Tag Archives: పాట

అమ్మ వ్రాసిన పాటలు: గోదాదేవి కళ్యాణం

క్రితం వారాంతంలో గుడికి వెళ్ళినప్పుడు “గోదాదేవి కళ్యాణం” అన్న ప్రకటన చూసి “ఆ రోజుకైనా ఏదో ఒకటి వ్రాయాలి గోదాదేవి మీద!” అనుకున్నాను. భారతదేశంలో తెల్లవాఱింది కదా అని యింట్లో అమ్మానాన్నలతో మాట్లాడాను. మాటల్లో అమ్మ చెప్పింది తానో పాట వ్రాసానని. ఆ మాట వినగానే చాలా సంతోషం కలిగింది. అమ్మ వ్రాసిన పాటలు చూసి చాలా కాలమే అయింది. ఇంతలో మఱో ఆనందకరమైన మాట విన్నాను: ఆ పాట గోదాకళ్యాణం గుఱించి యని. “ఆహా, ఇందుకే కాబోలు యెన్నడూ లేనిది నాకు అనిపించింది యీసారి వ్రాయాలని!” అనుకున్నాను. నేను వ్రాస్తే కన్నా అమ్మ వ్రాస్తేనే ఆనందం కదా, ఎంతైనా! సరే, వినిపించమన్నాను. చదివింది. పాడమన్నాను. “నాన్న పాడతారు” అని నాన్నని పిలిచింది. నాన్న పాట విని కూడా చాలా కాలమే అయింది. పైగా నాన్న పాడతారనగానే అర్థమైంది సాహిత్యానికి తానే బాణీ కట్టి ఉంటారని! నా ఊహ నిజమే… హిందోళ రాగంలో సులభమైన బాణీలోకి సాహిత్యం అలా ఒదిగిపోయింది! పండుగ నాటి శుభోదయాన అమ్మ సాహిత్యానికి నాన్న బాణీ కట్టి పాడటం – ఎంత మందికి కలుగుతుందో కదా యింతటి హాయి! ఆ పాటయ్యాక అమ్మ తాను మఱో పాట వ్రాస్తున్నానని ఇవాళ బ్యాంక్‌కి సెలవు కాదు కనుక పూర్తి చేసే అవకాశం లేకపోయిందని చెబుతూ నన్ను ఆ పాట “కాస్త అడ్జస్ట్ చేసి మఱో రెండు చరణాలు వ్రాయి” అని అమ్మ చెబితే సంతోషానికి బదులు బాధే వేసింది. అమ్మ పాటని నేను దిద్దటమా?!? నా తొలి గురువు నన్ను అర్థించటమా! అంతటి అపరాధం నేను చేయలేను. ఇది అమ్మ చేతనే పూర్తి చేయించాలని నిశ్చయించుకున్నాను. కానీ, నా ఆనందం ఆపుకోలేక యీ టపా… రెండు పాటలతోనూ. (దిద్దుకోలు: పైన వ్రాసిన పాఠ్యం యథాతథంగా ఉంచాను కానీ అమ్మ మఱునాటికల్లా రెండో పాట పూర్తి చేసింది, మొదటి పాట కూడా చిన్నదిగా ఉందని తనకి కూడా అనిపించటంతో మఱో రెండు చరణాలు చేర్చింది. ఆ మేఱకు క్రింది పాటల పూర్తిపాఠాలను పొందుపఱిచాను.)

రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ | బాణీ: నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస శర్మ

పల్లవి:
మంగళవధువై గోదాదేవి పల్లకి యెక్కెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!

చరణం 1:
కురులతో పూవులకొండెను చుట్టి నుదుటను కళ్యాణతిలకము దిద్ది
భుజమున పలుకుల చిక్లుకను దాల్చి కులుకుల చెలియలు తన వెంట రాగా

చరణం 2:
నీలాల కన్నుల వజ్రాల కాంతులు, కెంపుల చెక్కిళ్ళు, పగడపు పెదవులు
పచ్చల అంచుల పట్టు వస్త్రాలు – బంగరు తనువుకు నవరత్న సిరులు

చరణం 3:
కోవెలలో కొలువైన శ్రీరంగనాథుని కోరి వచ్చిన ముగ్ధ గోదాదేవి
మనసు యిచ్చెనా, మాల వేసెనా, తానే పూమాలగ మాఱిపోయెనా!

చరణం 4:
సరసుడౌ శ్రీరంగనాథుని సరసన పూవుల ఊయల ఊగిన వేళ
మమతల మాలలు గళమున వేసి పరిణయమాడెను జగదేకవిభుని

ఆఖరి పల్లవి:
మంగళవధువౌ గోదాదేవి పరిణయమాడెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!

*

రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ

పల్లవి:
మధురమధురమీ గోదాచరితం
ముగ్ధహృదయమే వధువైన వైనం

చరణం 1:
తులసీవనముల పావనత్వమే విష్ణుచిత్తుని తనయగ మాఱె –
తాను దాల్చిన పూలమాలనే ప్రణయలేఖగా రంగనికంపె 

చరణం 2:
పరమపవిత్ర పూజావిధిని పాశురములలో వివరించినది
భక్తసులభుడౌ శ్రీరంగవిభునితో “అద్వైతము”నే ఆశించినది

చరణం 3:
మార్గశిరాన మంచువానలో తొలిఝాములలో జలకములాడి
వైకుంఠపతియౌ శ్రీరంగనాథుని వ్రతనిష్ఠలతో మెప్పించినది

చరణం 4:
గోదా భక్తికి ముఱిసిన హరియే దివి నుండి భువికి దిగివచ్చెనులే
అంతరంగమున కొలువైన రంగడు వైభోగముగా వరియించెనులే!

శ్రీ వేటూరి సుందరరామమూర్తి: ఒక చిర(ఱు) జ్ఞాపకం

“రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే!”
“ఆకాశాన సూర్యుడుండడు సందెవేళలో!”
“వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి”
“గతించిపోవు గాథ నేననీ!”
“నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?”

ఇలా ఎన్ని వ్రాసినా వేదాంతి, కవి అయినా తన జీవనగీతం కూడా ఇలాగే పాడవలసి వస్తుందని అనిపించనంత చిరంజీవి వేటూరి! “అజరామరం” అని ఎన్నో విషయాల్లో అనాలోచితంగా అనేస్తాం! “నిజంగా జర (ముసలితనం), మరణం లేనివి ఉంటాయా?” అంటే ఉండవేమో… కానీ వేటూరి గారు మాత్రం వయసు వల్ల శరీరం వంగిపోయినా, మనసూ అందులోని భావాలు మాత్రం జరామరణాలకి అతీతంగా, ఎన్ని యేళ్ళైనా యవ్వనంతో పరవళ్ళు తొక్కుతాయనిపిస్తుంది!

“వళిభిర్ముఖమాక్రాన్తమ్ పలితేనామ్ కితమ్ శిరః గాత్రాణి శిథిలాయన్తే తృష్ణైకా తరుణాయతే!”
(“మొహమంతా ముడతలు వచ్చేసాయి, తల మీది వెంట్రుకలు తెల్లబడ్డాయి, శరీరం శిథిలమైపోయింది, కానీ [నాలో] తపన మాత్రం యౌవనోత్సాహంతోనే ఉంది!”) భర్తృహరి వ్రాసిన ఈ శ్లోకం వేటూరి గారికి నప్పినట్టుగా ఎవరికీ నప్పదేమో.

