానంతరం కూడా ఆ తల్లి పడే మథన సార్థకమవాలని, ఈ ఇద్దరి ఆలోచన వెనుక ఆంతర్యాన్ని మనలో కొందఱయినా అర్థం చేసుకుని, అవయవదానం చేయాలని, చేయించాలని ఆశిస్తున్నాను. నేను ఈ సారి భారతదేశం వెళ్ళినపుడు అవయవదానం గురించి వివరాలు సేకరించి, అవయవదానానికి నా ఆమోదం తెలియజేయాలని ఇప్పుడు సంకల్పిస్తున్నాను.

ఆ తల్లి ఉద్యమానికి ఎటువంటి చేయూతనైనా ఇవ్వడానికి సంసిధ్ధంగా ఉన్నాను. అటువంటి వివరాలు ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయగలరు.