Category Archives: వైయక్తికం

మన “వాళ్ళు” సాధించారు… మఱి మనం?

సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం!” అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గోల్కొండ హైస్కూల్ చిత్రంలోని పాటలో వ్రాసినట్టు అనుమానాస్పదరీతిలో మొదలైనా గెలుపును అందుకోవటానికి తగిన విజిగీష (zeal) కనిపించింది “టీమ్ ఇండియా” ఆటగాళ్ళలో ఈ ప్రపంచ కప్ పోటీల్లో! ఆ తపనకు “సాహో” అనుకుని గెలుపు మీద నమ్మకంతో కళ్ళారా నిద్రపోయాను నిన్న రాత్రి. (నిద్ర మధ్యలో 274/6 అన్న స్కోర్ చూసాక మఱీ సుఖంగా పట్టింది నిద్ర.) విజయమెపుడూ అనాయాస విలాసం కాదనీ, అకుంఠిత దీక్ష ఫలితమేనని గుర్తు చేసే ఉత్కంఠను రేపిన పోటీ యని నిద్ర లేచాకనే తెలిసింది.

…నిజానికి నేను క్రికెట్‌నే కాదు, ఏ క్రీడావళినీ (tournament) పెద్దగా అనుసరించను. అక్కడెక్కడో యెవఱో ఆడుతుంటే యిక్కడ నేను నా పని మానుకుని చూసేదేమిటన్న అలక్ష్యమది. “బోడి చదువులు వేస్టు, నీ బుఱ్ఱంతా భోంచేస్తూ! ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు” అని గురువుగారు వ్రాసినా “క్రీడల్లోనైనా స్ఫూర్తిమంతులుగా, విజయార్హులుగా ఉండా”లనే చెప్పిన సూత్రమేనని గ్రహించాను తప్పితే గురువాక్యంగా స్వీకరించి నాది తప్పనుకోలేదు. (ఆ స్ఫూర్తితోనే నాకు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని గీతరచనలోనూ, తెలుగుసినిమా.కామ్ జాలగూటి కోసం వ్యాసాలు, సమీక్షలు, తదితరరచనావ్యాపకంగా మళ్ళించానని యీ సందర్భంగా ప్రస్తావించటం సముచితం.) 1983 ప్రపంచ కప్ క్రికెట్ క్రీడావళి సమయానికి నాకు ఊహ తెలిసినా అప్పట్లో ప్రసారమాధ్యమాలు యింత విరివిగా లేవు. అప్పటికి నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టలేదు. (అప్పటికి నాకు ఐదేళ్ళు.) ఆ తఱువాతి ప్రపంచ కప్ క్రీడావళులు (1987, రిలయన్స్ కప్; 1992, బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్) మాత్రం చాలా వఱకు అనుసరించాను, ముఖ్యంగా 1987 నాటికి క్రికెట్ ఆడేవాడిని కనుక. (1992 నాటికి దాదాపుగా ఆపేసానని చెప్పాలి.) ఈ కారణాల వలన కూడా క్రికెట్ లేద్దా మఱో క్రీడ – ముఖ్యంగా “ప్రేక్షక క్రీడలు” (“spectator sports” అని మా అన్న సూచించిన పదబంధం) – మనిషిలో నింపే స్థైర్యం, ఎదుగుదల లాంటివి నాకు పరిచయం లేదని ఒప్పుకోవాలి. (1985-’86 ప్రాంతాల్లో యండమూరి వ్రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవలలో నాయకుడు రేవంత్ ప్రపంచవిజేతను చదరంగం ఆటలో ఓడించి స్వదేశానికి వచ్చిన సందర్భంలో తన ఆప్తమిత్రుడు జేమ్స్‌తో ఒక సంభాషణ కనిపిస్తుంది: “…నీకు తెలుసా, జేమ్స్? కనీసం ప్రాంతీయ క్రీడామండలి సెక్రెటరీ కూడా ఫార్మాలిటీగా రాలేదు.” “కారణం నువ్వు క్రికెట్ ఆటగాడివి కాకుండా చదరంగం ఆటగాడివి కావటమా?” – “కాదు, తెలుగువాడిని కావటం” అన్న జవాబిప్పుడు అప్రస్తుతం – ఆ సంభాషణలోని వాస్తవం కూడా ఒక కారణం నాకు క్రికెట్ అంటే చిన్న చూపు యేర్పడటానికి. అతిప్రాచుర్యం (Hype) కల్పించినదాని పట్ల విముఖత నాలో చిన్నపుడే మొదలయిందనటానికి యిదొక నిదర్శనం.)

ఈ ఉపోద్ఘాతమంతా యెందుకంటే యీసారి ప్రపంచ కప్ టీమ్ ఇండియాదేనని మొదటి నుంచీ నాకెందుకో నమ్మకంగా ఉండింది. (క్రికెట్‌ని తదేకంగా అనుసరించకపోవటం వలన కూడా నాకీ నమ్మకం కలిగి ఉండవచ్చు.) మొదట్లో కొంత పడుతూ లేస్తూ సాగినా ఓటమినెఱుగని రీతిలో సాగటం నిర్ద్వంద్వంగా నా నమ్మకాన్ని పెంచింది. ప్రపంచ కప్ క్రీడావళి మొదలైనప్పుడే (నాకు క్రికెట్ పట్ల ఆసక్తి పెద్దగా లేదని అప్పటికి అతనికి తెలియక) భారత క్రీడాకారచయం (team) అభిమానుల ఆశలను ప్రతిబింబించేలా నేనొక గీతం వ్రాస్తే దృశ్యకం (video) తయారుచేద్దామనుకుంటున్నానని ఒక దర్శక-మిత్రుడు అడిగాడు. అప్పటి నుంచి కొద్దో గొప్పో ఆసక్తితో అనుసరించాను యీ క్రీడావళినీ, ఆటగాళ్ళ పాత్రపోషణను. నిజానికి పల్లవి వఱకు వ్రాసిన తఱువాత ఆ గీతదృశ్యక రూపకల్పన సాధ్యం కాదని తేలినా ఆ పల్లవి మాత్రం పదేపదే నా నమ్మకానికి రూపంగా నిలిచింది. ప్రఖ్యాత బ్రెజిల్ రచయిత పాలో కొయెలో చెప్పిన ఒక సూక్తిని తెనిగిస్తూ వ్రాసిన ఆ పల్లవి యిదీ:

కోట్ల మందిని ప్రతినిధులుగా మీరు నిలిచిన ఆటలో
కోరి వళ్డ్ కప్ తీసుకొస్తారంటు గెలిచే ఆశతో
మది నమ్మిన విజయం కోసం ప్రతి అడుగూ అంకితమైతే
మన ఱేపటి ఉదయం కోసం జగమంతా వెలుగులనీదా!

ఇన్నేళ్ళ కల నిజమవ్వాలని మీ వెంటుందిలా యీ భరతావని!