నేను శ్రీ  వేటూరి సుందరరామమూర్తి గారిని కలవటం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. “తానా 2000” కోసమని మా యూనివర్సిటీ పట్నానికి 250 మైళ్ళ దూరంలోని డాలస్‌కి వచ్చిన వేటూరి గారిని మా చిన్న ఊరి వాస్తవ్యులైన ప్రకాశరావు గారు, కొత్తప్ప చెట్టి గారు, చెట్టి గారి శ్రీమతి లక్ష్మి గారు మా యూనివర్సిటీకి తీసుకువచ్చారు. అప్పటికి నేను TeluguCinema.Com లో చేరి ఆరు నెలలైనా కాలేదు! అప్పటి దాకా నేను ఎవరినీ interview చెయ్యాలని, చెయ్యగలననీ అనుకోనూలేదు! అటువంటి పరిస్థితులలో వేటూరి గారిని interview చేయటానికి ఆస్కారముందా అని చెట్టిగారిని అడిగాను, శ్రీ అట్లూరి గారి ప్రోత్సాహంతో. అంతటి ఆఖరి నిముషంలో అడిగినా వేటూరి గారు వెంటనే ఒప్పుకున్నారు!

సినీపరిశ్రమలో ఎవరితోనూ కాసేపైనా నిలబడి మాట్లాడని నేను నా మొదటి interview ఏకంగా గుగ్గురువులైన వేటూరి గారినే చెయ్యాలనేసరికి అలవి కాని ఉత్సాహం! ప్రశ్నలు తయారు చేసుకుందామనే సరికి భయం మొదలైంది. వేటూరి గారు ఆహూతులైన 50-60 మంది విద్యార్థులు, కొన్ని తెలుగు కుటుంబాల వాళ్ళు ఆసక్తిగా వింటూండగా ఎన్నో విషయాలు మాట్లాడారు. వారి మనసు విప్పి మాట్లాడుతున్న తీరుకి నాలో భయం చాలా వరకే పోయిందనిపించింది. (ఆ ఉపన్యాసం అవగానే interview చెయ్యాలి.) ఆ తరువాత నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసారు చెట్టి గారు, ప్రకాశరావు గారు. వెంటనే పాదాభివందనం చేసాను. నిజం ఒప్పుకోవాలంటే అందులో భక్తి కన్నా వణుకు ఎక్కువై తూలి పడతానేమో అన్నంత తడబాటు కలిగి అదే ఊపుతో ఆయన కాళ్ళ మీద పడ్డాను. ఆశీర్వదించి, భుజాలు పట్టుకుని లేపారు. తడబాటు చేతులూ కాళ్ళ నుంచి మాటకి పాకింది! ఎలాగో చెప్పాను ఆయనకి interview సంగతి. “ఓహో, మీరేనా? రండి. ఎక్కడ కూర్చుందాం?” అన్నారు. అప్పటికి నా వయసు 22! ఆ వయసులో “మీరు” అనిపించుకోవటమే ఇబ్బందికరమైతే నా కన్నా 40 యేళ్ళు పెద్దయిన పండితుడూ, యశోవంతుడు అయిన వేటూరి గారు నన్ను “మీరు” అని సంబోధించటం నా తడబాటుని మరీ పెంచేసింది. “ఇక్కడే” అని అప్పటికే అక్కడ వేసుకున్న కుర్చీలు, బల్లా చూపించి నన్ను ఏకవచనంతోనే సంబోధించమని అర్థించాను. “ఇక్కడికొచ్చి పెద్ద చదువులు చదువుతున్నారు… మర్యాద నీలోని సరస్వతికి!” అన్నారు. “స్వామీ, సరస్వతి మీలోనే ఉన్నది. నేను విద్యను అర్థిస్తున్న వాడిని.” అన్నాను. (అయినా ఆయన “మీరు” అంటూనే మాట్లాడారు చాలా వరకూ. అదీ ఆయన సంస్కారం!) ఇంతలోనే నా చేతిలో ఏదో పుస్తకం కూడా ఉండటం చూసి ఆయనకున్న అనుభవం దృష్ట్యా వెంటనే అడిగారు, “మీరు కూడా కవితలు వ్రాస్తారా?” అని. ఊహించని (సమయంలో వచ్చిన) ప్రశ్న! “పాటలు వ్రాస్తాను, పద్యాలు వ్రాయటమూ నేర్చుకుంటున్నాను. కవితలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాను.” అన్నాను బెరుకుగానే. “భేష్, రచనాసరస్వతి కూడా ఉంది మీలో! …అవి చివర్లో చూద్దాం. ముందు interview కానివ్వండి” అన్నారు. చెప్పాను, నాకదే మొదటి interview అని, తప్పులు చేస్తే క్షమించమని. “నేనూ పాత్రికేయుడిగానే మొదలు పెట్టాను నా ప్రస్థానం. నువ్వూ ఆ దారిలో ఉన్నావన్న మాట! ఏమీ భయపడకు.” అని భుజం తట్టారు. ధైర్యం