Tag Archives: ఆత్మపరిశీలన

క్రొత్త “యేటి” అభిషేకం: ఆత్మావలోకనానికి అవకాశం

(ఈ టపాకి స్వీయ ఆంగ్లానువాదాన్ని యిక్కడ చదవగలరు.)

పొరపాటున చెయి జాఱిన తరుణం తిరిగొస్తుందా?
ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా?

పొరపడినా, పడినా జాలి పడదే కాలం మన లాగా!
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చే దాకా!

(ఇవి “సిరివెన్నెల” సీతారామశాస్త్రి కూర్చిన మాటలే అయినా మన మనసుల భాష యిది – అది ఏకవచనమే! ఎందుకంటే యీ హెచ్చరికలు చేస్తున్నది మన అందఱి సొంత గొంతుక!)

… ”నీ ప్రశ్నలు నీవి” యని మనకు గుర్తు చేసిన కాలం “ప్రశ్నలోనే బదులు ఉంది” అనీ అంత కన్నా ముందే చెప్పింది. విన్నామా, గ్రహించామా, నేర్చుకున్నామా, పాటించామా అన్నది ముఖ్యం. 2010 వెళ్ళిపోకా తప్పదు. 2011 రాకా తప్పదు. ఆ మధ్యన మనమెంత బాగుపడ్డాము, ఎంత మందిని/దేన్ని ఎలా బాగు చేసాము, ఎన్ని/ఏం పాఠాలు నేర్చుకున్నాము? అన్నవే ముఖ్యం. క్రొత్త సంవత్సరం మఱిన్ని పాఠాలు తెచ్చే లోపు పాత పాఠ్యక్రమం (స్య్ల్లబుస్) మొత్తమూ పునఃపునః ఔపోసన పట్టడం మన వంతు. అది చేయకపోతే ఎన్ని క్యాలెండర్‌లు మాఱినా కాలం-డర్ (కాలమంటే భయం) మాఱదు. క్రొత్త యేటిని మనం ఆహ్వానించటం కాదు చెయ్యవలసినది – అది మన పూనిక లేకపోయినా యెలాగూ వస్తుంది. క్రొత్త యేడనే మందిరంలో మనం అడుగు పెట్టబోయే ముందు మనకై మనమే పూనుకుని ఆత్మశుద్ధి చేసుకోవాలి. మన ప్రతి ఆచారం వెనుక ఒక భయం కానీ భక్తి కానీ ఉంటాయంటారు. ఈ నూతనసంవత్సరాహ్వానం భయంతో చేస్తున్నామా, భక్తితో చేస్తున్నామా, భయమూ భక్తీ మఱచిన మౌఢ్యంతో చేస్తున్నామా అన్నది మనకు తెలియాలి… కాలం మనల్ని దాటిపోకముందే.

ఏంటి, పదేళ్ళా…!

నిజమే…
క్యాలెండర్‌లో “20” తరువాత
“0” కాస్తా “1” అయింది!
“ఒకటి”కి ఎంత విలువనో కదా!అబ్బే పదేళ్ళేనా…
ఎంతో నేర్పించింది జీవితం…
చేరదీసి తట్టి, చాచి పెట్టి కొట్టి
చాలానే నేర్పింది జీ..వి..తం!
నేనే… ఏమీ నేర్చుకోలేదు!విదేశంలో పదేళ్ళున్నానంటే…
“ఆహా!” అన్నవాళ్ళే అంతా!
“అయ్యో” అనుండాలని ఎందరికి తెలుసు!?
తల్లిభూమి చేదయ్యిందా?అదేంటో…
మనసు బ్రతికే ఉంది …ఇంకా!
కన్నీళ్ళూ నేలలోకి ఇంకుతూనే ఉన్నాయి …ఇంకా!
మధురమైన మట్టి వాసన మరి
తట్టి లేపదేం మనసును?
మనసు బ్రతికే …ఉందంటావా?!ఎవరెవరో పలకరించారు,
ప్రేమ పన్నీరు చిలకరించారు,
ప్రేమ పైననే చితులు పేర్చారు,
“ఆత్మ నాశనము లేనిది” అని కృష్ణుడు చెప్పలేదూ!?
ప్రేమ మాత్రం తక్కువ తిన్నదా?ఎన్నెన్ని జరిగాయో…
ఏం జరిగితేనేం…
అంతా అలాగే ఉంది…
నే..ను తప్పించి
అం..తా అ..లా..గే…!గడిచిన పదేళ్ళలో…
నా వయసు ఎన్నేళ్ళు పెరిగిందో,
నా మనసు ఎన్నాళ్ళు మరిగిందో,
నా కలలు ఎన్నెన్ని కరిగాయో,
ఏ మార్పులెందుకని జరిగాయో…
తెలుసుకోవటానికి ఆగే అవసరం లేకుండా
జీవితం ఎలాగోలా సాగుతూనే ఉంది…
హమ్మయ్య!

(అమెరికాకి వచ్చి పదేళ్ళయిన సందర్భంగా…)

నేడు తెలుగు భాషా దినోత్సవం

(తొలుత “ఆర్కుట్”లోని ఒక కూటమిలో వ్రాసిన యీ టపాని తగుమాత్రంగా దిద్ది యిక్కడ ఉంచుతున్నాను.)

మొట్టమొదటగా మనం గ్రహించవలసినది తెలుగు భాష అంతరించిపోలేదు, అంతరించదు కూడా అన్న విషయం!

ప్రతి భాషకు “మనుగడ ప్రశ్నార్థకమే” అన్న పరిస్థితి ఒక్కోసారి తత్కాలీన ప్రజల మనస్సుల్లో రావచ్చు గాక! కానీ, వేయి సంవత్సరాలకు పైగా తల వంచకుండా రెపరెపలాడుతున్న మన భాష బావుటా వెలవెలబోయే పరిస్థితి కనీసం మన తరం బ్రతికి ఉండగా రాదు! తెలుగు భాష సముద్రం వంటిది. కొన్ని ఇతర భాషా పదాలు ప్రవాహాలుగా వచ్చి చేరినంత మాత్రాన ఇందులోని “రుచి” మారదు, కాలుష్యం పెరగదు, అడుగంటిపోదు! (మధురమైన భాషను ఉప్పు నీటి సముద్రంతో పోల్చటం అనౌచిత్యమే కావచ్చు కానీ “రుచి” అన్నది “స్వధర్మం” అన్న అర్థంలో తీసుకోమని మనవి. మరో సంగతి: రుచి అన్న పదానికి “ఉప్పు” అన్న అర్థం కూడా ఆపాదించబడింది

శాస్త్ర/సాంకేతిక పారిభాషిక పదాలకు (Scientific/technical jargon) తెలుగు పదాలు లేకపోవడం అనర్థం కాదు, కానీ ఉంటే దైనందిన విద్యార్థి జీవితంలోనూ తెలుగును ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒక భాష బ్రతికి ఉండాలంటే దానికి కావలసింది ఆ భాషకు “దినం” పెట్టి ఉత్సవాలు చెయ్యటం కాదు! పిల్లలతో ఆ భాషలోనే సంభాషించటంతో భాషకు కొత్త ఊపిరులు పోసుకోదు నిజానికి! Mummy, Daddy అని పిలిచినంత మాత్రాన అమ్మ, నాన్న అన్న భావనలోని ప్రేమ తగ్గదు! (నేను తెలుగులోనే సంబోధిస్తానని మనవి.) ఎన్నో సాంస్కృతిక, రాజకీయ అంతరీకరణలు (transformations), యుద్ధాలు తట్టుకుని చరిత్రలో నిలిచిన తెలుగు భాషకు మన రోజువారీ సంభాషణలే ప్రాణవాయువులు అవుతాయనుకోవటం సరి కాదు! చేయవలసిన పని మరొకటి ఉంది… అది ఎంత మంది చేస్తున్నాము?! “అదేంటి?” అంటారా? తెలుగు భాషలో పుస్తకాలు వెలువరించటం, తెలుగు పుస్తకాలు కొని/అరువు తీసుకొని చదవటం, వెలుగులోకి రాని మంచి పుస్తకాలను నలుగురికి పరిచయం చేయటం – “ఇవి చేస్తున్నామా?” అన్నది ప్రతి ఒక్కరూ వేసుకోవలసిన ప్రశ్న! “ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు” అన్న సామెత మనదే! దురదృష్టవశాత్తూ అది మనకు చక్కగా వర్తిస్తుంది! …నేటి అవసరాలకు తగినట్టు కొత్త పదాలతో భాషను పరిపుష్ఠం చేయటం ఎంత అవసరమో కాలానుగతంగా వస్తున్న సామెతలు, లోకోక్తులు, జాతీయాలు తెలుసుకుని వాటిని అవసరమైనప్పుడు వాడుకోవటం కూడా భాషావికాసానికి అవసరం! మన దృష్టిలో అవన్నీ “ఎప్పుడో బళ్ళో చదువుకుని వదిలేసిన సంగతులు”! సంధులు, సమాసాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఛందస్సు అనవసర కష్టాలు

మనకు “పుస్తకాలు చదవటం bore”, ప్రాచీన కళలైన “సాంప్రదాయక సంగీతనృత్యాలు slow” వంటి ఎన్నో అభిప్రాయాలు రోజూ వినిపిస్తూనే ఉంటాయి. (వినపడటంలేదు అంటే దానికి అర్థం మన కూడా వీటి గురించి ఆలోచించటమూ, చర్చించటమూ మానేసామని!) అదేంటో… ఈ అభిప్రాయాలు వెలువరించిన వాళ్ళు ఒక్క పుస్తకమైనా మనసు పెట్టి చదివారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి! కర్ణాటక సంగీత సంప్రదాయంలో స్వరపరచిన ఒక్క తిల్లానా అయినా విన్నారా అనిపిస్తుంది “మన సంగీతం slow” అన్న మాట వింటే! త్యాగరాజు కాలంలోనూ పాశ్చాత్య సంగీతపు సమాదరణ ఉండేదని, స్వయంగా ఆయనే కొన్ని కృతులని పాశ్చాత్య రీతుల ప్రభావంతో స్వరరచన చేసారని సదరు “విమర్శకు”లకు తెలియదు కాబోలు! పాశ్చాత్యపు సంగీతం ఆదరించారు కనుక కర్ణాటక సంగీతం వినమనటంలేదు… కానీ, ఒకటి విని నచ్చినంత మాత్రాన రెండోది తప్పు అనుకోవటం శోచనీయం!

మన వాళ్ళకు ఉండే మరో జాడ్యం “గొప్పలు చెప్పుకోవటం”! బొట్టు పెట్టుకోవటం మన సంప్రదాయం, అందరికీ నమస్కరించటం మన సంప్రదాయం, తెలుగు భాష తీయనైనది… ఇలా ఎన్నైనా చెబుతాం. ఎందుకు “గొప్ప” అంటే ఇదమిత్థంగా చెప్పలేక తడబడతాం! “గొప్ప” అని తెలిసి అందరికీ చెప్పుకోవాలనిపించటం తప్పు కాదు కానీ ఎందుకు గొప్ప అన్నది తెలుసుకునే జిజ్ఞాస లేని జాతి మనది అన్నది నిష్ఠురసత్యం! “దేశభాషలందు తెలుగు లెస్స” అని చెప్పుకుని గర్వపడతామే కానీ అక్కడ “దేశం” అంటే వేల భాషలకు ఆలవాలమైన భారతదేశం కాదని, అప్పట్లో ఉన్నది చిన్నా చితకా రాజ్యాలేనని గ్రహించము! మాతృభాష అన్నది ఒక గొప్పతనంగా భావిస్తామే కానీ ఆ కాలంలో ఆయా రాజ్యాల ప్రజలందరూ పొరుగు రాజ్యాల భాషలు నేర్చుకునేవారని గ్రహించము! మన భాష అతి ప్రాచీనమైనదని చెప్పుకుని అందుకు ఉన్నవీ, లేనివీ ఆధారాలు కల్పించుకుంటాం! తమదే ప్రాచీనభాష అన్నందుకు తమిళులని తప్పు పడతాం! అంతే కానీ, నిజంగానే తమిళభాష తెలుగు కన్నా ముందే పుట్టిందేమోనని, కనీసం దాని లిపి దాదాపు 1500 యేళ్ళుగా మారలేదని మనం గ్రహించుకోము!

