Tag Archives: స్ఫూర్తి

మన “వాళ్ళు” సాధించారు… మఱి మనం?

సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం!” అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గోల్కొండ హైస్కూల్ చిత్రంలోని పాటలో వ్రాసినట్టు అనుమానాస్పదరీతిలో మొదలైనా గెలుపును అందుకోవటానికి తగిన విజిగీష (zeal) కనిపించింది “టీమ్ ఇండియా” ఆటగాళ్ళలో ఈ ప్రపంచ కప్ పోటీల్లో! ఆ తపనకు “సాహో” అనుకుని గెలుపు మీద నమ్మకంతో కళ్ళారా నిద్రపోయాను నిన్న రాత్రి. (నిద్ర మధ్యలో 274/6 అన్న స్కోర్ చూసాక మఱీ సుఖంగా పట్టింది నిద్ర.) విజయమెపుడూ అనాయాస విలాసం కాదనీ, అకుంఠిత దీక్ష ఫలితమేనని గుర్తు చేసే ఉత్కంఠను రేపిన పోటీ యని నిద్ర లేచాకనే తెలిసింది.

…నిజానికి నేను క్రికెట్‌నే కాదు, ఏ క్రీడావళినీ (tournament) పెద్దగా అనుసరించను. అక్కడెక్కడో యెవఱో ఆడుతుంటే యిక్కడ నేను నా పని మానుకుని చూసేదేమిటన్న అలక్ష్యమది. “బోడి చదువులు వేస్టు, నీ బుఱ్ఱంతా భోంచేస్తూ! ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు” అని గురువుగారు వ్రాసినా “క్రీడల్లోనైనా స్ఫూర్తిమంతులుగా, విజయార్హులుగా ఉండా”లనే చెప్పిన సూత్రమేనని గ్రహించాను తప్పితే గురువాక్యంగా స్వీకరించి నాది తప్పనుకోలేదు. (ఆ స్ఫూర్తితోనే నాకు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని గీతరచనలోనూ, తెలుగుసినిమా.కామ్ జాలగూటి కోసం వ్యాసాలు, సమీక్షలు, తదితరరచనావ్యాపకంగా మళ్ళించానని యీ సందర్భంగా ప్రస్తావించటం సముచితం.) 1983 ప్రపంచ కప్ క్రికెట్ క్రీడావళి సమయానికి నాకు ఊహ తెలిసినా అప్పట్లో ప్రసారమాధ్యమాలు యింత విరివిగా లేవు. అప్పటికి నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టలేదు. (అప్పటికి నాకు ఐదేళ్ళు.) ఆ తఱువాతి ప్రపంచ కప్ క్రీడావళులు (1987, రిలయన్స్ కప్; 1992, బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్) మాత్రం చాలా వఱకు అనుసరించాను, ముఖ్యంగా 1987 నాటికి క్రికెట్ ఆడేవాడిని కనుక. (1992 నాటికి దాదాపుగా ఆపేసానని చెప్పాలి.) ఈ కారణాల వలన కూడా క్రికెట్ లేద్దా మఱో క్రీడ – ముఖ్యంగా “ప్రేక్షక క్రీడలు” (“spectator sports” అని మా అన్న సూచించిన పదబంధం) – మనిషిలో నింపే స్థైర్యం, ఎదుగుదల లాంటివి నాకు పరిచయం లేదని ఒప్పుకోవాలి. (1985-’86 ప్రాంతాల్లో యండమూరి వ్రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవలలో నాయకుడు రేవంత్ ప్రపంచవిజేతను చదరంగం ఆటలో ఓడించి స్వదేశానికి వచ్చిన సందర్భంలో తన ఆప్తమిత్రుడు జేమ్స్‌తో ఒక సంభాషణ కనిపిస్తుంది: “…నీకు తెలుసా, జేమ్స్? కనీసం ప్రాంతీయ క్రీడామండలి సెక్రెటరీ కూడా ఫార్మాలిటీగా రాలేదు.” “కారణం నువ్వు క్రికెట్ ఆటగాడివి కాకుండా చదరంగం ఆటగాడివి కావటమా?” – “కాదు, తెలుగువాడిని కావటం” అన్న జవాబిప్పుడు అప్రస్తుతం – ఆ సంభాషణలోని వాస్తవం కూడా ఒక కారణం నాకు క్రికెట్ అంటే చిన్న చూపు యేర్పడటానికి. అతిప్రాచుర్యం (Hype) కల్పించినదాని పట్ల విముఖత నాలో చిన్నపుడే మొదలయిందనటానికి యిదొక నిదర్శనం.)