పాలో కొయెలో రచనలు నేను చదవలేదు, కానీ నా సొంత సూక్తి ఒకటి ఉంది యిలాంటిదే: “మన నిశ్చయాన్ని నిజం చేయటం కన్నా విధికి మఱో యెంపిక లేదు!” (“Fate has no choice than to realize what we determine.”). నా దృష్టిలో టీమ్ ఇండియా సాధించిన యీ విజయానికి కారణం జట్టులోని ఆటగాళ్ళందఱూ త్రికరణశుద్ధిగా అలాంటి సూక్తుల అంతరార్థాన్ని, స్వప్నమాత్రంగా ఉన్న యీ విజయాన్ని “నమ్మటం”… అదీ గత ప్రపంచ కప్ క్రీడావళి అనుభవం నేర్పిన పాఠాలను నిరంతరం స్మరించుకుని నాటి ఉన్మాదాత్మక అభిమానుల ఆగ్రహజ్వాలలో తమ స్థైర్యానికి చితి పేర్చకపోవటం వల్లనే సాధ్యమైందని నా విశ్వాసం. (వెన్నెల్లో ఆడపిల్ల నవలలోనే ఉన్న “విజయమా విజయమా – వస్తూ శిఖరాన్నెక్కిస్తావు, వెళ్తూ పాతాళానికి తోస్తావు…” అన్న వాక్యం యీ సందర్భంగా గమనార్హం. శ్రీశ్రీ వ్రాసిన ఆఁ.. అన్న కవిత కూడా.)

టెండూల్కర్‌కి నేను అభిమానిని కాను. కారణం పైన పేర్కొన్నట్టు అతనికి అందఱూ యిచ్చే అతిప్రాచుర్యమే. కానీ, కేవలం తన శతాలతోనే 10,000 పఱుగులకు చేఱువలో ఉన్న ఆ స్ఫూర్తిమంతుడి మీద, అతని పట్టుదల, మొక్కవోని దీక్ష , నిరంతర సాధనల పట్ల తగుస్థాయి గౌరవమూ ఉంది. (నా మిత్రులకు కొన్నిసార్లు నా వ్యాఖ్యలు అగౌరవంలానూ అనిపించాయంటే అది వాఱి తప్పు కాదు. 15 మంది ఉన్న జట్టులో ఒక్కరికే – ఆ ఒక్కరూ ఎవఱైనా సరే – పేరు రావటం సముచితం కాదనే నా అభిప్రాయం. ఆ పరిస్థితి వలన అతనొక్కడూ నిష్క్రమిస్తే బ్యాటింగ్ ఆర్డర్ మొత్తమూ పేకమేడలా కూలిపోవటం మనమే కోరి తెచుకున్న దౌర్భాగ్యమనిపిస్తుంది నాకు. ఆ పరిస్థితిని కూడా ఎదుఱీదిన స్ఫూర్తిమంతత్వం గతంలోనూ ఉన్నా శ్రీలంకతో జఱిగిన కప్ క్రీడావళి చివఱి ఘట్టంలోనూ నిదర్శనమైందన్న వాస్తవం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం కావాలి.)

క్రికెట్ చరిత్ర పుటలలో పుంఖానుపుంఖాలుగా ప్రస్తావించదగ్గ జ్ఞాపకాలను ప్రోది చేసుకున్న “టెండూల్కర్ స్థాయి” ఒక పాఠమై నిలిస్తే క్రీడలను అనుసరించని, టెండూల్కర్‌ని పూనుకుని కీర్తించని నాలాంటి వాఱితో సహా తరతరాల భారత యువతకు స్ఫూర్తినీయగలదు. ఈ ప్రపంచ కప్ క్రీడావళిలో టీమ్ ఇండియా పన్నిన క్రీడావ్యూహాలు, ప్రదర్శించిన క్రీడాగరిమ, పోరాటపటిమ నుంచి నేర్చుకొదగ్గ విషయాలను గ్రహించకపోతే యీ విజయానికి అర్థం లేదు. ఇన్నేళ్ళ మన కల నిజం చేసారు వాళ్ళు. మఱి మన గుఱించి కలలు కనే మన బంధుమిత్రులకు, మనకు కూడా మనమే ఆ కలలను నిజం చేయాలన్న స్ఫూర్తితో సాగకపోతే 28 యేళ్ళ చరిత్ర పునరావృతికి ఉనికి ఉండదు. క్రీడాస్ఫూర్తిని దైనందిన జీవితంలోనూ అంతస్థం (internalize) చేసుకుని స్వప్నసాకారం సాధించి నేటి మన ఆనందాన్ని మనల్ని నమ్మినవాళ్ళకు కూడా అందిద్దాం.

కొసమెఱుపు: (ఇది క్రికెట్ గుఱించి కాదు. మన దేశస్థుల్లో కొందఱి మౌఢ్యాన్ని గుఱించి, జాత్యహంకారాన్ని గుఱించి.) పాకిస్థాన్ దేశమన్నా, వాఱి క్రికెట్ జట్టు అన్నా సరిపడని ముస్లిమ్ స్నేహితుడు ఒకడున్నాడు నాకు. ముస్లిమ్‌లంతా పాకిస్థాన్ జట్టుకే అభిమానులని తలచే చాలా మంది మూఢత్వానికి సమాధానం అతని ఫేస్‌బుక్ ప్రవర (profile) చూస్తే యెంత మంది అతని లాగానే, మన లాగానే మన దేశాన్ని మన జట్టుని (నా లాగా యిఱుదేశస్థుల సౌభ్రాతృత్వాన్ని ఆశించే వాఱి కన్నా) అమితంగా ప్రేమిస్తారో తెలుస్తుంది.

నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మఱవద్దు…

పొద్దుటి వార్తలు చూసి మఱిగిన రక్తం చల్లబడిన తఱువాత నాకూ, మఱి కొందఱు స్నేహితులకు వచ్చిన ప్రశ్నలలో నుంచి పుట్టిన టపా యిది:

ఈ ఘోరానికి వ్యతిరేకంగా మనమేమీ చేయలేమా? మా మధ్య చర్చలోనూ, నా బుఱ్ఱలోను వచ్చిన ఆలోచనలివి:

  • ఏం చేసినా శాంతియుతంగానే చేయాలి. ఇక్కడ యిలా జఱిగినదానికి ప్రతిగా తక్కిన ప్రాంతాల ప్రజలు కూడా యిలాంటి మూర్ఖత్వమే ప్రదర్శిస్తే దానికి వ్యతిరేకంగా కూడా యివే చేయాలి.
  • మేథావులతో, గురువులతో, దార్శనికులతో, దిశానిర్దేశకులతో మాట్లాడి మార్గాన్ని నిర్ణయించుకోవాలి.
  • ఒక సన్మిత్రుని సూచన: చందాలు పోగు చేసి అయినా ధ్వంసమైన విగ్రహాలను తిఱిగి చెక్కించాలి. ప్రభుత్వాన్ని ఒప్పించి వాటిని పునఃప్రతిష్ఠించాలి.
  • చట్టపరమైన చర్యలు, పాలనాపరమైన చర్యలు సరైన దిశలోనూ, నిష్పక్షపాతంగానూ లేకపోతే మిన్నకుండే అర్హత లేదు ప్రజాస్వామ్యంలోని ప్రజలకి. గాంధీ ప్రబోధించిన “క్రియాశీలక అహింసామార్గం” మనకు మార్గదర్శనం చేయాలి. తిఱగబడని జనానిదే తప్పు! జనమంటే మనమే!
  • తెలంగాణా ప్రముఖులు అలక్ష్యానికి గుఱయ్యారన్న వాదులో నిజం లేకపోలేదు. (అక్కడ ఉన్న పదుల విగ్రహాలలో యెలా చూసినా ప్రముఖులు చాలా మందిని వదిలేసాము. వాళ్ళలో తెలంగాణా వాఱూ ఉండటం ఆశ్చర్యకరమేమీ కాదు.) ఈ అదనులోనే ఇన్నేళ్ళుగా విగ్రహాలు లేక మిగిలిపోయిన తెలుగు ప్రముఖుల విగ్రహాలు ఊరూరా వాడవాడలా పెట్టిస్తే వాళ్ళ సాంస్కృతిక సేవలు, ఔన్నత్యం అందఱికీ తెలుస్తాయి. అవి తెలియని మౌఢ్యంలోనే జఱిగిన దాడులివి.
  • తప్పు మన అందఱిదీ. ఆవేశంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాక సాంస్కృతికప్రతీకలు కూల్చినప్పుడే యిలాంటి టపా వ్రాసిన నాదీ తప్పేనని ఒకరన్న మాట వాస్తవమే. అందుకు నేను సిగ్గుపడాలన్న మాటా వాస్తవమే. తెలంగాణా సంస్కృతినే కాదు, ఏ రకమైన సంస్కృతినైనా అర్థం చేసుకోలేక యీసడిస్తున్నవాఱెవఱైనా సరే, నేను వాళ్ళని దిద్దే ప్రయత్నమే చేసాను, ఇక ముందూ చేస్తాను. తెలంగాణా ప్రజలంటే సంస్కృతి యంటే చాలా మంది కోస్తాంధ్రులకున్న చిన్నచూపును నేనెప్పుడూ చిన్నగా చూపించే ప్రయత్నం చేయలేదు. అలాంటి చిన్నచూపు మనలో ఉన్నా, మన బంధుమిత్రులలో ఉన్నా మనమూ బాగుపడి వాళ్ళనీ బాగుపఱచాలి.
  • సమస్య మన మధ్యలోనే ఉన్నా మౌనంగా ఉన్న మన తప్పును చూడకుండానే సమస్యని పరిష్కరించబూనటం కూడా మూర్ఖత్వమే. అది మనలో లేకుండా చూసుకుందాం.
  • తెలుగువాళ్ళంతా కలిసి ఉండటానికి మనం చేస్తున్నదేముంది? తెలంగాణా విడిపోరాదని తేల్చిచెప్పటం తప్పించి అక్కడి ప్రజలు మనలో ఒకటిగా, మనతో కలివిడిగా ఉండటానికి మనం చేస్తున్నదేముంది? సమైక్యత అంటే మనకు కావలసినట్టు ఉండటమూ కాదు, ఇప్పుడున్న స్థితిలోనే ఉండిపోవటం కాదు… ఆ ఐక్యభావన పెంపొందించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరమూ పాలు పంచుకోవాలి.

పైన పేర్కొన్న చర్యలలో కొన్ని నేను, ఒకరిద్దఱు మిత్రులు ఇప్పటికే మొదలుపెట్టాము. మఱి మీరు? (ఇంకా మనం చేయదగిన పనులేమైనా ఉంటే మీ వ్యాఖ్యలతో తెలియజేయండి.)

షరా: శీర్షికలోని గీతం డా. సి. నారాయణరెడ్డి గారు “కోడలు దిద్దిన కాపురం” చిత్రం కోసం వ్రాసినది. “ఈ నల్లని రాలలో యే కన్నులు దాగెనో…” అంటూ ఆయన “అమరశిల్పి జక్కన” చిత్రానికి వ్రాసిన గీతం “విగ్రహాలే కదా, మళ్ళీ కట్టుకోవచ్చు!” అన్నవాళ్ళకి సమాధానమిస్తుంది.

అమ్మ వ్రాసిన పాటలు: గోదాదేవి కళ్యాణం

క్రితం వారాంతంలో గుడికి వెళ్ళినప్పుడు “గోదాదేవి కళ్యాణం” అన్న ప్రకటన చూసి “ఆ రోజుకైనా ఏదో ఒకటి వ్రాయాలి గోదాదేవి మీద!” అనుకున్నాను. భారతదేశంలో తెల్లవాఱింది కదా అని యింట్లో అమ్మానాన్నలతో మాట్లాడాను. మాటల్లో అమ్మ చెప్పింది తానో పాట వ్రాసానని. ఆ మాట వినగానే చాలా సంతోషం కలిగింది. అమ్మ వ్రాసిన పాటలు చూసి చాలా కాలమే అయింది. ఇంతలో మఱో ఆనందకరమైన మాట విన్నాను: ఆ పాట గోదాకళ్యాణం గుఱించి యని. “ఆహా, ఇందుకే కాబోలు యెన్నడూ లేనిది నాకు అనిపించింది యీసారి వ్రాయాలని!” అనుకున్నాను. నేను వ్రాస్తే కన్నా అమ్మ వ్రాస్తేనే ఆనందం కదా, ఎంతైనా! సరే, వినిపించమన్నాను. చదివింది. పాడమన్నాను. “నాన్న పాడతారు” అని నాన్నని పిలిచింది. నాన్న పాట విని కూడా చాలా కాలమే అయింది. పైగా నాన్న పాడతారనగానే అర్థమైంది సాహిత్యానికి తానే బాణీ కట్టి ఉంటారని! నా ఊహ నిజమే… హిందోళ రాగంలో సులభమైన బాణీలోకి సాహిత్యం అలా ఒదిగిపోయింది! పండుగ నాటి శుభోదయాన అమ్మ సాహిత్యానికి నాన్న బాణీ కట్టి పాడటం – ఎంత మందికి కలుగుతుందో కదా యింతటి హాయి! ఆ పాటయ్యాక అమ్మ తాను మఱో పాట వ్రాస్తున్నానని ఇవాళ బ్యాంక్‌కి సెలవు కాదు కనుక పూర్తి చేసే అవకాశం లేకపోయిందని చెబుతూ నన్ను ఆ పాట “కాస్త అడ్జస్ట్ చేసి మఱో రెండు చరణాలు వ్రాయి” అని అమ్మ చెబితే సంతోషానికి బదులు బాధే వేసింది. అమ్మ పాటని నేను దిద్దటమా?!? నా తొలి గురువు నన్ను అర్థించటమా! అంతటి అపరాధం నేను చేయలేను. ఇది అమ్మ చేతనే పూర్తి చేయించాలని నిశ్చయించుకున్నాను. కానీ, నా ఆనందం ఆపుకోలేక యీ టపా… రెండు పాటలతోనూ. (దిద్దుకోలు: పైన వ్రాసిన పాఠ్యం యథాతథంగా ఉంచాను కానీ అమ్మ మఱునాటికల్లా రెండో పాట పూర్తి చేసింది, మొదటి పాట కూడా చిన్నదిగా ఉందని తనకి కూడా అనిపించటంతో మఱో రెండు చరణాలు చేర్చింది. ఆ మేఱకు క్రింది పాటల పూర్తిపాఠాలను పొందుపఱిచాను.)

రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ | బాణీ: నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస శర్మ

పల్లవి:
మంగళవధువై గోదాదేవి పల్లకి యెక్కెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!