…తెలుగు భాషను కించపరిచే ఉద్దేశం నాకు ఏనాడూ లేదు! విశ్లేషణాత్మక/విమర్శనాత్మక/తార్కిక దృక్పథాలు కరువై, ఇలాంటి పదాలే బరువైన మన తరానికి తెలుగు భాషని అంతమొదించేంతటి సత్తువ లేదు! తెలుగు భాషను ప్రాణప్రదంగా పూజించేవాళ్ళకు కొదువా లేదు! మనకు పార్శ్వపు అంధత్వం (selective blindness), పార్శ్వపు మతిమరపు (selective amnesia) ఉండటమూ, మన భాషాసంస్కృతుల పట్ల మనకు అవగాహన, అభిమానము లేకపోవటము వంటి ఎన్నో కారణాలు మనమే అనునిత్యం పరీక్షించుకుని మనలని మనం దిద్దుకోవలసిన అవసరం ఉంది… అది కూడా మన అవసరమేనని గ్రహిస్తే చాలు – అదే తెలుగు భాషకు పదివేలు, భావి తరాలకు మనం చేసే మేలు! (పార్శ్వం అంటే selective కాదు… “ఒక వైపు” అని మాత్రమే. కనుక దీనిని సందర్భోచితమైన అనుసరణగానే స్వీకరించానే తప్పించి నిక్కచ్చి అనువాదం కాదు.)

కొన్ని వివరణలు:

  1. ఆముక్తమాల్యద”లోనిదిగా ప్రముఖమైన “దేశభాషలందు తెలుగు లెస్స” అనే వ్యాఖ్య కృష్ణదేవరాయలే రచించినట్టు నమ్మితే “దేశం” అన్న పదం “విజయనగర సామ్రా”జ్యాన్ని సూచిస్తుంది. కానీ, శ్రీనాథుడిదిగా చెప్పబడుతున్న “జనని సంస్కృతంబు సకల భాషలకును / దేశభాషలందు తెలుగు లెస్స / …” అన్న ఆటవెలది పద్యం ఒకటి ఉంది. కానీ, ఏది ముందు వ్రాసినదో ఇదమిత్థంగా తెలియదు! మన కవులు తమకు తాము తక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వలనేనేమో… వారి గురించిన విషయాలు వారి రచనల్లో ఎక్కువగా కనిపించవు. అందుకని వారి దేశకాలాలను మనం నిర్ధారించలేని స్థితిలో ఉన్నాము. ఈ విషయాలేవీ మనలో చాలా మందికి తెలియదు! తెలిసినా కూడా పరిశోధించే ఉద్దేశము, పరిశీలించే ఉత్సుకత లేవు చాలా మందిలో!
  2. తమిళులు చేసిన స్వార్థపుటన్యాయం వేరే ఉంది: తమిళభాష ప్రాచీనమైనదని ప్రభుత్వం తీర్మానించిన వెంటనే ప్రాచీనభాషలను గుర్తించటానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించిన కాలవ్యవధిని 2000 సంవత్సరాలకు పెంచటం!
    3. మన భాషకు లిపి నేటి స్థాయికి చేరినది ఎప్పుడో తెలుసా? ముద్రణ యంత్రాలు మన దేశానికి వచ్చిన తరువాత – అంటే 19వ శతాబ్దంలో!

