Category Archives: సమాజం

మారుతున్న సమాజ ముఖచిత్రం

ఎన్నో రోజుల తరువాత వ్రాస్తున్నాను… కానీ, మంచి విషయాలతో వ్రాస్తున్నానన్న తృప్తి ఉంది. ఎన్నో విషయాలు మనసుకు హత్తుకున్నాయి ఇటీవలి కాలంలో.

 1. హోలీ నాడు భోపాల్ నగరంలో పిల్లలు చేసిందేమిటో తెలుసా? “నీటిని వృథా  చేయకూడదు”, “నీరు లేకపోతే ఱేపు లేదు” (“जल नही तो कल नही”) అంటూ ప్లకార్డులు పట్టుకుని పొడి రంగులతో హోలీ ఆడుకున్నారు. వారికున్నంత సామాజిక స్పృహ పెద్దలకు కూడా ఉంటే…!

2. మన ప్రస్తుత రాష్ట్రపతి, భౌతిక శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ జీవిత చరిత్ర చదివి స్ఫూర్తి పొంది, మూడు నెలల శ్రమతో ఆ పుస్తకాన్ని అనువదించారు. చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే వారు అనువదించింది బ్రెయిలీ లిపిలోకి! మీ ఊహ నిజమే… “రచయిత” రాజేంద్ర ధర్వ్, తప్పులు దిద్దిన కమల్ భగోర్ ఇద్దరూ గుడ్డివాళ్ళే! తమ ఉపాధ్యాయుడు సచిన్ దేవాలియా సాయంతో ఈ బృహత్ కార్యం సాధించిన వీరిద్దరూ భోపాల్ నగరంలో అయిదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థులు!

3. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని బాచుపల్లి పంచాయితీ పరిధిలో కొంత మంది ఆల్విన్ ఉద్యోగులు ప్రగతినగర్ అన్న పేరుతో 725 ఇళ్ళతో 1991 లో ఒక కాలనీ నిర్మించుకున్నారు. పంచాయితీలో అభివృద్ధి విషయమై అసంతృప్తి చెందిన  ఈ కాలనీ సంక్షేమ సంఘం 1996 లో హైకోర్ట్ సహాయంతో బాచుపల్లి పంచాయితీ నుంచి వేఱుపడి తమంతట తాముగా అభివృద్ధి చెందటం మొదలుపెట్టారు. సరిగ్గా పదేళ్ళలో వీరు సాధించిన ఘనత ఏమిటో తెలుసా? అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్నట్టుగా అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ISO) ధ్రువపత్రాన్ని పొందిన మొదటి పంచాయితీ ఇదే మన దేశంలో! మద్యం అమ్మకాలు లేవు, 99 శాతం పన్నులు ప్రతి నెలా 15వ తేదీకల్లా వసూలవుతాయి, ఇళ్ళన్నిటికీ మరుగుదొడ్ల సౌకర్యముంది, ఇప్పుడు ఊళ్ళో ఉన్న 1200 ఇళ్ళకూ మంజీరా నది నీటి సరఫరా ఉంది, నీటి వాడకాన్ని సూచించే మీటర్లున్నాయి, ప్రతి ఇంటి ముందు 2-5 మొక్కలున్నాయి, తడి చెత్తకీ పొడి చెత్తకీ వేరుగా అన్ని ఇళ్ళ ముందూ చెత్తబుట్టలున్నాయి, పంచాయితీ కార్యాలయంలోని ఫిర్యాదుల పెట్టెలో ఉన్న ఫిర్యాదులు చాలా వరకు 24 గంటలలో పరిష్కరింపబడతాయి, అక్షరాస్యత 99 శాతం, … ఇలాగే దేశమంతా ఉంటే… सारे जहॉ से अच्छा हिन्दूस्थान हमारा అని మనమంతా ఆనందంగా పాడుకోవచ్చు, కదా!

 

పతితులార, భ్రష్టులార, బాధాసర్పద్రష్టులార, ఏడవకండేడవకండి!

నేను ఈ మధ్య తెలుసుకున్న కొన్ని సామాజిక సేవా సంఘాల గురించి ఇక్కడ ప్రస్తావించాను. ఇటీవలే చేరినా వీళ్ళంతా చేస్తున్న మంచి తెలియటానికి ఎక్కువ కాలం పట్టలేదు. మరి క్రమం తప్పక చేస్తున్నప్పుడు …ఉడికిందో లేదో తెలియటానికి అన్నమంతా పట్టి చూడాలా?

మానవత్వం బ్రతికే ఉందని నిన్న ఒకరు పంపిన సందేశం ద్వారా తెలిసింది – తన ఆటోలో ఉన్న అయిదేళ్ళ పాపకు గుండెకు సంబంధించిన అనారోగ్యముందని ఆ పాప తల్లిదండ్రుల మాటల ద్వారా గ్రహించిన ఆటో డ్రైవర్ వారి వద్ద నుండి డబ్బులు తీసుకోలేదట! – అది తనకు చేతనైన సహాయంగా భావించిన ఆ మానవతామూర్తికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను.