చరణం 1:
కురులతో పూవులకొండెను చుట్టి నుదుటను కళ్యాణతిలకము దిద్ది
భుజమున పలుకుల చిక్లుకను దాల్చి కులుకుల చెలియలు తన వెంట రాగా

చరణం 2:
నీలాల కన్నుల వజ్రాల కాంతులు, కెంపుల చెక్కిళ్ళు, పగడపు పెదవులు
పచ్చల అంచుల పట్టు వస్త్రాలు – బంగరు తనువుకు నవరత్న సిరులు

చరణం 3:
కోవెలలో కొలువైన శ్రీరంగనాథుని కోరి వచ్చిన ముగ్ధ గోదాదేవి
మనసు యిచ్చెనా, మాల వేసెనా, తానే పూమాలగ మాఱిపోయెనా!

చరణం 4:
సరసుడౌ శ్రీరంగనాథుని సరసన పూవుల ఊయల ఊగిన వేళ
మమతల మాలలు గళమున వేసి పరిణయమాడెను జగదేకవిభుని

ఆఖరి పల్లవి:
మంగళవధువౌ గోదాదేవి పరిణయమాడెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!

*

రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ

పల్లవి:
మధురమధురమీ గోదాచరితం
ముగ్ధహృదయమే వధువైన వైనం

చరణం 1:
తులసీవనముల పావనత్వమే విష్ణుచిత్తుని తనయగ మాఱె –
తాను దాల్చిన పూలమాలనే ప్రణయలేఖగా రంగనికంపె 

చరణం 2:
పరమపవిత్ర పూజావిధిని పాశురములలో వివరించినది
భక్తసులభుడౌ శ్రీరంగవిభునితో “అద్వైతము”నే ఆశించినది

చరణం 3:
మార్గశిరాన మంచువానలో తొలిఝాములలో జలకములాడి
వైకుంఠపతియౌ శ్రీరంగనాథుని వ్రతనిష్ఠలతో మెప్పించినది

చరణం 4:
గోదా భక్తికి ముఱిసిన హరియే దివి నుండి భువికి దిగివచ్చెనులే
అంతరంగమున కొలువైన రంగడు వైభోగముగా వరియించెనులే!

శివోహమ్

అసంభవమై,
ప్రళయకాల జృంభణమై,
లయమే తన లయగా
భూనభోంతరాళాలు ఏకమయ్యేలా
చెలరేగిన కరాళ నృత్యం –
అస్తవ్యస్తమైన ఆంగికంతో
తెలియని సంయోగాన్ని సాధించే యత్నం…
చిరపరిచిత అభ్యాసం,
స్వరపరచని విన్యాసం!
విలయకారుని సాన్నిధ్యంలో
సమయపాలన సరి నైవేద్యం!

లయబద్ధమైన ప్రతి అడుగూ
అహంభావాన్ని దూరం చేస్తూ
విలయమే ఆవహించినట్టు
స్వయంగా సమర్పితమౌతూ
అప్రయత్నంగా
అన్యోన్యత నాహ్వానిస్తూ
అనాలోచితంగా
అధిదేవుని కంకితమౌతూ…

శంకరుని స్వేదామృతగీతాలే
జగన్మాత క్షీరోధృతిపాతాలై,
మనశ్శాంతి సంకేతాలై,
అచంచల విశ్వాసాలై,
లోకనాథుని నిశ్వాసాలై,
శివకరుణాదృక్‌శీకరాలే
సర్వేంద్రియ వశీకరాలై…
స్పందించే జగత్సమస్తం
మౌనాశ్రిత సమ్మోహితం!

పదఘట్టన లేదు,
నవజాతశిశువు లాస్యం తప్ప!
కనులు తెరిచిన తొలి సంభ్రమం –
అస్తిత్వంలో నాస్తి యైనట్టు
భువనఘోషలో చిరు కూడిక –
తుది శ్వాసలోని జీవమే
పరమాద్భుతమైనట్టు…
ఇక నృత్యం లేదు,
ఉచ్ఛ్వాసం లేదు,
సశరీర సాక్ష్యం లేదు,
అత్యుత్తమ జ్ఞానం లేదు,
ఐక్యమయ్యే కారణం లేదు!
ఉన్నది …ఒక్కటే!

(మూలం: <http://parnashaala.blogspot.com/2009/05/blog-post.html> వద్ద మహేశ్ గారు ఉటంకించిన శేఖర్ కపూర్ విరచిత ఆంగ్లకవిత “Dancing with Shiva”.)

షరా: ఆ పుటలోనే ఉన్న మహేశ్ గారి తెలుగు సేత కానీ వ్యాఖ్యాల్లో కనిపించే రేరాజు గారి ప్రయత్నం కానీ ఈ కవితకు మూలం కాదు. అన్నీ ఒకే కవితకు అనుసృజనలు/అనువాదాలు కనుక కొన్ని పదాలు, భావాలు ఒకేలా అనిపించవచ్చు. మూలం కన్నా నాకు మహేశ్ గారి ప్రయత్నమే నచ్చింది. కానీ, చాలా వరకూ సరళమైన భాషతోనే చేసిన మహేశ్ గారి అనువాదంలో యేదో లోపించిందన్న భావన కలిగింది. “చక్కని అనువాదం. కానీ, మరింత చిక్కగా ఉండి ఉండవచ్చు.” అన్న వ్యాఖ్య వారి ఫేస్‌బుక్ గోడ మీద వ్రాసాక నేనూ ప్రయత్నించాలనిపించింది. (రేరాజు గారి అనువాదం చూసే లోపే నేను వ్రాద్దామని నిర్ణయించుకున్నాను కనుక ఆయన అనువాదం నేను “చూసాను” కానీ చదవలేదు.) నా అనువాదం న్యాయం చేసిందని నేను అనుకోవటంలేదు. నిజానికి ఇప్పుడు చూస్తే నా అనువాదం చిక్కగా ఉంది కానీ, చక్కగా లేదనే నా అనుమానం. కానీ, ఒకే ఆంగ్లమూలానికి మూడు అనువాదాలు చదివే అవకాశం ఎప్పుడో కానీ రాదు కనుక ఆ ఉద్దేశమైనా నెరవేరుతుందని నా ఊహ.

శ్రీ వేటూరి సుందరరామమూర్తి: ఒక చిర(ఱు) జ్ఞాపకం

“రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే!”
“ఆకాశాన సూర్యుడుండడు సందెవేళలో!”
“వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి”
“గతించిపోవు గాథ నేననీ!”
“నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?”

ఇలా ఎన్ని వ్రాసినా వేదాంతి, కవి అయినా తన జీవనగీతం కూడా ఇలాగే పాడవలసి వస్తుందని అనిపించనంత చిరంజీవి వేటూరి! “అజరామరం” అని ఎన్నో విషయాల్లో అనాలోచితంగా అనేస్తాం! “నిజంగా జర (ముసలితనం), మరణం లేనివి ఉంటాయా?” అంటే ఉండవేమో… కానీ వేటూరి గారు మాత్రం వయసు వల్ల శరీరం వంగిపోయినా, మనసూ అందులోని భావాలు మాత్రం జరామరణాలకి అతీతంగా, ఎన్ని యేళ్ళైనా యవ్వనంతో పరవళ్ళు తొక్కుతాయనిపిస్తుంది!