ఈ ఉపోద్ఘాతమంతా యెందుకంటే యీసారి ప్రపంచ కప్ టీమ్ ఇండియాదేనని మొదటి నుంచీ నాకెందుకో నమ్మకంగా ఉండింది. (క్రికెట్‌ని తదేకంగా అనుసరించకపోవటం వలన కూడా నాకీ నమ్మకం కలిగి ఉండవచ్చు.) మొదట్లో కొంత పడుతూ లేస్తూ సాగినా ఓటమినెఱుగని రీతిలో సాగటం నిర్ద్వంద్వంగా నా నమ్మకాన్ని పెంచింది. ప్రపంచ కప్ క్రీడావళి మొదలైనప్పుడే (నాకు క్రికెట్ పట్ల ఆసక్తి పెద్దగా లేదని అప్పటికి అతనికి తెలియక) భారత క్రీడాకారచయం (team) అభిమానుల ఆశలను ప్రతిబింబించేలా నేనొక గీతం వ్రాస్తే దృశ్యకం (video) తయారుచేద్దామనుకుంటున్నానని ఒక దర్శక-మిత్రుడు అడిగాడు. అప్పటి నుంచి కొద్దో గొప్పో ఆసక్తితో అనుసరించాను యీ క్రీడావళినీ, ఆటగాళ్ళ పాత్రపోషణను. నిజానికి పల్లవి వఱకు వ్రాసిన తఱువాత ఆ గీతదృశ్యక రూపకల్పన సాధ్యం కాదని తేలినా ఆ పల్లవి మాత్రం పదేపదే నా నమ్మకానికి రూపంగా నిలిచింది. ప్రఖ్యాత బ్రెజిల్ రచయిత పాలో కొయెలో చెప్పిన ఒక సూక్తిని తెనిగిస్తూ వ్రాసిన ఆ పల్లవి యిదీ:

కోట్ల మందిని ప్రతినిధులుగా మీరు నిలిచిన ఆటలో
కోరి వళ్డ్ కప్ తీసుకొస్తారంటు గెలిచే ఆశతో
మది నమ్మిన విజయం కోసం ప్రతి అడుగూ అంకితమైతే
మన ఱేపటి ఉదయం కోసం జగమంతా వెలుగులనీదా!

ఇన్నేళ్ళ కల నిజమవ్వాలని మీ వెంటుందిలా యీ భరతావని!

పాలో కొయెలో రచనలు నేను చదవలేదు, కానీ నా సొంత సూక్తి ఒకటి ఉంది యిలాంటిదే: “మన నిశ్చయాన్ని నిజం చేయటం కన్నా విధికి మఱో యెంపిక లేదు!” (“Fate has no choice than to realize what we determine.”). నా దృష్టిలో టీమ్ ఇండియా సాధించిన యీ విజయానికి కారణం జట్టులోని ఆటగాళ్ళందఱూ త్రికరణశుద్ధిగా అలాంటి సూక్తుల అంతరార్థాన్ని, స్వప్నమాత్రంగా ఉన్న యీ విజయాన్ని “నమ్మటం”… అదీ గత ప్రపంచ కప్ క్రీడావళి అనుభవం నేర్పిన పాఠాలను నిరంతరం స్మరించుకుని నాటి ఉన్మాదాత్మక అభిమానుల ఆగ్రహజ్వాలలో తమ స్థైర్యానికి చితి పేర్చకపోవటం వల్లనే సాధ్యమైందని నా విశ్వాసం. (వెన్నెల్లో ఆడపిల్ల నవలలోనే ఉన్న “విజయమా విజయమా – వస్తూ శిఖరాన్నెక్కిస్తావు, వెళ్తూ పాతాళానికి తోస్తావు…” అన్న వాక్యం యీ సందర్భంగా గమనార్హం. శ్రీశ్రీ వ్రాసిన ఆఁ.. అన్న కవిత కూడా.)