మరణం – బ్రతుకు ఆటకు తప్పని ముగింపు

వ్రాయదగిన, వ్రాయవలసిన అంశాలు బోలెడు నా కళ్ళ ముందే కనిపిస్తున్నా, నా బుఱ్ఱ నిండుగా ఉన్నా కూడా "ఆ… తరువాత వ్రాయొ"చ్చనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను. చివరికి నన్ను కదిలించి పూనుకునేట్టు చేసిన సంఘటన "మరణం". ఇది నేను తెలిసినవాళ్ళెవరో చనిపోతే వచ్చిన తొందరపాటో తన్నుకువచ్చిన బాధనో కాదు. నిజానికి ఈవారం వార్తాపత్రికల్లో వచ్చి, నా కంటబడిన మూడు మరణవార్తలూ నాకు తెలిసిన, నేను తెలియని వాళ్ళవే: కొణిదెల వెంకటరావు, బేనజిర్ భుట్టో, పి. జనార్దనరెడ్డి – ఈ ముగ్గురిలో ఒకరిది సహజమరణం, మరొకరిది హత్య, ఇంకొకరిది హఠాన్మరణం. …ఏదైతేనేం… అన్నీ ఒకటే – మరణం! రెండు నెలల క్రితం కూడా ఒక మరణవార్త విన్నాను… అది నాకు ఎంతో కావలసిన ఒక దగ్గరి బంధువుది. సంతాపం ప్రకటించాలనుకున్నా ఆ బాధ అయినవాళ్ళను చేరదన్న నిస్సహాయస్థితి.

వీళ్ళంతా మనుషులే… నాకు ఏమవుతారో, ఏమి కారో, …ఏమీ కారో! అయితేనేం… అందరి మరణం ఒకేలా కలచివేసింది. …కాదు, ఒక్కో మరణం ఒక్కొక్క తీరుగా… అన్నీ కలిసి ఒకటే మనసును దాదాపుగా ఒకేసారి కలచివేసాయి, అంతే! …అంతేనా? చెప్పలేనిది ఎంతో ఉంది.

నేను తెలుగు చలనచిత్రసీమ "మెగాస్టార్" చిరంజీవికి అభిమానిని ఏమీ కాదు… అయినా అతని తండ్రి మరణం నాలో బాధను కలిగించింది. నేను బేనజిర్ జీవితాన్ని కానీ, రాజకీయాన్ని కానీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు… అయినా హత్య వార్త చూసిన కళ్ళు కొన్ని క్షణాల వరకు కనిపిస్తున్న వార్తని నమ్మలేదు. నేను కాంగ్రెస్‌వాదినీ కాను, జనార్దనరెడ్డినీ ప్రత్యక్షంగా ఎఱగను… అయినా అర్ధరాత్రి అతని మరణవార్త చూడగానే ఇంట్లో కాలు నిలవక బైటికి వచ్చి మేలుకునే ఉన్న నా సహచరులతో ఆ వార్త తాలూకు దిగ్భ్రమను పంచుకున్నాను. గతసంవత్సరం సద్దామ్ హుస్సేన్‌ని ఉరి తీసినప్పుడు కూడా ఏదో తెలియని, ఇదమిద్ధంగా చెప్పలేని ఇబ్బందికరమైన భావన. (నేను సద్దామ్ సానుభూతిపరుడిని కాదని మనవి.) మరణమంటే కలిగిన ఒక రకమైన …జుగుప్స. "జుగుప్స" అన్న భావనే సరైనదా అంటే …తెలియదు నాకూ!

మరణమంటే…?
విధి చేసిన దారుణమా? మదిలో అనంత(ర) స్మరణమా?
జ్ఞాపకాల తోరణమా? జ్ఞాపకాలతో రణమా?
అనుభవాలు రగిల్చిన వ్రణమా? అనుభూతులు మిగిల్చిన ఋణమా?
ఎవరూ మనకేమీ కాకుండా…పోవటమా??
ఎవరికి ఏమైనా మనకేమీ కాకపోవటమా?!

ఏ మరణం ఎక్కువ బాధాకరం?
తెలిసినవారిదా, తెలియనివారిదా?
"పిచ్చి ప్రశ్న!" అనిపించింది…
 ఈ ప్రశ్న మనసులోకి రాగానే!
వెంటనే ప్రశ్నించిన మనసే హెచ్చరించింది –
జవాబు సులువు కాదని!
"పిచ్చి ప్రశ్న" అనిపించే ప్రతి ప్రశ్నా
సులువైన జవాబు లేనిదే అయి ఉంటుందేం?
…జీవితమనే "పిచ్చి ప్రశ్న"కు
మరణమే "సులువైన జవాబు" అవుతుందా?