“వళిభిర్ముఖమాక్రాన్తమ్ పలితేనామ్ కితమ్ శిరః గాత్రాణి శిథిలాయన్తే తృష్ణైకా తరుణాయతే!”
(“మొహమంతా ముడతలు వచ్చేసాయి, తల మీది వెంట్రుకలు తెల్లబడ్డాయి, శరీరం శిథిలమైపోయింది, కానీ [నాలో] తపన మాత్రం యౌవనోత్సాహంతోనే ఉంది!”) భర్తృహరి వ్రాసిన ఈ శ్లోకం వేటూరి గారికి నప్పినట్టుగా ఎవరికీ నప్పదేమో.

నేను శ్రీ  వేటూరి సుందరరామమూర్తి గారిని కలవటం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. “తానా 2000” కోసమని మా యూనివర్సిటీ పట్నానికి 250 మైళ్ళ దూరంలోని డాలస్‌కి వచ్చిన వేటూరి గారిని మా చిన్న ఊరి వాస్తవ్యులైన ప్రకాశరావు గారు, కొత్తప్ప చెట్టి గారు, చెట్టి గారి శ్రీమతి లక్ష్మి గారు మా యూనివర్సిటీకి తీసుకువచ్చారు. అప్పటికి నేను TeluguCinema.Com లో చేరి ఆరు నెలలైనా కాలేదు! అప్పటి దాకా నేను ఎవరినీ interview చెయ్యాలని, చెయ్యగలననీ అనుకోనూలేదు! అటువంటి పరిస్థితులలో వేటూరి గారిని interview చేయటానికి ఆస్కారముందా అని చెట్టిగారిని అడిగాను, శ్రీ అట్లూరి గారి ప్రోత్సాహంతో. అంతటి ఆఖరి నిముషంలో అడిగినా వేటూరి గారు వెంటనే ఒప్పుకున్నారు!

సినీపరిశ్రమలో ఎవరితోనూ కాసేపైనా నిలబడి మాట్లాడని నేను నా మొదటి interview ఏకంగా గుగ్గురువులైన వేటూరి గారినే చెయ్యాలనేసరికి అలవి కాని ఉత్సాహం! ప్రశ్నలు తయారు చేసుకుందామనే సరికి భయం మొదలైంది. వేటూరి గారు ఆహూతులైన 50-60 మంది విద్యార్థులు, కొన్ని తెలుగు కుటుంబాల వాళ్ళు ఆసక్తిగా వింటూండగా ఎన్నో విషయాలు మాట్లాడారు. వారి మనసు విప్పి మాట్లాడుతున్న తీరుకి నాలో భయం చాలా వరకే పోయిందనిపించింది. (ఆ ఉపన్యాసం అవగానే interview చెయ్యాలి.) ఆ తరువాత నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసారు చెట్టి గారు, ప్రకాశరావు గారు. వెంటనే పాదాభివందనం చేసాను. నిజం ఒప్పుకోవాలంటే అందులో భక్తి కన్నా వణుకు ఎక్కువై తూలి పడతానేమో అన్నంత తడబాటు కలిగి అదే ఊపుతో ఆయన కాళ్ళ మీద పడ్డాను. ఆశీర్వదించి, భుజాలు పట్టుకుని లేపారు. తడబాటు చేతులూ కాళ్ళ నుంచి మాటకి పాకింది! ఎలాగో చెప్పాను ఆయనకి interview సంగతి. “ఓహో, మీరేనా? రండి. ఎక్కడ కూర్చుందాం?” అన్నారు. అప్పటికి నా వయసు 22! ఆ వయసులో “మీరు” అనిపించుకోవటమే ఇబ్బందికరమైతే నా కన్నా 40 యేళ్ళు పెద్దయిన పండితుడూ, యశోవంతుడు అయిన వేటూరి గారు నన్ను “మీరు” అని సంబోధించటం నా తడబాటుని మరీ పెంచేసింది. “ఇక్కడే” అని అప్పటికే అక్కడ వేసుకున్న కుర్చీలు, బల్లా చూపించి నన్ను ఏకవచనంతోనే సంబోధించమని అర్థించాను. “ఇక్కడికొచ్చి పెద్ద చదువులు చదువుతున్నారు… మర్యాద నీలోని సరస్వతికి!” అన్నారు. “స్వామీ, సరస్వతి మీలోనే ఉన్నది. నేను విద్యను అర్థిస్తున్న వాడిని.” అన్నాను. (అయినా ఆయన “మీరు” అంటూనే మాట్లాడారు చాలా వరకూ. అదీ ఆయన సంస్కారం!) ఇంతలోనే నా చేతిలో ఏదో పుస్తకం కూడా ఉండటం చూసి ఆయనకున్న అనుభవం దృష్ట్యా వెంటనే అడిగారు, “మీరు కూడా కవితలు వ్రాస్తారా?” అని. ఊహించని (సమయంలో వచ్చిన) ప్రశ్న! “పాటలు వ్రాస్తాను, పద్యాలు వ్రాయటమూ నేర్చుకుంటున్నాను. కవితలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాను.” అన్నాను బెరుకుగానే. “భేష్, రచనాసరస్వతి కూడా ఉంది మీలో! …అవి చివర్లో చూద్దాం. ముందు interview కానివ్వండి” అన్నారు. చెప్పాను, నాకదే మొదటి interview అని, తప్పులు చేస్తే క్షమించమని. “నేనూ పాత్రికేయుడిగానే మొదలు పెట్టాను నా ప్రస్థానం. నువ్వూ ఆ దారిలో ఉన్నావన్న మాట! ఏమీ భయపడకు.” అని భుజం తట్టారు. ధైర్యం తెచ్చుకుని interview పూర్తి చేసాను. ఓపికగా సమాధానం చెప్పారు అన్ని ప్రశ్నలకీ. చివరగా నన్నూ మళ్ళీ ప్రోత్సహించారు మొదటిదైనా చాలా బాగా చేసానని. ఆయన మాట వరసకి అన్నారేమో తెలియదు కానీ అలా జరిగిన అంకురార్పణ తరువాత నేను TeluguCinema.Com కోసం చేసిన పదుల interviewలకు నమ్మకాన్నిచ్చే పునాది అయింది! అప్పటికి ఇంకా అప్పుడప్పుడే కలం విదిలిస్తున్న నేను ఆయనకి నా వ్రాతలు చూపించాలి అనుకోవటం సాహసమే ఒక రకంగా. (వాటిని “రచనలు” అనే సాహసం కూడా చేసే ధైర్యం లేదు అప్పటికి పూర్తిగా.) నా పిల్లవ్రాతలతో తన సమయం వృధా చేసారని గద్దిస్తారేమోనన్న భయం లోలోపల ఉండింది. అందుకే అసలు చూడమని ఆయనని ఎలా అడగాలా అని మల్లగుల్లాలు పడుతున్నాను ఆయన్ని కలిసే సరికే. అటువంటిది, ఆయనకై ఆయన నా చేతిలో పుస్తకాన్ని బట్టి నా అంతరార్థం గ్రహించటం నా నెత్తి మీద పాలు పోసినట్టైంది! భయమూ తగ్గింది, నా వ్రాతల్లో పస లేకున్నా ఆయనకై ఆయనే చూస్తానన్నారు కనుక ఎక్కువగా తిట్టరేమోనని. Interview సాగుతున్న సమయంలోనే ఆయన ఎంతటి సౌమ్యులో అర్థమైంది. దానితో కోపగించుకోరని పూర్తిగా ధైర్యం వచ్చింది. Interview పూర్తయ్యాక ఆయన తన కళ్ళజోడు తెచ్చుకోలేదనీ, కనుక నన్నే నా వ్రాతలు పైకి చదవమని పురమాయించారు. మామూలుగానైతే గొంతులో పచ్చి వెలక్కాయ పడేదేమో! కానీ అప్పటికే ఆయన ఇచ్చిన ధైర్యం అచంచలమై నేనే గొంతు సవరించుకున్నాను. ఆయనకి విపించిన పద్యాలు మూడో నాలుగో. వాటిలో రెండు ఆయన మీదే వ్రాసినవని గుర్తు. (“సుందరరామ్మూర్తి గారి సొంపగు పాటల్” అన్నది ఒక పద్యం చివరి పాదమైతే “వేటూరీ, మేటివీవు విజ్ఞతనందున్” అన్నది రెండవది. పూర్తి పద్యాలు నా దగ్గర లేవు.) ఆయన విద్వత్తును మెచ్చుకుంటూ, కీర్తిస్తూ పద్యాలు వ్రాయగలిగినా అయాచితంగా వాటిని నా గొంతుతో నేనే చదివి ఆయనకి వినిపించే అవకాశం వస్తుందని నేను ఊహించలేదు! నే వినిపించిన మరో కంద పద్యం ఆయనకి చాలా నచ్చింది: “ఫ్యాషనులని నేటి యువత / భాషను ఖూనీలు జేయ భావము చచ్చెన్ / కాషను చెప్పెడు పెద్దల / ఘోషను పట్టించుకొనరు ఘోరం కాదా!” అన్నది ఆ పద్యం. “బాగా వ్రాసారు, మీరు కూడా సరైన పాళ్ళలో పరభాషా పదాలు కలుపుతూ. చక్కగా ఉంది” అన్నారు. (అప్పటికి interview లోనే పరభాషా పదాల వాడకంపై కాస్త చర్చ జరిగింది.) ఒక పాట కూడా చదివి వినిపించాను: “కొమ్మల్లో కోయిలమ్మ కొత్త పాట పాడగా, గున్నమావి చెట్టు లేత చిగురులేయగా – వసంతమొచ్చెనే ఇలకే అందమై వనములన్ని పచ్చని వెలుగు నింపగా! రావే వసంతమా, వయ్యారమై ఉగాదితో – చేసెయ్ సరాగమే పచ్చపచ్చని వనాలలో” అన్నది ఆ పల్లవి. “ఇంకొన్నేళ్ళు… అక్కర్లేదు, ఇంకొన్నాళ్ళు ఇలాగే వ్రాసినా మీరు సినిమాల్లో గీతరచయిత అయిపోవచ్చు… మీకు ఆ ఉద్దేశం ఉంటే” అన్నారు. కేవలం ప్రోత్సాహకరంగానే ఆ మాటలన్నారని ఇప్పటికీ నమ్ముతున్నా కానీ… నా ఉద్దేశాలన్నీ తెలిసినట్టు, నా మనసు చదివేసినట్టు నాకు కావలసిన ప్రోత్సాహమే ఆయన ఇవ్వటంతో నా జన్మ ధన్యమైంది! అప్పటి దాకా “గీతరచయితని కాగలనా? నాలో నిజంగానే ఒక ‘కవి’ ఉన్నాడా?” అన్న ప్రశ్నలకి ఖచ్చితమైన సమాధానం లేని నా మనసులో ఒక నూత్నతేజాన్ని నింపాయి శ్రీ వేటూరి సుందరామమూర్తి గారి మాటలు!