తెచ్చుకుని interview పూర్తి చేసాను. ఓపికగా సమాధానం చెప్పారు అన్ని ప్రశ్నలకీ. చివరగా నన్నూ మళ్ళీ ప్రోత్సహించారు మొదటిదైనా చాలా బాగా చేసానని. ఆయన మాట వరసకి అన్నారేమో తెలియదు కానీ అలా జరిగిన అంకురార్పణ తరువాత నేను TeluguCinema.Com కోసం చేసిన పదుల interviewలకు నమ్మకాన్నిచ్చే పునాది అయింది! అప్పటికి ఇంకా అప్పుడప్పుడే కలం విదిలిస్తున్న నేను ఆయనకి నా వ్రాతలు చూపించాలి అనుకోవటం సాహసమే ఒక రకంగా. (వాటిని “రచనలు” అనే సాహసం కూడా చేసే ధైర్యం లేదు అప్పటికి పూర్తిగా.) నా పిల్లవ్రాతలతో తన సమయం వృధా చేసారని గద్దిస్తారేమోనన్న భయం లోలోపల ఉండింది. అందుకే అసలు చూడమని ఆయనని ఎలా అడగాలా అని మల్లగుల్లాలు పడుతున్నాను ఆయన్ని కలిసే సరికే. అటువంటిది, ఆయనకై ఆయన నా చేతిలో పుస్తకాన్ని బట్టి నా అంతరార్థం గ్రహించటం నా నెత్తి మీద పాలు పోసినట్టైంది! భయమూ తగ్గింది, నా వ్రాతల్లో పస లేకున్నా ఆయనకై ఆయనే చూస్తానన్నారు కనుక ఎక్కువగా తిట్టరేమోనని. Interview సాగుతున్న సమయంలోనే ఆయన ఎంతటి సౌమ్యులో అర్థమైంది. దానితో కోపగించుకోరని పూర్తిగా ధైర్యం వచ్చింది. Interview పూర్తయ్యాక ఆయన తన కళ్ళజోడు తెచ్చుకోలేదనీ, కనుక నన్నే నా వ్రాతలు పైకి చదవమని పురమాయించారు. మామూలుగానైతే గొంతులో పచ్చి వెలక్కాయ పడేదేమో! కానీ అప్పటికే ఆయన ఇచ్చిన ధైర్యం అచంచలమై నేనే గొంతు సవరించుకున్నాను. ఆయనకి విపించిన పద్యాలు మూడో నాలుగో. వాటిలో రెండు ఆయన మీదే వ్రాసినవని గుర్తు. (“సుందరరామ్మూర్తి గారి సొంపగు పాటల్” అన్నది ఒక పద్యం చివరి పాదమైతే “వేటూరీ, మేటివీవు విజ్ఞతనందున్” అన్నది రెండవది. పూర్తి పద్యాలు నా దగ్గర లేవు.) ఆయన విద్వత్తును మెచ్చుకుంటూ, కీర్తిస్తూ పద్యాలు వ్రాయగలిగినా అయాచితంగా వాటిని నా గొంతుతో నేనే చదివి ఆయనకి వినిపించే అవకాశం వస్తుందని నేను ఊహించలేదు! నే వినిపించిన మరో కంద పద్యం ఆయనకి చాలా నచ్చింది: “ఫ్యాషనులని నేటి యువత / భాషను ఖూనీలు జేయ భావము చచ్చెన్ / కాషను చెప్పెడు పెద్దల / ఘోషను పట్టించుకొనరు ఘోరం కాదా!” అన్నది ఆ పద్యం. “బాగా వ్రాసారు, మీరు కూడా సరైన పాళ్ళలో పరభాషా పదాలు కలుపుతూ. చక్కగా ఉంది” అన్నారు. (అప్పటికి interview లోనే పరభాషా పదాల వాడకంపై కాస్త చర్చ జరిగింది.) ఒక పాట కూడా చదివి వినిపించాను: “కొమ్మల్లో కోయిలమ్మ కొత్త పాట పాడగా, గున్నమావి చెట్టు లేత చిగురులేయగా – వసంతమొచ్చెనే ఇలకే అందమై వనములన్ని పచ్చని వెలుగు నింపగా! రావే వసంతమా, వయ్యారమై ఉగాదితో – చేసెయ్ సరాగమే పచ్చపచ్చని వనాలలో” అన్నది ఆ పల్లవి. “ఇంకొన్నేళ్ళు… అక్కర్లేదు, ఇంకొన్నాళ్ళు ఇలాగే వ్రాసినా మీరు సినిమాల్లో గీతరచయిత అయిపోవచ్చు… మీకు ఆ ఉద్దేశం ఉంటే” అన్నారు. కేవలం ప్రోత్సాహకరంగానే ఆ మాటలన్నారని ఇప్పటికీ నమ్ముతున్నా కానీ… నా ఉద్దేశాలన్నీ తెలిసినట్టు, నా మనసు చదివేసినట్టు నాకు కావలసిన ప్రోత్సాహమే ఆయన ఇవ్వటంతో నా జన్మ ధన్యమైంది! అప్పటి దాకా “గీతరచయితని కాగలనా? నాలో నిజంగానే ఒక ‘కవి’ ఉన్నాడా?” అన్న ప్రశ్నలకి ఖచ్చితమైన సమాధానం లేని నా మనసులో ఒక నూత్నతేజాన్ని నింపాయి శ్రీ వేటూరి సుందరామమూర్తి గారి మాటలు!