టెండూల్కర్‌కి నేను అభిమానిని కాను. కారణం పైన పేర్కొన్నట్టు అతనికి అందఱూ యిచ్చే అతిప్రాచుర్యమే. కానీ, కేవలం తన శతాలతోనే 10,000 పఱుగులకు చేఱువలో ఉన్న ఆ స్ఫూర్తిమంతుడి మీద, అతని పట్టుదల, మొక్కవోని దీక్ష , నిరంతర సాధనల పట్ల తగుస్థాయి గౌరవమూ ఉంది. (నా మిత్రులకు కొన్నిసార్లు నా వ్యాఖ్యలు అగౌరవంలానూ అనిపించాయంటే అది వాఱి తప్పు కాదు. 15 మంది ఉన్న జట్టులో ఒక్కరికే – ఆ ఒక్కరూ ఎవఱైనా సరే – పేరు రావటం సముచితం కాదనే నా అభిప్రాయం. ఆ పరిస్థితి వలన అతనొక్కడూ నిష్క్రమిస్తే బ్యాటింగ్ ఆర్డర్ మొత్తమూ పేకమేడలా కూలిపోవటం మనమే కోరి తెచుకున్న దౌర్భాగ్యమనిపిస్తుంది నాకు. ఆ పరిస్థితిని కూడా ఎదుఱీదిన స్ఫూర్తిమంతత్వం గతంలోనూ ఉన్నా శ్రీలంకతో జఱిగిన కప్ క్రీడావళి చివఱి ఘట్టంలోనూ నిదర్శనమైందన్న వాస్తవం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం కావాలి.)

క్రికెట్ చరిత్ర పుటలలో పుంఖానుపుంఖాలుగా ప్రస్తావించదగ్గ జ్ఞాపకాలను ప్రోది చేసుకున్న “టెండూల్కర్ స్థాయి” ఒక పాఠమై నిలిస్తే క్రీడలను అనుసరించని, టెండూల్కర్‌ని పూనుకుని కీర్తించని నాలాంటి వాఱితో సహా తరతరాల భారత యువతకు స్ఫూర్తినీయగలదు. ఈ ప్రపంచ కప్ క్రీడావళిలో టీమ్ ఇండియా పన్నిన క్రీడావ్యూహాలు, ప్రదర్శించిన క్రీడాగరిమ, పోరాటపటిమ నుంచి నేర్చుకొదగ్గ విషయాలను గ్రహించకపోతే యీ విజయానికి అర్థం లేదు. ఇన్నేళ్ళ మన కల నిజం చేసారు వాళ్ళు. మఱి మన గుఱించి కలలు కనే మన బంధుమిత్రులకు, మనకు కూడా మనమే ఆ కలలను నిజం చేయాలన్న స్ఫూర్తితో సాగకపోతే 28 యేళ్ళ చరిత్ర పునరావృతికి ఉనికి ఉండదు. క్రీడాస్ఫూర్తిని దైనందిన జీవితంలోనూ అంతస్థం (internalize) చేసుకుని స్వప్నసాకారం సాధించి నేటి మన ఆనందాన్ని మనల్ని నమ్మినవాళ్ళకు కూడా అందిద్దాం.

కొసమెఱుపు: (ఇది క్రికెట్ గుఱించి కాదు. మన దేశస్థుల్లో కొందఱి మౌఢ్యాన్ని గుఱించి, జాత్యహంకారాన్ని గుఱించి.) పాకిస్థాన్ దేశమన్నా, వాఱి క్రికెట్ జట్టు అన్నా సరిపడని ముస్లిమ్ స్నేహితుడు ఒకడున్నాడు నాకు. ముస్లిమ్‌లంతా పాకిస్థాన్ జట్టుకే అభిమానులని తలచే చాలా మంది మూఢత్వానికి సమాధానం అతని ఫేస్‌బుక్ ప్రవర (profile) చూస్తే యెంత మంది అతని లాగానే, మన లాగానే మన దేశాన్ని మన జట్టుని (నా లాగా యిఱుదేశస్థుల సౌభ్రాతృత్వాన్ని ఆశించే వాఱి కన్నా) అమితంగా ప్రేమిస్తారో తెలుస్తుంది.

దొంగల ముఠా … ఎందుకు తీసినట్టు?

గమనిక: ఇది సమీక్ష కాదు! “మఱెందుకు వ్రాసినట్టు?” అనే ప్రశ్నకి సమాధానం టపాలోనే ఉంది.

(నిష్పూచీ: ఈ టపా వ్రాస్తున్నపటికి నేనింకా రామ్‌గోపాల్‌వర్మ తీసిన “దొంగల ముఠా” చూడలేదు. చూసినా నా క్రింది అభిప్రాయంలో మార్పుండబోదు. చూడకపోయినా అలాంటి అభిప్రాయమేర్పఱచుకోవటం తప్పు కాదు.)

