Tag Archives: అమ్మ

పచ్చనైన ప్రతి కథకూ తల్లివేరు పడతులు

“యత్ర నార్యస్తు పూజ్యన్తే రమతే తత్ర దేవతాః” అని చెప్పింది మనుస్మృతి. అదే మనుస్మృతి “న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి” అంటూ స్త్రీలకు ఆంక్షలు విధించింది. ఇలా అనగానే మన స్త్రీవాదులకు “మనువు” మీద మనసు మండుతుంది. మనుస్మృతి పాటించాలని అనటంలేదు. (పాటించాలంటే మఱి తద్దినపు భోజనంలో బ్రాహ్మణుడికి ఖడ్గమృగం మాంసం వడ్డించాలిట!) భారతీయ సమాజంలో అంతర్లీనంగా అంతటా ఉండే ఛాందసం అమ్మాయిలకు నయానో భయానో ఆజన్మాంతమూ సర్దుకుపోవటమే నేర్పుతుంది. ఇంట్లో వాళ్ళకెంత స్వేచ్ఛనిచ్చినా సమాజం మొత్తంలోనూ అంతటి భావవైశాల్యం లేదు కనుక యెన్నెన్నో రకాలుగా మన స్త్రీలు సర్దుకుపోవటాన్ని ఒక జీవనశైలిగా స్వీకరించటం జఱుగుతుంది. దానితో వాళ్ళు స్వచ్ఛందంగానూ ఆనందంగానూ తమ స్వాతంత్ర్యాన్ని భర్త, కుటుంబం, సమాజం వంటి బాహ్యాధిపతులకు విడిచిపెడతారు. ఇదే అన్ని సమస్యలకూ మూలమనిపిస్తుంది. మౌనమే భూషణంగా ఆధారపడటము, సర్దుకుపోవటము ఆడవాళ్ళకి అలవాటైపోయిన పరిస్థితిలోనే దోషముంది!

తనకంటూ ఒక రూపము, ఆకారము రావటానికి స్త్రీ మీద ఆధారపడిన పురుషుడు స్త్ర్యాధిపత్యాన్ని – ఈ పదం కూడా క్రొత్తగా పుట్టించవలసి వచ్చినంతగా – ఎందుకు తట్టుకోలేడు? తనలోని ప్రతి అంగము, ఆలోచనా రూపు దిద్దుకున్నది స్త్రీ వలననే అన్న విషయమెలా మఱచిపోగలడు? ఏమిటి మగతనం గొప్ప? 46 క్రోమోజోముల్లో ఒకే ఒక్క క్రోమోజోము వేఱుగా ఉండటమా?! అయినా మగవాడైనంత మాత్రాన యేమిటి లాభం? కనీసం తనకి వచ్చిన భావోద్వేగాన్ని సంపూర్తిగా వ్యక్తపఱచలేనంతటి అశక్తుడు యీనాటి మగవాడు! మగవాడి ఆధిపత్యం సహజసిద్ధంగా వర్తిల్లటంలేదు, ఆడవాళ్ళు ఆధిపత్యం కోసం పట్టుబట్టక వదిలిపెట్టడం వలన మగవాడికి మిగిలిన “ఘనత” అది. ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందంటారు. ఆ స్త్రీ తన తల్లి కావచ్చు, భార్య కావచ్చు, మఱో బంధువు కావచ్చు – వాళ్ళకి ఏదో రకంగా దాసోహమన్న పౌరుషాన్ని గుఱించి మనమింతగా గుండెలు పొంగించుకోవాలా? స్త్రీలకు రిజర్వేషన్లు “ఇవ్వటం”, స్వేచ్ఛని “ఇవ్వటం” – ఈ యివ్వటమేంటి అసలు?! ఒకరికి స్వేచ్ఛనిచ్చే “హక్కు”, “అధికారం” ఎవఱికున్నాయి?! వాళ్ళకి “ఉండవలసిన” స్వేచ్ఛని పరిహరిస్తున్నది పురుషాధిక్య సమాజం కాదా?! (ఒకప్పుడు మన దేశంలో మహారాజ్ఞులు, శక్తిస్వరూపిణులు లేరా? హుఁ, ఉంటే మాత్రమేం లాభం? వాళ్ళ వాళ్ళ కాలాల్లో వాళ్ళూ యిబ్బందుల నెదుర్కొన్నవాళ్ళే కదా!) స్త్రీత్వంలోని సహజ హృదయవైశాల్యం వలన సమానత్వాన్ని అయినా, మఱొకరి ఆధిక్యాన్ని అయినా అత్యంత సహజమైన విషయంగా పరిగణించి చిఱునవ్వుతో ఆమోదిస్తుంది. ఆధిపత్య యుద్ధం తప్పించినందుకు కృతజ్ఞులమై ఉండక స్త్రీల మంచితనాన్ని చేతగానితనంగా చూసే మూర్ఖత్వానికి ముందు తరాలలోనైనా స్వస్తి చెబితే మేలు. అందుకు స్త్రీలని మెచ్చి మేకతోలు కప్పనక్కఱలేదు, కనీసం మనుషులుగా వాళ్ళని గౌరవించటం మొదటి మెట్టు కాగలదు!