ఆ ప్రోత్సాహంతో ఇప్పటికీ కలం కదులుతూనే ఉంది, ఆయన మాటలు మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఈ మధ్యే నేను అమెరికాకి వచ్చి పదేళ్ళయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాల పుటలు తిప్పాను. “మళ్ళీ వేటూరి గారిని కలవనేలేదు. ఇప్పటికైనా సెప్టెంబరు 8 కి ఆయనని interview చేసి పదేళ్ళైన సందర్భంగా ఈ పదేళ్ళూ ఆయన పలికిన ప్రోత్సాహపు మాటలే నా పురోగతికి ఎంతటి సహాయం చేసాయో ఆయనకి చెప్పుకుందామని, ఆయన ఆశీస్సులు తీసుకుందామని అనుకున్నాను. ఒకరిద్దరు మిత్రులతో ఆ మాటే అన్నాను కూడా. ఇంతలోనే… ఈ వార్త!

“పోయినోడు ఇక రాడు, ఎవడికెవడు తోడు! ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు! నువ్ పుట్టిన మన్నేరా నిన్ను తిన్నది! కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది! చావుబ్రతుకులన్నవి ఆడుకుంటవి!” …అని ఆయన మాటల్లోనే అనుకోవాలా?

“మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ! కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు! తరతరాలకూ తరగని వెలుగవుతారు, ఇలవేలుపులౌతారు!” …అన్న ఆయన మాటల స్ఫూర్తితోనే ముందుకు సాగిపోవాలా?

“నీ పాట ఒక్కటే నిజం లాగా / నిర్మలమైన గాలి లాగ / నిశ్శబ్ద నదీ తీరాన్ని పలకరించే / శుక్త మౌక్తికం లాగ … నువ్వు లేవు, నీ పాట ఉంది” …అన్న దేవరకొండ బాలగంగాధర తిలక్ మాటలే చెవుల్లో మోగుతుంటే “రాజు మరణించె, ఒక తార నేల రాలె / కవియు మరణించె నొక తార గగనమెక్కె” …అన్న జాషువా మాటల్లోని నిజాన్ని చూసి సంతోషించాలా?

“జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువమ్ జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వమ్ శోచితుమర్హసి” …అని గీతాకారుడు చెప్పినది సబబే! (పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు.అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.) ఎందుకంటే, భర్తృహరి అన్నట్టు కవుల యశస్సు (అనే శరీరం) జరామరణాల భయానికి అతీతమైనది!

“జయన్తి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరాః నాస్తి యేషామ్ యశఃకాయే నాస్తి జరామరణజమ్ భయమ్!” – నిజమే, కళాకారులకు మరణం లేదు! ముఖ్యంగా కవులకు! అతిముఖ్యంగా శ్రీ వేటూరి సుందరరామమూర్తి వంటి కవికి – తెలుగు సినీజగత్తులో అతి సాధారణ సందర్భాల్లో వచ్చే పాటల్లో కూడా కవిత్వం గుప్పించి మెప్పించవచ్చని నిరూపించి సజీవతార్కాణంగా తరతరాలకూ దిక్సూచిగా నిలబడిన మనీషికి!

మాతృదేవోభవ!