కేవలం 6.5 లక్షల రూపాయలతో సినిమా తీసి చూపించారు రామ్‌గోపాల్‌వర్మ. సంతోషం! (గురుదక్షిణగా వర్మ పేరునే దర్శకుడిగా ప్రకటిస్తూ రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడైన (జె.డి.) చక్రవర్తి గతంలో తీసిన మధ్యాహ్నం హత్య చిత్రానికి అయిన ఖర్చు 18 లక్షలని అప్పట్లో విన్నాను. నిజానిజాలు తెలియవు.) “అది మంచి ప్రయోగం!” అని అనను. ఎందుకంటే తెఱ మీద ఆ శ్రమ తాలూకు ఫలితం కనీస ప్రమాణాలతోనే ఉండబోతోందని వర్మకి ముందే తెలుసు. ఇక 6.5 లక్షల రూపాయలతో తీయటం అందఱికీ సాధ్యమా అంటే కాదనే చెప్పాలి. వర్మ అంతటి దర్శకుడు పిలిస్తే రవితేజ, ఛార్మి, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, లక్ష్మీప్రసన్న, బ్రహ్మాజీ, సుబ్బరాజు, సుప్రీత్ మొదలైనవాళ్ళంతా పారితోషికం లేకుండా పని చేస్తారు కానీ మీరూ నేను పిలిస్తే చెయ్యరు, క్రొత్తవాళ్ళని పెడితే చూడరు. “ఇలాంటి వినూత్న ప్రయోగాలనైతే ఆదరిస్తా”మంటూ “బయటి నుంచి మద్దతు ప్రకటించే వాళ్ళు” చాలా మందికి డి.టి.యస్. (నిశ్శబ్దం), అతడు+ఆమె=9, వంశం లాంటి సినిమాలు విడుదలైనట్టు కానీ, అలాంటివెన్నో చిత్రాలు తయారీలో ఆగిపోయిన సంగతి కానీ తెలిసి ఉండకపోవచ్చు. (“ప్రచారం చెయ్యకుంటే మా తప్పా?” అంటారా? నేను తెలుసుకున్నది కూడా వార్తాపత్రికల నుంచే మఱి! పైగా డి.టి.యస్. చిత్రంలో నటించిన ఆదిత్య ఓం, వంశంలో నటించిన చంద్రమోహన్, బాలాదిత్య, నాగబాబు క్రొత్తవాళ్ళు కాదు.) ఆ చిత్రాలెలా ఉన్నాయన్న సంగతి వదిలేస్తే వాటిలో ఉన్న ప్రయోగాత్మకతకి గుర్తింపు దక్కలేదనేది మాత్రమే నా ఉద్దేశం.

ఛాయగ్రహ నిర్వాహకులు/దర్శకులు లేకుండా, 5 మంది కెమెరామెన్‌తో, 5 ప్రధాన పాత్రలతో, 5 రోజులు చిత్రీకరణ జఱుపుకొని, 5 వారాల నిర్మాణోత్తర కార్యక్రమాల తఱువాత విడుదలైన చిత్రం దొంగల ముఠా. ప్రయోగం పేరుతో వర్మ పరమ చెత్త సినిమా తీసాడని చాలా మంది ఉద్దేశం. “సినిమాలు తీసేది యేదో నిరూపించటానికా, లేక వినోదం కోసమా?” అనడిగారు కొందఱు సమీక్షకులు. “కథాకథనాలలో క్రొత్తదనం లేకుండా సినిమాలు తీసి రచ్చకెక్కి ప్రచారంతో బ్రతికేస్తున్న రామ్‌గోపాల్‌వర్మ”ని చెఱిగేసిన అలాంటి ప్రేక్షకసమీక్షకులకు నా ప్రశ్న: “జేమ్స్  క్యామెరూన్ తీసిన అవతార్ చిత్రంలో మీకు కనిపించిన క్రొత్తదనమేమిటి?” …నాకు తెలుసు, వెంటనే “అవతార్ లాంటి మహాద్భుతానికీ, దొంగల ముఠా లాంటి చెత్తకీ  పోలికనా?!” అంటారని. ఏం, తప్పేంటి?! ఒకడు ప్రయోగం పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రొత్త ప్రపంచాన్ని సృష్టించాడుట. ’50ల, ’60ల దశకాలలోనే ప్రతి పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రమూ సృష్టించలేదా క్రొత్త ప్రపంచాలను? ఫలానా లాంటి సినిమా తీయాలని నిర్ణయించుకుని, 12 యేళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రమించి కథాపరంగా, పాత్రల చిత్రణాపరంగా క్రొత్తదనమనేది ఈషణ్మాత్రమైనా లేని అవతార్ చూడాటానికి లేని యిబ్బంది కేవలం ఛాయాచిత్రాలు తీసుకోవటానికి వాడే 5 కెమెరాలతో 5 రోజుల్లోనైనా ఒక చలనచిత్రాన్ని తీయవచ్చని చూపిస్తేనే వచ్చిందా? అవతార్ చిత్రాన్ని ఈ శతాబ్దపు అద్భుతంగా, “తెల్లోడి మాయ”గా తేల్చేసిన చాలా మంది “మేథావి ప్రేక్షకసమీక్షకులు” నా లాంటి మూర్ఖుడికి సమాధానాలు చెప్పరు. కనీసం వాళ్ళకైనా ఆ సమాధానాలు తెలిస్తే చాలని నాకనిపిస్తుంది.