“ఉద్యోగమ్ పురుషలక్షణమ్” అన్న మాట పట్టుకుని స్త్రీలు ఉద్యోగాలు చేయరాదనేవాళ్ళు కొందఱు. సంస్కృతంలో “ఉద్యోగమ్” అంటే “ప్రయత్న”మనీ “పురుష” అన్న మాట మనుషులందఱికీ వర్తిస్తుందనీ గ్రహిస్తే “ప్రయత్నం చెయ్యటం మానవ లక్షణం” అని చెప్పారని అర్థమవుతుంది! “ఇంటికి దీపం ఇల్లాలు” అన్నది కూడా ఒక స్త్రీ వెలుగులీనే స్థాయిలో పురుషుడు వెలగలేడని అన్వయం కావచ్చు. అలాంటి దీపాలన్నీ నాలుగు గోడల మధ్యనే ఉండాలన్న స్వార్థం భావ్యమా? స్త్రీలు యింట్లోనూ, ఉద్యోగంలోనూ రెండింటా పని వత్తిడిని తట్టుకోలేరని కొందఱి “బాధ”. ఇంట్లోనే అన్ని రకాల పనులు చెయ్యగలిగే స్త్రీ బైట మఱో పని చెయ్యలేదా?! ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళు తగు సహాయమందిస్తే వత్తిడి తగ్గుతుంది కూడా! కాదా? అసలు స్త్రీ యింట్లో చేసే పనులకు విలువ కట్టగల షరాబులెవ్వఱు? ఉన్నారు… ఎవఱి జీవితాన్ని వాళ్ళే బ్రదికే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తల్లులు సగటున చేస్తున్న ఇంటి పనులకు జీతంతో తూకం వేసింది ఒక సంస్థ. కొన్నేళ్ళ క్రితం చేసిన యీ పరిశోధనలో తేలిన విషయమేంటంటే జీతాలివ్వటమంటూ జఱిగితే ఒక్కో స్త్రీ చేస్తున్న పనులకి (రూపాయలలోకి మార్చితే) సంవత్సరానికి 54 లక్షల రూపాయలు ఇవ్వాలట!! అ.సం.రా దేశంలోనే అలా ఉంటే తల్లిగా/భార్యగా అన్నీ తానే అయి పని చేసే మన దేశంలో?! కనీసం ఊహించగలమా? పైగా “తల్లి ప్రేమని మించింది లే”దంటారు. స్త్రీలందఱికీ వేఱుగా “పిల్లలని ప్రేమించటమెలా?” అని పాఠాలు బోధిస్తున్నారా, లేదే? సహజసిద్ధంగా స్త్రీలలో ఉండే నిస్స్వార్థమైన ప్రేమ తల్లి ప్రేమ రూపంలో కనిపిస్తోందే కానీ వాళ్ళకి అలా ప్రేమించటానికి సమకూర్చబడిన జ్ఞానమూ, రెండో మనసూ లేవు! అది స్త్రీకి స్వతస్సిద్ధమైన లక్షణం కానప్పుడు స్త్రీలే అలా ప్రేమించగలరనుకోవటం కూడా తప్పే! తండ్రి అంతగా ప్రేమిస్తే కాదన్నదెవఱు?! మగవాడు కూడా అలా ప్రేమించలేకపోతే తండ్రి తప్పే కానీ తల్లి గొప్ప కాదు! (ప్రేమిస్తున్నామంటూ స్త్రీల వెనుక విసుగు లేకుండా తిఱిగే పురుషులు ఆ మాత్రం ప్రేమించగలరు లెండి!)