“నువ్వు వ్రాసిన ‘అమ్మ’ కవిత (Google) Buzz చెయ్యచ్చుగా?” అని అడిగిన ఒక మిత్రరత్నానికి నేను చెప్పిన సమాధానం “నేనిలాంటి ‘రోజు’లకి importance ఇవ్వను… సరేలే, అయినా ఆ కవిత Buzz చేస్తాలే” అని. ఆ పనే చెయ్యబోతే నేను అమ్మ గుఱించి గతంలో వ్రాసిన పాట గుర్తొచ్చింది. అదీ ఇదీ కలిపి blog చేద్దామనుకున్నా. అంతలోనే అనిపించింది. “‘అమ్మ’ అన్న కవిత ఇప్పటికే పుస్తకంలో ప్రచురితమయింది, ఆ పాటేమో మఱొకరి బాణీకి వ్రాసినది. మఱి ఈరోజున ‘నాది’ అనుకోదగ్గట్టుగా మఱో క్రొత్త రచన చేద్దా”మనుకుని వ్రాసిన కవిత “అమ్మంటే…?” అన్నది. అమ్మంటే నాకు తెలిసేట్టు చేసిన మా అమ్మకూ, సమస్తచరాచరసృష్టికీ అమ్మే ఆధారమంటూ స్ఫూర్తినిచ్చిన ఎందరో కవులకు, రచయితలకు, అమ్మలా నన్ను ఆదరించిన అందఱికీ నెనఱులతో, జీవకోటిలోని ప్రతి అమ్మకీ నమస్కరిస్తూ… పైన పేర్కొన్న మూడు రచనలూ ఇక్కడ:

http://urlm.in/enty/onDays.jpg – ఆగస్ట్ 13, 2003 నాడు ఈనాడు దినపత్రికలో ఈ “దినాల” పైన నేను వెలిబుచ్చిన అభిప్రాయం (ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు!) (షరా: ఈ వ్యాఖ్యలో “సోదరిల” అనే సంకర మాట నాది కాదు – సంపాదకుల పుణ్యం. “సోదరులు” అంటే అన్నదమ్ములే కాదు, అక్కచెల్లెళ్ళు కూడా అనే సంగతి యెప్పటికి గ్రహిస్తారో!)

ఏంటి, పదేళ్ళా…!

నిజమే…
క్యాలెండర్‌లో “20” తరువాత
“0” కాస్తా “1” అయింది!
“ఒకటి”కి ఎంత విలువనో కదా!అబ్బే పదేళ్ళేనా…
ఎంతో నేర్పించింది జీవితం…
చేరదీసి తట్టి, చాచి పెట్టి కొట్టి
చాలానే నేర్పింది జీ..వి..తం!
నేనే… ఏమీ నేర్చుకోలేదు!విదేశంలో పదేళ్ళున్నానంటే…
“ఆహా!” అన్నవాళ్ళే అంతా!
“అయ్యో” అనుండాలని ఎందరికి తెలుసు!?
తల్లిభూమి చేదయ్యిందా?అదేంటో…
మనసు బ్రతికే ఉంది …ఇంకా!
కన్నీళ్ళూ నేలలోకి ఇంకుతూనే ఉన్నాయి …ఇంకా!
మధురమైన మట్టి వాసన మరి
తట్టి లేపదేం మనసును?
మనసు బ్రతికే …ఉందంటావా?!ఎవరెవరో పలకరించారు,
ప్రేమ పన్నీరు చిలకరించారు,
ప్రేమ పైననే చితులు పేర్చారు,
“ఆత్మ నాశనము లేనిది” అని కృష్ణుడు చెప్పలేదూ!?
ప్రేమ మాత్రం తక్కువ తిన్నదా?ఎన్నెన్ని జరిగాయో…
ఏం జరిగితేనేం…
అంతా అలాగే ఉంది…
నే..ను తప్పించి
అం..తా అ..లా..గే…!గడిచిన పదేళ్ళలో…
నా వయసు ఎన్నేళ్ళు పెరిగిందో,
నా మనసు ఎన్నాళ్ళు మరిగిందో,
నా కలలు ఎన్నెన్ని కరిగాయో,
ఏ మార్పులెందుకని జరిగాయో…
తెలుసుకోవటానికి ఆగే అవసరం లేకుండా
జీవితం ఎలాగోలా సాగుతూనే ఉంది…
హమ్మయ్య!

(అమెరికాకి వచ్చి పదేళ్ళయిన సందర్భంగా…)

మరణం – బ్రతుకు ఆటకు తప్పని ముగింపు

వ్రాయదగిన, వ్రాయవలసిన అంశాలు బోలెడు నా కళ్ళ ముందే కనిపిస్తున్నా, నా బుఱ్ఱ నిండుగా ఉన్నా కూడా "ఆ… తరువాత వ్రాయొ"చ్చనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను. చివరికి నన్ను కదిలించి పూనుకునేట్టు చేసిన సంఘటన "మరణం". ఇది నేను తెలిసినవాళ్ళెవరో చనిపోతే వచ్చిన తొందరపాటో తన్నుకువచ్చిన బాధనో కాదు. నిజానికి ఈవారం వార్తాపత్రికల్లో వచ్చి, నా కంటబడిన మూడు మరణవార్తలూ నాకు తెలిసిన, నేను తెలియని వాళ్ళవే: కొణిదెల వెంకటరావు, బేనజిర్ భుట్టో, పి. జనార్దనరెడ్డి – ఈ ముగ్గురిలో ఒకరిది సహజమరణం, మరొకరిది హత్య, ఇంకొకరిది హఠాన్మరణం. …ఏదైతేనేం… అన్నీ ఒకటే – మరణం! రెండు నెలల క్రితం కూడా ఒక మరణవార్త విన్నాను… అది నాకు ఎంతో కావలసిన ఒక దగ్గరి బంధువుది. సంతాపం ప్రకటించాలనుకున్నా ఆ బాధ అయినవాళ్ళను చేరదన్న నిస్సహాయస్థితి.

వీళ్ళంతా మనుషులే… నాకు ఏమవుతారో, ఏమి కారో, …ఏమీ కారో! అయితేనేం… అందరి మరణం ఒకేలా కలచివేసింది. …కాదు, ఒక్కో మరణం ఒక్కొక్క తీరుగా… అన్నీ కలిసి ఒకటే మనసును దాదాపుగా ఒకేసారి కలచివేసాయి, అంతే! …అంతేనా? చెప్పలేనిది ఎంతో ఉంది.

నేను తెలుగు చలనచిత్రసీమ "మెగాస్టార్" చిరంజీవికి అభిమానిని ఏమీ కాదు… అయినా అతని తండ్రి మరణం నాలో బాధను కలిగించింది. నేను బేనజిర్ జీవితాన్ని కానీ, రాజకీయాన్ని కానీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు… అయినా హత్య వార్త చూసిన కళ్ళు కొన్ని క్షణాల వరకు కనిపిస్తున్న వార్తని నమ్మలేదు. నేను కాంగ్రెస్‌వాదినీ కాను, జనార్దనరెడ్డినీ ప్రత్యక్షంగా ఎఱగను… అయినా అర్ధరాత్రి అతని మరణవార్త చూడగానే ఇంట్లో కాలు నిలవక బైటికి వచ్చి మేలుకునే ఉన్న నా సహచరులతో ఆ వార్త తాలూకు దిగ్భ్రమను పంచుకున్నాను. గతసంవత్సరం సద్దామ్ హుస్సేన్‌ని ఉరి తీసినప్పుడు కూడా ఏదో తెలియని, ఇదమిద్ధంగా చెప్పలేని ఇబ్బందికరమైన భావన. (నేను సద్దామ్ సానుభూతిపరుడిని కాదని మనవి.) మరణమంటే కలిగిన ఒక రకమైన …జుగుప్స. "జుగుప్స" అన్న భావనే సరైనదా అంటే …తెలియదు నాకూ!

