పొద్దుటి వార్తలు చూసి మఱిగిన రక్తం చల్లబడిన తఱువాత నాకూ, మఱి కొందఱు స్నేహితులకు వచ్చిన ప్రశ్నలలో నుంచి పుట్టిన టపా యిది:
ఈ ఘోరానికి వ్యతిరేకంగా మనమేమీ చేయలేమా? మా మధ్య చర్చలోనూ, నా బుఱ్ఱలోను వచ్చిన ఆలోచనలివి:
- ఏం చేసినా శాంతియుతంగానే చేయాలి. ఇక్కడ యిలా జఱిగినదానికి ప్రతిగా తక్కిన ప్రాంతాల ప్రజలు కూడా యిలాంటి మూర్ఖత్వమే ప్రదర్శిస్తే దానికి వ్యతిరేకంగా కూడా యివే చేయాలి.
- మేథావులతో, గురువులతో, దార్శనికులతో, దిశానిర్దేశకులతో మాట్లాడి మార్గాన్ని నిర్ణయించుకోవాలి.
- ఒక సన్మిత్రుని సూచన: చందాలు పోగు చేసి అయినా ధ్వంసమైన విగ్రహాలను తిఱిగి చెక్కించాలి. ప్రభుత్వాన్ని ఒప్పించి వాటిని పునఃప్రతిష్ఠించాలి.
- చట్టపరమైన చర్యలు, పాలనాపరమైన చర్యలు సరైన దిశలోనూ, నిష్పక్షపాతంగానూ లేకపోతే మిన్నకుండే అర్హత లేదు ప్రజాస్వామ్యంలోని ప్రజలకి. గాంధీ ప్రబోధించిన “క్రియాశీలక అహింసామార్గం” మనకు మార్గదర్శనం చేయాలి. తిఱగబడని జనానిదే తప్పు! జనమంటే మనమే!
- తెలంగాణా ప్రముఖులు అలక్ష్యానికి గుఱయ్యారన్న వాదులో నిజం లేకపోలేదు. (అక్కడ ఉన్న పదుల విగ్రహాలలో యెలా చూసినా ప్రముఖులు చాలా మందిని వదిలేసాము. వాళ్ళలో తెలంగాణా వాఱూ ఉండటం ఆశ్చర్యకరమేమీ కాదు.) ఈ అదనులోనే ఇన్నేళ్ళుగా విగ్రహాలు లేక మిగిలిపోయిన తెలుగు ప్రముఖుల విగ్రహాలు ఊరూరా వాడవాడలా పెట్టిస్తే వాళ్ళ సాంస్కృతిక సేవలు, ఔన్నత్యం అందఱికీ తెలుస్తాయి. అవి తెలియని మౌఢ్యంలోనే జఱిగిన దాడులివి.
- తప్పు మన అందఱిదీ. ఆవేశంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాక సాంస్కృతికప్రతీకలు కూల్చినప్పుడే యిలాంటి టపా వ్రాసిన నాదీ తప్పేనని ఒకరన్న మాట వాస్తవమే. అందుకు నేను సిగ్గుపడాలన్న మాటా వాస్తవమే. తెలంగాణా సంస్కృతినే కాదు, ఏ రకమైన సంస్కృతినైనా అర్థం చేసుకోలేక యీసడిస్తున్నవాఱెవఱైనా సరే, నేను వాళ్ళని దిద్దే ప్రయత్నమే చేసాను, ఇక ముందూ చేస్తాను. తెలంగాణా ప్రజలంటే సంస్కృతి యంటే చాలా మంది కోస్తాంధ్రులకున్న చిన్నచూపును నేనెప్పుడూ చిన్నగా చూపించే ప్రయత్నం చేయలేదు. అలాంటి చిన్నచూపు మనలో ఉన్నా, మన బంధుమిత్రులలో ఉన్నా మనమూ బాగుపడి వాళ్ళనీ బాగుపఱచాలి.
- సమస్య మన మధ్యలోనే ఉన్నా మౌనంగా ఉన్న మన తప్పును చూడకుండానే సమస్యని పరిష్కరించబూనటం కూడా మూర్ఖత్వమే. అది మనలో లేకుండా చూసుకుందాం.
- తెలుగువాళ్ళంతా కలిసి ఉండటానికి మనం చేస్తున్నదేముంది? తెలంగాణా విడిపోరాదని తేల్చిచెప్పటం తప్పించి అక్కడి ప్రజలు మనలో ఒకటిగా, మనతో కలివిడిగా ఉండటానికి మనం చేస్తున్నదేముంది? సమైక్యత అంటే మనకు కావలసినట్టు ఉండటమూ కాదు, ఇప్పుడున్న స్థితిలోనే ఉండిపోవటం కాదు… ఆ ఐక్యభావన పెంపొందించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరమూ పాలు పంచుకోవాలి.
పైన పేర్కొన్న చర్యలలో కొన్ని నేను, ఒకరిద్దఱు మిత్రులు ఇప్పటికే మొదలుపెట్టాము. మఱి మీరు? (ఇంకా మనం చేయదగిన పనులేమైనా ఉంటే మీ వ్యాఖ్యలతో తెలియజేయండి.)
షరా: శీర్షికలోని గీతం డా. సి. నారాయణరెడ్డి గారు “కోడలు దిద్దిన కాపురం” చిత్రం కోసం వ్రాసినది. “ఈ నల్లని రాలలో యే కన్నులు దాగెనో…” అంటూ ఆయన “అమరశిల్పి జక్కన” చిత్రానికి వ్రాసిన గీతం “విగ్రహాలే కదా, మళ్ళీ కట్టుకోవచ్చు!” అన్నవాళ్ళకి సమాధానమిస్తుంది.