రామ్‌గోపాల్‌వర్మ యెన్ని మాటలు చెప్పి యెంత నాసిరకమైన సినిమాని యెంత విసుగు కలిగించేలా తీసారన్నదే చాలా మందికి కనిపించవచ్చు గాక తెఱ మీద. నాకు మాత్రం చిట్టి (తక్కువ నిడివి) చలనచిత్రాలు తీసే చాలా మంది ఔత్సాహికులకు ఒక నమ్మకాన్నిచ్చారనిపిస్తుంది. పారితోషికం తగ్గించుకుని చలనచిత్ర నిర్మాతలకు మేలు చేయమని యెన్ని రకాలుగా అడిగినా తల ఒగ్గని నటులు నిర్ద్వంద్వంగా ముందుకు రావాలంటే చలనచిత్ర నిర్మాణకారులు చూపించవలసిన నమ్మకం తాలూకు నిలువెత్తు రూపం కనిపిస్తుంది. లాభాల్లో వాటాలే తప్పించి పారితోషికమివ్వకపోవటమన్న పద్ధతి చలనచిత్రరంగానికి మున్ముందు యే రకమైన క్రొత్త ఊపిరులూదగలదో కనిపిస్తుంది. “ఒక సినిమా చేస్తుండగా మఱో సినిమా గుఱించి ఆలోచిస్తే మహాపాపం, కళాసరస్వతికి అవమానం! అది యేకాగ్రతని దెబ్బ తీస్తుంది.” అని “ఆడలేక మద్దెల ఓడు” అన్నట్టు కబుర్లు చెప్పే చాలా మంది దర్శకులకు చెంపపెట్టులా కనిపిస్తుంది. కోడిరామకృష్ణ, దాసరి నారాయణరావు లాంటి ఉద్దండులు ఏకసమయంలో అనేక చిత్రీకరించిన సందర్భాన్ని గుర్తుకు తెస్తుంది. ఆశాభావం చిగురిస్తుంది.

కొసమెఱుపు: మన ఖర్మ యేమిటంటే సినిమాని ఆరున్నర లక్షల్లో తీసినా అరవై కోట్లతో తీసినా ప్రేక్షకుల నెత్తిన పడే టికెట్ ధరలో మార్పు లేకపోవటం. అది మాఱకపోతే నాలాంటి వాడికి యెన్ని ఆశలు చిగురించినా ప్రేక్షకుడికి జేబు చిఱుగుతూనే ఉంటుంది. ఎప్పటి లాగే అ.సం.రాలో ఈ చలనచిత్రానికి టికెట్ ధర $12. మఱి యీ దొంగల ముఠా వలన వచ్చే బాధలు తీర్చేదెవఱు?!

(షరా: కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు చిత్రం కూడా నేనింకా చూడలేదు. ఒకవేళ అదీ బాగాలేదనిపించినా దానికీ, దీనికీ దీని తఱువాత రామ్‌గోపాల్‌వర్మ తీయబోయే చిత్రాలకి, అంతకు ముందు వర్మ తీసిన చిత్రాలకీ ముడి పెట్టబోను. దేని సంగతి దానిదే! మఱొక సంగతి కూడా చెప్పాలి: “వర్మ యింత కన్నా బాగా తీయగలడు” అనిపించటంలో ఆశ్చర్యం లేదు. కానీ, “పెట్టనమ్మ యెలాగూ పెట్టలేదు, ఎప్పుడూ పెట్టే ముం*వి నీకేమయిం”దన్న బిచ్చగాడి సామెత చెప్పినట్టు కళాభిక్ష కోసం చూస్తున్న నాలాంటి వాడికి దర్శకుడు సరిగా తీయలేదని అతన్ని తిట్టే హక్కు మాత్రం ఉండదు. “నచ్చకపోతే చూడకండి. ఎలాగైనా చూడమని యెవడేడిసాడు?” అని వర్మయే అన్నారు ఎన్నోసార్లు.)