Tag Archives: భక్తి

అమ్మ వ్రాసిన పాటలు: గోదాదేవి కళ్యాణం

క్రితం వారాంతంలో గుడికి వెళ్ళినప్పుడు “గోదాదేవి కళ్యాణం” అన్న ప్రకటన చూసి “ఆ రోజుకైనా ఏదో ఒకటి వ్రాయాలి గోదాదేవి మీద!” అనుకున్నాను. భారతదేశంలో తెల్లవాఱింది కదా అని యింట్లో అమ్మానాన్నలతో మాట్లాడాను. మాటల్లో అమ్మ చెప్పింది తానో పాట వ్రాసానని. ఆ మాట వినగానే చాలా సంతోషం కలిగింది. అమ్మ వ్రాసిన పాటలు చూసి చాలా కాలమే అయింది. ఇంతలో మఱో ఆనందకరమైన మాట విన్నాను: ఆ పాట గోదాకళ్యాణం గుఱించి యని. “ఆహా, ఇందుకే కాబోలు యెన్నడూ లేనిది నాకు అనిపించింది యీసారి వ్రాయాలని!” అనుకున్నాను. నేను వ్రాస్తే కన్నా అమ్మ వ్రాస్తేనే ఆనందం కదా, ఎంతైనా! సరే, వినిపించమన్నాను. చదివింది. పాడమన్నాను. “నాన్న పాడతారు” అని నాన్నని పిలిచింది. నాన్న పాట విని కూడా చాలా కాలమే అయింది. పైగా నాన్న పాడతారనగానే అర్థమైంది సాహిత్యానికి తానే బాణీ కట్టి ఉంటారని! నా ఊహ నిజమే… హిందోళ రాగంలో సులభమైన బాణీలోకి సాహిత్యం అలా ఒదిగిపోయింది! పండుగ నాటి శుభోదయాన అమ్మ సాహిత్యానికి నాన్న బాణీ కట్టి పాడటం – ఎంత మందికి కలుగుతుందో కదా యింతటి హాయి! ఆ పాటయ్యాక అమ్మ తాను మఱో పాట వ్రాస్తున్నానని ఇవాళ బ్యాంక్‌కి సెలవు కాదు కనుక పూర్తి చేసే అవకాశం లేకపోయిందని చెబుతూ నన్ను ఆ పాట “కాస్త అడ్జస్ట్ చేసి మఱో రెండు చరణాలు వ్రాయి” అని అమ్మ చెబితే సంతోషానికి బదులు బాధే వేసింది. అమ్మ పాటని నేను దిద్దటమా?!? నా తొలి గురువు నన్ను అర్థించటమా! అంతటి అపరాధం నేను చేయలేను. ఇది అమ్మ చేతనే పూర్తి చేయించాలని నిశ్చయించుకున్నాను. కానీ, నా ఆనందం ఆపుకోలేక యీ టపా… రెండు పాటలతోనూ. (దిద్దుకోలు: పైన వ్రాసిన పాఠ్యం యథాతథంగా ఉంచాను కానీ అమ్మ మఱునాటికల్లా రెండో పాట పూర్తి చేసింది, మొదటి పాట కూడా చిన్నదిగా ఉందని తనకి కూడా అనిపించటంతో మఱో రెండు చరణాలు చేర్చింది. ఆ మేఱకు క్రింది పాటల పూర్తిపాఠాలను పొందుపఱిచాను.)

రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ | బాణీ: నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస శర్మ

పల్లవి:
మంగళవధువై గోదాదేవి పల్లకి యెక్కెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!

చరణం 1:
కురులతో పూవులకొండెను చుట్టి నుదుటను కళ్యాణతిలకము దిద్ది
భుజమున పలుకుల చిక్లుకను దాల్చి కులుకుల చెలియలు తన వెంట రాగా

చరణం 2:
నీలాల కన్నుల వజ్రాల కాంతులు, కెంపుల చెక్కిళ్ళు, పగడపు పెదవులు
పచ్చల అంచుల పట్టు వస్త్రాలు – బంగరు తనువుకు నవరత్న సిరులు

చరణం 3:
కోవెలలో కొలువైన శ్రీరంగనాథుని కోరి వచ్చిన ముగ్ధ గోదాదేవి
మనసు యిచ్చెనా, మాల వేసెనా, తానే పూమాలగ మాఱిపోయెనా!

చరణం 4:
సరసుడౌ శ్రీరంగనాథుని సరసన పూవుల ఊయల ఊగిన వేళ
మమతల మాలలు గళమున వేసి పరిణయమాడెను జగదేకవిభుని

ఆఖరి పల్లవి:
మంగళవధువౌ గోదాదేవి పరిణయమాడెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!

*

రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ

పల్లవి:
మధురమధురమీ గోదాచరితం
ముగ్ధహృదయమే వధువైన వైనం

చరణం 1:
తులసీవనముల పావనత్వమే విష్ణుచిత్తుని తనయగ మాఱె –
తాను దాల్చిన పూలమాలనే ప్రణయలేఖగా రంగనికంపె 

చరణం 2:
పరమపవిత్ర పూజావిధిని పాశురములలో వివరించినది
భక్తసులభుడౌ శ్రీరంగవిభునితో “అద్వైతము”నే ఆశించినది

చరణం 3:
మార్గశిరాన మంచువానలో తొలిఝాములలో జలకములాడి
వైకుంఠపతియౌ శ్రీరంగనాథుని వ్రతనిష్ఠలతో మెప్పించినది

చరణం 4:
గోదా భక్తికి ముఱిసిన హరియే దివి నుండి భువికి దిగివచ్చెనులే
అంతరంగమున కొలువైన రంగడు వైభోగముగా వరియించెనులే!