చలనచిత్రాల్లో, సాహిత్యంలో, ఇతర కళల్లో, సమాజంలో, జీవితంలో, విద్యలో, ఉద్యోగాల్లో, పెళ్ళిలో, కుటుంబంలో, ఇంట్లో… దాదాపుగా ప్రతీ చోటా మగవాళ్ళు ఆడవాళ్ళని అణగద్రొక్కే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అసలు తన జీవితంలోకి తొలి అడుగైనా వేయక ముందే తన జీవితాన్ని నిర్దేశించదలచిన మగవాడి కోసం యే ఆడదైనా యెందుకు సర్దుకుపోవాలి? తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూనే మఱొకరిని తన జీవితంలోకి ఆహ్వానించాలని నా కోరిక! స్త్రైణ్యం ముందు పౌరుషమెంత చిన్నబోతుందో గ్రహించి ప్రతి పురుషుడూ ఆ స్త్రైణ్యాన్ని కేవలం ఒప్పుకోవటం కాక దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని అచ్చెఱువొందాలని, ఆరాధించాలని నా ప్రార్థన! మన గుఱించి మనం మఱచిపోయినా మనల్ని కనిపెట్టుకుని ఉన్న ఆ మఱొకరికి ప్రణమిల్లటం తప్పనిసరి!

స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అనీ, పురుషుడు పురుగు లాంటివాడనీ కాదు నా భావన. బేలగా కనిపించినంత మాత్రాన మన వయసు స్త్రీ మన కన్నా లోతుగా ఆలోచించగలిగి, జీవితాన్ని మన కన్నా ధైర్యంగా ఎదుర్కొనగలిగి ఆ పైన ఆ బేలతనాన్ని కూడా ఆస్వాదించగలదని మఱచిపోరాదు. మగవాడు మ్రాన్పడిపోయిన యెన్నో సందర్భాలలో – పురాణాలలో కైకేయి, సత్యభామలతో సహా – స్త్రీ సారథ్యంలోనే సమస్యలు పరిష్కరింపబడటం కద్దు. ఒక దర్శకురాలిగా (director), కార్యనిర్వహణాధికారిగా (manager), సంయామికగా (administrator), ఒక ఆర్థికవేత్తగా (economist), ఒక గురువుగా (teacher), …మగవాడి ఊహకు కూడా అందని యెన్నో రకాలుగా తన జీవితంలో విభిన్నమైన భూమికలు పోషించే స్త్రీకి నా జీవితమే జోహారుగా అర్పిస్తాను!

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రచురించాను కానీ యీ మొత్తమూ నేను గతంలో ఆర్కుట్‌లోని ఒక కూటమిలో ఆంగ్లాంధ్రాలు కలిపి వ్రాసిన ఒక వ్యాసపరంపర – దానినిప్పుడు తెనిగించాను.)

షరా: 1. గతంలో మాతృదినోత్సవం నాడు వ్రాసిన టపాలో యిలాంటి దినాల మీద నా అభిప్రాయాన్ని పంచుకున్నాను కనుక మఱలా చెబితే చర్వితచర్వణమవుతుంది.
2. “పచ్చనైన ప్రతి కథకూ తల్లివేరు పడతులు…” అన్న పంక్తి 1988వ సంవత్సరంలో విడుదలైన “ఆడదే ఆధారం” అన్న చలనచిత్రం కోసం శ్రీ సీతారామశాస్త్రి వ్రాసిన “మహిళలు మహరాణులు…” అన్న నిందాత్మక(స్తుతి)గీతంలోనిది.