ఆ ప్రోత్సాహంతో ఇప్పటికీ కలం కదులుతూనే ఉంది, ఆయన మాటలు మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఈ మధ్యే నేను అమెరికాకి వచ్చి పదేళ్ళయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాల పుటలు తిప్పాను. “మళ్ళీ వేటూరి గారిని కలవనేలేదు. ఇప్పటికైనా సెప్టెంబరు 8 కి ఆయనని interview చేసి పదేళ్ళైన సందర్భంగా ఈ పదేళ్ళూ ఆయన పలికిన ప్రోత్సాహపు మాటలే నా పురోగతికి ఎంతటి సహాయం చేసాయో ఆయనకి చెప్పుకుందామని, ఆయన ఆశీస్సులు తీసుకుందామని అనుకున్నాను. ఒకరిద్దరు మిత్రులతో ఆ మాటే అన్నాను కూడా. ఇంతలోనే… ఈ వార్త!

“పోయినోడు ఇక రాడు, ఎవడికెవడు తోడు! ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు! నువ్ పుట్టిన మన్నేరా నిన్ను తిన్నది! కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది! చావుబ్రతుకులన్నవి ఆడుకుంటవి!” …అని ఆయన మాటల్లోనే అనుకోవాలా?

“మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ! కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు! తరతరాలకూ తరగని వెలుగవుతారు, ఇలవేలుపులౌతారు!” …అన్న ఆయన మాటల స్ఫూర్తితోనే ముందుకు సాగిపోవాలా?