మరణమంటే…?
విధి చేసిన దారుణమా? మదిలో అనంత(ర) స్మరణమా?
జ్ఞాపకాల తోరణమా? జ్ఞాపకాలతో రణమా?
అనుభవాలు రగిల్చిన వ్రణమా? అనుభూతులు మిగిల్చిన ఋణమా?
ఎవరూ మనకేమీ కాకుండా…పోవటమా??
ఎవరికి ఏమైనా మనకేమీ కాకపోవటమా?!

ఏ మరణం ఎక్కువ బాధాకరం?
తెలిసినవారిదా, తెలియనివారిదా?
"పిచ్చి ప్రశ్న!" అనిపించింది…
 ఈ ప్రశ్న మనసులోకి రాగానే!
వెంటనే ప్రశ్నించిన మనసే హెచ్చరించింది –
జవాబు సులువు కాదని!
"పిచ్చి ప్రశ్న" అనిపించే ప్రతి ప్రశ్నా
సులువైన జవాబు లేనిదే అయి ఉంటుందేం?
…జీవితమనే "పిచ్చి ప్రశ్న"కు
మరణమే "సులువైన జవాబు" అవుతుందా?

ఎవరి మరణవార్త తెలిసినా
మనసులో ఏతత్క్షణంలోనే ఎన్నో ఊహలు…
పుట్టుకకీ చావుకీ ప్రతీకలుగా
అలా పుట్టి ఇలా గిడతాయి
"పునరపి జననం పునరపి మరణం"

"ఆత్మ నాశనము లేని"దన్న గీతాకారుడు
ఇన్ని మరణాల మధ్యన తమ తమ ఆత్మలను
హత్య చేసుకుని బ్రతుకుతున్నవాళ్ళను
లక్ష్యపెడతాడా?
ప్రతి ఘటనకీ స్పందించి స్పందించి
స్పందించటమే మరచిపోయేటంతగా
సొంత ఉనికిని కోల్పోతున్న ప్రాణాలను
పట్టించుకుంటాడా?
"కర్మణ్యేవ-అధికారస్తే మాపలేషు కదాచన"
అన్న హెచ్చరిక మనసులో చేరింది –
"ప్రశ్నించుకో, జవాబు కోసం వెతకొ"ద్దని మెత్తగా వినబడింది!
జీవనవేదం సరిక్రొత్తగా అర్థమైంది!

…మరణవార్త చెవినబడ్డ ప్రతిసారీ శ్రీశ్రీ గుర్తుకొస్తాడు… శ్రీశ్రీని కదిలించిన కొంపెల్ల జనార్దనరావు మరణం గుర్తుకొస్తుంది. "నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన – ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?" అని ప్రశించిన వేటూరి వేదాంతం గుర్తుకొస్తుంది. "అనుకోలేదని ఆగవు కొన్ని" అన్న ఆత్రేయ ఆవేదన గుర్తుకొస్తుంది. ఎంతటివాడినైనా కదిలించే ఆ మృత్యురూపం గుర్తుకొస్తుంది. "దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది – ఇంత కన్న సైన్యముండునా?" అన్న గురువు సీతారామశాస్త్రి హెచ్చరిక గుర్తుకొస్తుంది. …నాకు నేను గుర్తుకొస్తాను! (బేనజిర్ చనిపోయిందని తెలిసిన 6-7 గంటలకు, జనార్దనరెడ్డి మరణవార్త తెలిసిన 1-2 గంటల్లోపు మనసులోని తడులకు, సడులకు, సుడులకు అక్షరరూపాన్నిచ్చే యత్నం.)

సిద్ధార్థ్ – ఒక స్ఫూర్తిమంతమైన విజయం

http://us.rediff.com/news/2005/mar/30spec.htm – ఈ కథనము చదివిన వెంటనే వ్రాస్తున్నాను ఈసారి కూడా – ఈ వార్త కూడా అంతగా కదలించింది. ఇతరులను చిన్న చూపు చూడటమనేది అందరమూ ఎప్పుడో ఒకప్పుడు (తెలిసో తెలియకనో) చేస్తూనే ఉంటాము. "నేనేదీ సాధించలే"నని అందరమూ ఎప్పుడో ఒకప్పుడు డీలా పడుతూనే ఉంటాము. ఆ రెండూ ఎంత తప్పో సిద్ధార్థ్ గురించి చదివిన తక్షణమే (మళ్ళీ) తెలిసివచ్చింది. పేరున్న ‘స్వదేశీ’ సంస్థలు అతనిని తృణీకరిస్తే ఎక్కడి నుంచో వచ్చిన సంస్థ అతని ప్రతిభనే ప్రాతిపదికగా తీసుకుని తగు విధంగా ఉద్యోగమివ్వటమనేది గమనించదగిన సంగతి. అడుగడుగునా ఈసడించి, వెక్కిరించి, తిరస్కరించే ప్రబుద్ధులున్న ఈనాటి మన సమాజంలో సిద్ధార్థ్ ఈ స్థాయిని చేరుకోవటం ఆశ్చర్యానందాలను కలిగించింది. విజయవంతమైన ఈతని జీవితం వెనుక ఎంత మంది ప్రోత్సాహముందో వారందరికీ అభినందనలు, అభివందనాలు. సిద్ధార్థ్ ఇంకా ఉన్నతస్థాయులను చేరుకోవాలని, ఇతని జీవితం మరెందరికో మార్గదర్శకమవాలని, ఇటువంటి కథల నుంచి సమాజం (మనమే) పాఠాలు నేర్చుకోవాలని నా ఆశ.

“ఆ నలుగురు” – నాకు నమ్మకాన్నిచ్చిన చిత్రం

మొదటి సారిగా మనసులో కలిగిన భావాన్ని వెంటనే ఇక్కడ వ్రాస్తున్నాను – అంతగా నన్ను కదిలించింది ఈ చిత్రం. కుటుంబానికి, సమాజానికి సమానమైన ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జీవితం ఈ చిత్రం. ఆ వ్యక్తి గెలిచినట్టుగా చూపించి ఈ చిత్రాన్ని ముగించటం నాలాంటి ఎందఱికో స్ఫూర్తినిస్తుంది. చిత్రకథానుగుణంగా కథానాయకుడు మరణించటం నిరాశావహ దృక్పథాన్ని సూచించినా ఆ మరణానికి కారణమైన నిరాశని అతని గెలుపు త్రోసి రాజంటుంది, ఈ చిత్రాన్ని చూసి స్ఫూర్తి పొందే వారికి ఆ నిరాశ అనవసరమని అనిపింపజేస్తుంది. సినిమా అన్న మాధ్యమం యొక్క అంతర్గత శక్తిని ఈ చిత్రంలోని సందేశం ప్రశంసాత్మకంగా ఉపయోగించుకుంది. ఈ చిత్రం ఇంకా చాలా మందికి సామాజిక స్పృహను, సంఘం కోసం బ్రతకాలనే తపనను కలిగించగలదని నా నమ్మకం.