అమ్మ వ్రాసిన పాటలు: గోదాదేవి కళ్యాణం

క్రితం వారాంతంలో గుడికి వెళ్ళినప్పుడు “గోదాదేవి కళ్యాణం” అన్న ప్రకటన చూసి “ఆ రోజుకైనా ఏదో ఒకటి వ్రాయాలి గోదాదేవి మీద!” అనుకున్నాను. భారతదేశంలో తెల్లవాఱింది కదా అని యింట్లో అమ్మానాన్నలతో మాట్లాడాను. మాటల్లో అమ్మ చెప్పింది తానో పాట వ్రాసానని. ఆ మాట వినగానే చాలా సంతోషం కలిగింది. అమ్మ వ్రాసిన పాటలు చూసి చాలా కాలమే అయింది. ఇంతలో మఱో ఆనందకరమైన మాట విన్నాను: ఆ పాట గోదాకళ్యాణం గుఱించి యని. “ఆహా, ఇందుకే కాబోలు యెన్నడూ లేనిది నాకు అనిపించింది యీసారి వ్రాయాలని!” అనుకున్నాను. నేను వ్రాస్తే కన్నా అమ్మ వ్రాస్తేనే ఆనందం కదా, ఎంతైనా! సరే, వినిపించమన్నాను. చదివింది. పాడమన్నాను. “నాన్న పాడతారు” అని నాన్నని పిలిచింది. నాన్న పాట విని కూడా చాలా కాలమే అయింది. పైగా నాన్న పాడతారనగానే అర్థమైంది సాహిత్యానికి తానే బాణీ కట్టి ఉంటారని! నా ఊహ నిజమే… హిందోళ రాగంలో సులభమైన బాణీలోకి సాహిత్యం అలా ఒదిగిపోయింది! పండుగ నాటి శుభోదయాన అమ్మ సాహిత్యానికి నాన్న బాణీ కట్టి పాడటం – ఎంత మందికి కలుగుతుందో కదా యింతటి హాయి! ఆ పాటయ్యాక అమ్మ తాను మఱో పాట వ్రాస్తున్నానని ఇవాళ బ్యాంక్‌కి సెలవు కాదు కనుక పూర్తి చేసే అవకాశం లేకపోయిందని చెబుతూ నన్ను ఆ పాట “కాస్త అడ్జస్ట్ చేసి మఱో రెండు చరణాలు వ్రాయి” అని అమ్మ చెబితే సంతోషానికి బదులు బాధే వేసింది. అమ్మ పాటని నేను దిద్దటమా?!? నా తొలి గురువు నన్ను అర్థించటమా! అంతటి అపరాధం నేను చేయలేను. ఇది అమ్మ చేతనే పూర్తి చేయించాలని నిశ్చయించుకున్నాను. కానీ, నా ఆనందం ఆపుకోలేక యీ టపా… రెండు పాటలతోనూ. (దిద్దుకోలు: పైన వ్రాసిన పాఠ్యం యథాతథంగా ఉంచాను కానీ అమ్మ మఱునాటికల్లా రెండో పాట పూర్తి చేసింది, మొదటి పాట కూడా చిన్నదిగా ఉందని తనకి కూడా అనిపించటంతో మఱో రెండు చరణాలు చేర్చింది. ఆ మేఱకు క్రింది పాటల పూర్తిపాఠాలను పొందుపఱిచాను.)

రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ | బాణీ: నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస శర్మ

పల్లవి:
మంగళవధువై గోదాదేవి పల్లకి యెక్కెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!

చరణం 1:
కురులతో పూవులకొండెను చుట్టి నుదుటను కళ్యాణతిలకము దిద్ది
భుజమున పలుకుల చిక్లుకను దాల్చి కులుకుల చెలియలు తన వెంట రాగా

చరణం 2:
నీలాల కన్నుల వజ్రాల కాంతులు, కెంపుల చెక్కిళ్ళు, పగడపు పెదవులు
పచ్చల అంచుల పట్టు వస్త్రాలు – బంగరు తనువుకు నవరత్న సిరులు

చరణం 3:
కోవెలలో కొలువైన శ్రీరంగనాథుని కోరి వచ్చిన ముగ్ధ గోదాదేవి
మనసు యిచ్చెనా, మాల వేసెనా, తానే పూమాలగ మాఱిపోయెనా!