“నీ పాట ఒక్కటే నిజం లాగా / నిర్మలమైన గాలి లాగ / నిశ్శబ్ద నదీ తీరాన్ని పలకరించే / శుక్త మౌక్తికం లాగ … నువ్వు లేవు, నీ పాట ఉంది” …అన్న దేవరకొండ బాలగంగాధర తిలక్ మాటలే చెవుల్లో మోగుతుంటే “రాజు మరణించె, ఒక తార నేల రాలె / కవియు మరణించె నొక తార గగనమెక్కె” …అన్న జాషువా మాటల్లోని నిజాన్ని చూసి సంతోషించాలా?

“జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువమ్ జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వమ్ శోచితుమర్హసి” …అని గీతాకారుడు చెప్పినది సబబే! (పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు.అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.) ఎందుకంటే, భర్తృహరి అన్నట్టు కవుల యశస్సు (అనే శరీరం) జరామరణాల భయానికి అతీతమైనది!

“జయన్తి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరాః నాస్తి యేషామ్ యశఃకాయే నాస్తి జరామరణజమ్ భయమ్!” – నిజమే, కళాకారులకు మరణం లేదు! ముఖ్యంగా కవులకు! అతిముఖ్యంగా శ్రీ వేటూరి సుందరరామమూర్తి వంటి కవికి – తెలుగు సినీజగత్తులో అతి సాధారణ సందర్భాల్లో వచ్చే పాటల్లో కూడా కవిత్వం గుప్పించి మెప్పించవచ్చని నిరూపించి సజీవతార్కాణంగా తరతరాలకూ దిక్సూచిగా నిలబడిన మనీషికి!

మాతృదేవోభవ!

“నువ్వు వ్రాసిన ‘అమ్మ’ కవిత (Google) Buzz చెయ్యచ్చుగా?” అని అడిగిన ఒక మిత్రరత్నానికి నేను చెప్పిన సమాధానం “నేనిలాంటి ‘రోజు’లకి importance ఇవ్వను… సరేలే, అయినా ఆ కవిత Buzz చేస్తాలే” అని. ఆ పనే చెయ్యబోతే నేను అమ్మ గుఱించి గతంలో వ్రాసిన పాట గుర్తొచ్చింది. అదీ ఇదీ కలిపి blog చేద్దామనుకున్నా. అంతలోనే అనిపించింది. “‘అమ్మ’ అన్న కవిత ఇప్పటికే పుస్తకంలో ప్రచురితమయింది, ఆ పాటేమో మఱొకరి బాణీకి వ్రాసినది. మఱి ఈరోజున ‘నాది’ అనుకోదగ్గట్టుగా మఱో క్రొత్త రచన చేద్దా”మనుకుని వ్రాసిన కవిత “అమ్మంటే…?” అన్నది. అమ్మంటే నాకు తెలిసేట్టు చేసిన మా అమ్మకూ, సమస్తచరాచరసృష్టికీ అమ్మే ఆధారమంటూ స్ఫూర్తినిచ్చిన ఎందరో కవులకు, రచయితలకు, అమ్మలా నన్ను ఆదరించిన అందఱికీ నెనఱులతో, జీవకోటిలోని ప్రతి అమ్మకీ నమస్కరిస్తూ… పైన పేర్కొన్న మూడు రచనలూ ఇక్కడ:

http://urlm.in/enty/onDays.jpg – ఆగస్ట్ 13, 2003 నాడు ఈనాడు దినపత్రికలో ఈ “దినాల” పైన నేను వెలిబుచ్చిన అభిప్రాయం (ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు!) (షరా: ఈ వ్యాఖ్యలో “సోదరిల” అనే సంకర మాట నాది కాదు – సంపాదకుల పుణ్యం. “సోదరులు” అంటే అన్నదమ్ములే కాదు, అక్కచెల్లెళ్ళు కూడా అనే సంగతి యెప్పటికి గ్రహిస్తారో!)