ఎవరి మరణవార్త తెలిసినా
మనసులో ఏతత్క్షణంలోనే ఎన్నో ఊహలు…
పుట్టుకకీ చావుకీ ప్రతీకలుగా
అలా పుట్టి ఇలా గిడతాయి
"పునరపి జననం పునరపి మరణం"

"ఆత్మ నాశనము లేని"దన్న గీతాకారుడు
ఇన్ని మరణాల మధ్యన తమ తమ ఆత్మలను
హత్య చేసుకుని బ్రతుకుతున్నవాళ్ళను
లక్ష్యపెడతాడా?
ప్రతి ఘటనకీ స్పందించి స్పందించి
స్పందించటమే మరచిపోయేటంతగా
సొంత ఉనికిని కోల్పోతున్న ప్రాణాలను
పట్టించుకుంటాడా?
"కర్మణ్యేవ-అధికారస్తే మాపలేషు కదాచన"
అన్న హెచ్చరిక మనసులో చేరింది –
"ప్రశ్నించుకో, జవాబు కోసం వెతకొ"ద్దని మెత్తగా వినబడింది!
జీవనవేదం సరిక్రొత్తగా అర్థమైంది!

…మరణవార్త చెవినబడ్డ ప్రతిసారీ శ్రీశ్రీ గుర్తుకొస్తాడు… శ్రీశ్రీని కదిలించిన కొంపెల్ల జనార్దనరావు మరణం గుర్తుకొస్తుంది. "నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన – ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?" అని ప్రశించిన వేటూరి వేదాంతం గుర్తుకొస్తుంది. "అనుకోలేదని ఆగవు కొన్ని" అన్న ఆత్రేయ ఆవేదన గుర్తుకొస్తుంది. ఎంతటివాడినైనా కదిలించే ఆ మృత్యురూపం గుర్తుకొస్తుంది. "దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది – ఇంత కన్న సైన్యముండునా?" అన్న గురువు సీతారామశాస్త్రి హెచ్చరిక గుర్తుకొస్తుంది. …నాకు నేను గుర్తుకొస్తాను! (బేనజిర్ చనిపోయిందని తెలిసిన 6-7 గంటలకు, జనార్దనరెడ్డి మరణవార్త తెలిసిన 1-2 గంటల్లోపు మనసులోని తడులకు, సడులకు, సుడులకు అక్షరరూపాన్నిచ్చే యత్నం.)

సిద్ధార్థ్ – ఒక స్ఫూర్తిమంతమైన విజయం

http://us.rediff.com/news/2005/mar/30spec.htm – ఈ కథనము చదివిన వెంటనే వ్రాస్తున్నాను ఈసారి కూడా – ఈ వార్త కూడా అంతగా కదలించింది. ఇతరులను చిన్న చూపు చూడటమనేది అందరమూ ఎప్పుడో ఒకప్పుడు (తెలిసో తెలియకనో) చేస్తూనే ఉంటాము. "నేనేదీ సాధించలే"నని అందరమూ ఎప్పుడో ఒకప్పుడు డీలా పడుతూనే ఉంటాము. ఆ రెండూ ఎంత తప్పో సిద్ధార్థ్ గురించి చదివిన తక్షణమే (మళ్ళీ) తెలిసివచ్చింది. పేరున్న ‘స్వదేశీ’ సంస్థలు అతనిని తృణీకరిస్తే ఎక్కడి నుంచో వచ్చిన సంస్థ అతని ప్రతిభనే ప్రాతిపదికగా తీసుకుని తగు విధంగా ఉద్యోగమివ్వటమనేది గమనించదగిన సంగతి. అడుగడుగునా ఈసడించి, వెక్కిరించి, తిరస్కరించే ప్రబుద్ధులున్న ఈనాటి మన సమాజంలో సిద్ధార్థ్ ఈ స్థాయిని చేరుకోవటం ఆశ్చర్యానందాలను కలిగించింది. విజయవంతమైన ఈతని జీవితం వెనుక ఎంత మంది ప్రోత్సాహముందో వారందరికీ అభినందనలు, అభివందనాలు. సిద్ధార్థ్ ఇంకా ఉన్నతస్థాయులను చేరుకోవాలని, ఇతని జీవితం మరెందరికో మార్గదర్శకమవాలని, ఇటువంటి కథల నుంచి సమాజం (మనమే) పాఠాలు నేర్చుకోవాలని నా ఆశ.