చరణం 4:
సరసుడౌ శ్రీరంగనాథుని సరసన పూవుల ఊయల ఊగిన వేళ
మమతల మాలలు గళమున వేసి పరిణయమాడెను జగదేకవిభుని

ఆఖరి పల్లవి:
మంగళవధువౌ గోదాదేవి పరిణయమాడెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!

*

రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ

పల్లవి:
మధురమధురమీ గోదాచరితం
ముగ్ధహృదయమే వధువైన వైనం

చరణం 1:
తులసీవనముల పావనత్వమే విష్ణుచిత్తుని తనయగ మాఱె –
తాను దాల్చిన పూలమాలనే ప్రణయలేఖగా రంగనికంపె 

చరణం 2:
పరమపవిత్ర పూజావిధిని పాశురములలో వివరించినది
భక్తసులభుడౌ శ్రీరంగవిభునితో “అద్వైతము”నే ఆశించినది

చరణం 3:
మార్గశిరాన మంచువానలో తొలిఝాములలో జలకములాడి
వైకుంఠపతియౌ శ్రీరంగనాథుని వ్రతనిష్ఠలతో మెప్పించినది

చరణం 4:
గోదా భక్తికి ముఱిసిన హరియే దివి నుండి భువికి దిగివచ్చెనులే
అంతరంగమున కొలువైన రంగడు వైభోగముగా వరియించెనులే!

మాతృదేవోభవ!

“నువ్వు వ్రాసిన ‘అమ్మ’ కవిత (Google) Buzz చెయ్యచ్చుగా?” అని అడిగిన ఒక మిత్రరత్నానికి నేను చెప్పిన సమాధానం “నేనిలాంటి ‘రోజు’లకి importance ఇవ్వను… సరేలే, అయినా ఆ కవిత Buzz చేస్తాలే” అని. ఆ పనే చెయ్యబోతే నేను అమ్మ గుఱించి గతంలో వ్రాసిన పాట గుర్తొచ్చింది. అదీ ఇదీ కలిపి blog చేద్దామనుకున్నా. అంతలోనే అనిపించింది. “‘అమ్మ’ అన్న కవిత ఇప్పటికే పుస్తకంలో ప్రచురితమయింది, ఆ పాటేమో మఱొకరి బాణీకి వ్రాసినది. మఱి ఈరోజున ‘నాది’ అనుకోదగ్గట్టుగా మఱో క్రొత్త రచన చేద్దా”మనుకుని వ్రాసిన కవిత “అమ్మంటే…?” అన్నది. అమ్మంటే నాకు తెలిసేట్టు చేసిన మా అమ్మకూ, సమస్తచరాచరసృష్టికీ అమ్మే ఆధారమంటూ స్ఫూర్తినిచ్చిన ఎందరో కవులకు, రచయితలకు, అమ్మలా నన్ను ఆదరించిన అందఱికీ నెనఱులతో, జీవకోటిలోని ప్రతి అమ్మకీ నమస్కరిస్తూ… పైన పేర్కొన్న మూడు రచనలూ ఇక్కడ:

http://urlm.in/enty/onDays.jpg – ఆగస్ట్ 13, 2003 నాడు ఈనాడు దినపత్రికలో ఈ “దినాల” పైన నేను వెలిబుచ్చిన అభిప్రాయం (ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు!) (షరా: ఈ వ్యాఖ్యలో “సోదరిల” అనే సంకర మాట నాది కాదు – సంపాదకుల పుణ్యం. “సోదరులు” అంటే అన్నదమ్ములే కాదు, అక్కచెల్లెళ్ళు కూడా అనే సంగతి యెప్పటికి గ్రహిస్తారో!)