ఎక్కడ మనసుకు సంతోషమూ, తృప్తీ ఉంటాయో, అక్కడే మనసుకు కొంతైనా అశాంతి, బాధ తప్పవేమో! చేసిన అన్ని సహాయాలు ఫలించవు కదా! …నిన్ననే ఒక నిండు గర్భిణికి రక్తమెక్కించవలసిన అవసరం గురించి తెలిసింది. “హైదరాబాద్ మహానగరంలో ఒక్క అవసరార్థికి రక్తం దొరకదా, దయార్ద్రహృదయులు మన చుట్టూ ఇంత మంది ఉండగా…?” అనుకున్నాను నిశ్చింతగా (ఇన్ని సమాజసేవా ప్రయత్నాలు చూసిన తరువాత పెరిగిన ఆశాభావం కూడానేమో!). ఒక్క రోజులోనే తెలిసింది – కామెర్లు సోకి ఆ గర్భిణి కడుపులోని బిడ్డ మరణించింది! ఆ స్త్రీ కూడా ప్రాణాపాయ స్థితిలోనే ఉందని, బ్రతకటం కష్టమని వైద్యులు పెదవి విరిచారు! ఎంత మంది ఎన్ని రకాలుగా స్పందించినా …అందరి ప్రాణాలూ నిలవాలంటే ఉన్న కొంత మంది చేతులు కలిస్తే చాలా? …దీని గురించి ఒకరికి చెబుతోండగా, అనుకోకుండానే, నండూరి విద్యారణ్య గుర్తొచ్చాడు – 2003 లో క్యాన్సర్‌తో పొరాడి అలసి ప్రాణాలు వదిలిన అసమాన ప్రతిభాశాలి, మిత్రుల మాటల్లో మృదుస్వభావి. నేను ఏనాడూ కలవలేదు, కానీ 2003 లో నా పుట్టిన రోజు నాడే అతని మరణవార్త విన్నాను, రోదించాను. అతనికి సహాయం చేసిన వాళ్ళలో మా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ, ఒక మానవతావాది నాతో అన్నట్టు “అమెరికాలో భారతీయులు జాలితో కాక ప్రేమతో అతనికి సహాయం చేసి ఉంటే అతను బ్రతికేవాడేమో”! సరైన సమయంలో సాయం అందక, ప్రపంచానికి ఆ విషయం కూడా తెలియక ముందే ఉనికిని కోల్పోతున్న అభాగ్యులు ఇంకా ఎందరో!

రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు, నిజమే, కానీ శ్రామికులు మాత్రం అది నిర్మాణంలో ఉన్నన్ని రోజులూ – “నేను సైతం…” అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు – “ప్రపంచానికి సమిధనొక్కటి ఆహు”తిచ్చి తమదైన కృషి చేస్తూనే ఉన్నారు, చివరికి “ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్ల”వించి సంతృప్తిని పొందుతున్నారు! మరి …నేను…? …మీరు? …మనం?

పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

క్రిస్టోఫర్ డేవిడ్ పెన్లీ – అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్ర పోలీసుల దౌష్ట్యానికి బలైన ఒక ప్రాణం. అమెరికా పోలీసులు అనగానే న్యాయంగానే అతన్ని చంపారనుకోవచ్చు. అతన్ని చంపింది ఎక్కడో తెలుసా? ఒక పాఠశాలలోని బాత్‌రూంలో. పిల్లలని చంపటానికి వచ్చిన ఉగ్రవాదిని పోలీసులు చంపారనుకుంటున్నారా? హతుడి వయసు ఎంతో తెలుసా? పదిహేనేళ్ళు! …మీ ఊహ నిజమే! ఆ అబ్బాయి ఆ పాఠశాల విద్యార్థి! ఎందుకు చంపారో తెలుసా?! బొమ్మ తుపాకీతో ఒక పోలీస్ అధికారిని బెదిరించినందుకు. అవును, బొమ్మ తుపాకీ! దానిని అసలైన తుపాకీగా భ్రమించిన పోలీసులు ఆ పిల్లవాడిని వెంటనే కాల్చి చంపారు! చంపిన వ్యక్తి పేరు? తెలియదు. వార్తలలో ఎక్కడా వ్రాయలేదు! కనీసం చనిపోయిన క్రిస్టోఫర్ బొమ్మ కూడా వెయ్యలేదు! పోలీస్ కాకపోయి ఉంటే అతనో కిరాతకుడైన హంతకుడు. మరి అతన్ని శిక్షించేదెవరు? మనుషుల్లో పైశాచికత్వాన్ని పారద్రోలేదెవరు?
(నాకు ఈ వార్త చెప్పినది నా తమ్ముడు శశాంక: <http://rahulsashanka.blogspot.com/>)

సిద్ధార్థ్ – ఒక స్ఫూర్తిమంతమైన విజయం

http://us.rediff.com/news/2005/mar/30spec.htm – ఈ కథనము చదివిన వెంటనే వ్రాస్తున్నాను ఈసారి కూడా – ఈ వార్త కూడా అంతగా కదలించింది. ఇతరులను చిన్న చూపు చూడటమనేది అందరమూ ఎప్పుడో ఒకప్పుడు (తెలిసో తెలియకనో) చేస్తూనే ఉంటాము. "నేనేదీ సాధించలే"నని అందరమూ ఎప్పుడో ఒకప్పుడు డీలా పడుతూనే ఉంటాము. ఆ రెండూ ఎంత తప్పో సిద్ధార్థ్ గురించి చదివిన తక్షణమే (మళ్ళీ) తెలిసివచ్చింది. పేరున్న ‘స్వదేశీ’ సంస్థలు అతనిని తృణీకరిస్తే ఎక్కడి నుంచో వచ్చిన సంస్థ అతని ప్రతిభనే ప్రాతిపదికగా తీసుకుని తగు విధంగా ఉద్యోగమివ్వటమనేది గమనించదగిన సంగతి. అడుగడుగునా ఈసడించి, వెక్కిరించి, తిరస్కరించే ప్రబుద్ధులున్న ఈనాటి మన సమాజంలో సిద్ధార్థ్ ఈ స్థాయిని చేరుకోవటం ఆశ్చర్యానందాలను కలిగించింది. విజయవంతమైన ఈతని జీవితం వెనుక ఎంత మంది ప్రోత్సాహముందో వారందరికీ అభినందనలు, అభివందనాలు. సిద్ధార్థ్ ఇంకా ఉన్నతస్థాయులను చేరుకోవాలని, ఇతని జీవితం మరెందరికో మార్గదర్శకమవాలని, ఇటువంటి కథల నుంచి సమాజం (మనమే) పాఠాలు నేర్చుకోవాలని నా ఆశ.

“ఆ నలుగురు” – నాకు నమ్మకాన్నిచ్చిన చిత్రం

మొదటి సారిగా మనసులో కలిగిన భావాన్ని వెంటనే ఇక్కడ వ్రాస్తున్నాను – అంతగా నన్ను కదిలించింది ఈ చిత్రం. కుటుంబానికి, సమాజానికి సమానమైన ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జీవితం ఈ చిత్రం. ఆ వ్యక్తి గెలిచినట్టుగా చూపించి ఈ చిత్రాన్ని ముగించటం నాలాంటి ఎందఱికో స్ఫూర్తినిస్తుంది. చిత్రకథానుగుణంగా కథానాయకుడు మరణించటం నిరాశావహ దృక్పథాన్ని సూచించినా ఆ మరణానికి కారణమైన నిరాశని అతని గెలుపు త్రోసి రాజంటుంది, ఈ చిత్రాన్ని చూసి స్ఫూర్తి పొందే వారికి ఆ నిరాశ అనవసరమని అనిపింపజేస్తుంది. సినిమా అన్న మాధ్యమం యొక్క అంతర్గత శక్తిని ఈ చిత్రంలోని సందేశం ప్రశంసాత్మకంగా ఉపయోగించుకుంది. ఈ చిత్రం ఇంకా చాలా మందికి సామాజిక స్పృహను, సంఘం కోసం బ్రతకాలనే తపనను కలిగించగలదని నా నమ్మకం.

వెంకటేశ్ మరణం – విషాదభరితం, ఆలోచనాస్పదం, స్ఫూర్తిజనితం

వెంకటేశ్ – అతవి జీవితం గురించి అతను మరణించే ముందు దాకా చాలా మందికి తెలియదు, నాతో సహా. తీరా తెలిసే సరికి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. మరణించిన వెంకటేశ్ ఆశయం వెనుక అతని మాతృమూర్తి ఆదర్శభరితమైన పెంపకముంది. ఆ తల్లి ఈనాటికీ పడుతున్న తపన వెనుక ఆ బిడ్డ చివరి కోరిక ఉంది.

నేడు మన మధ్యన లేని ఒక అసహాయ జీవి ఆవేదన, ఆశయ సాధన, మన దేశపు చట్టంలో ఒక బలీయమైన మార్పు కోసం అతని మరణానంతరం కూడా ఆ తల్లి పడే మథన సార్థకమవాలని, ఈ ఇద్దరి ఆలోచన వెనుక ఆంతర్యాన్ని మనలో కొందఱయినా అర్థం చేసుకుని, అవయవదానం చేయాలని, చేయించాలని ఆశిస్తున్నాను. నేను ఈ సారి భారతదేశం వెళ్ళినపుడు అవయవదానం గురించి వివరాలు సేకరించి, అవయవదానానికి నా ఆమోదం తెలియజేయాలని ఇప్పుడు సంకల్పిస్తున్నాను.

ఆ తల్లి ఉద్యమానికి ఎటువంటి చేయూతనైనా ఇవ్వడానికి సంసిధ్ధంగా ఉన్నాను. అటువంటి వివరాలు ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయగలరు.