మన “వాళ్ళు” సాధించారు… మఱి మనం?

సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం!” అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గోల్కొండ హైస్కూల్ చిత్రంలోని పాటలో వ్రాసినట్టు అనుమానాస్పదరీతిలో మొదలైనా గెలుపును అందుకోవటానికి తగిన విజిగీష (zeal) కనిపించింది “టీమ్ ఇండియా” ఆటగాళ్ళలో ఈ ప్రపంచ కప్ పోటీల్లో! ఆ తపనకు “సాహో” అనుకుని గెలుపు మీద నమ్మకంతో కళ్ళారా నిద్రపోయాను నిన్న రాత్రి. (నిద్ర మధ్యలో 274/6 అన్న స్కోర్ చూసాక మఱీ సుఖంగా పట్టింది నిద్ర.) విజయమెపుడూ అనాయాస విలాసం కాదనీ, అకుంఠిత దీక్ష ఫలితమేనని గుర్తు చేసే ఉత్కంఠను రేపిన పోటీ యని నిద్ర లేచాకనే తెలిసింది.

…నిజానికి నేను క్రికెట్‌నే కాదు, ఏ క్రీడావళినీ (tournament) పెద్దగా అనుసరించను. అక్కడెక్కడో యెవఱో ఆడుతుంటే యిక్కడ నేను నా పని మానుకుని చూసేదేమిటన్న అలక్ష్యమది. “బోడి చదువులు వేస్టు, నీ బుఱ్ఱంతా భోంచేస్తూ! ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు” అని గురువుగారు వ్రాసినా “క్రీడల్లోనైనా స్ఫూర్తిమంతులుగా, విజయార్హులుగా ఉండా”లనే చెప్పిన సూత్రమేనని గ్రహించాను తప్పితే గురువాక్యంగా స్వీకరించి నాది తప్పనుకోలేదు. (ఆ స్ఫూర్తితోనే నాకు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని గీతరచనలోనూ, తెలుగుసినిమా.కామ్ జాలగూటి కోసం వ్యాసాలు, సమీక్షలు, తదితరరచనావ్యాపకంగా మళ్ళించానని యీ సందర్భంగా ప్రస్తావించటం సముచితం.) 1983 ప్రపంచ కప్ క్రికెట్ క్రీడావళి సమయానికి నాకు ఊహ తెలిసినా అప్పట్లో ప్రసారమాధ్యమాలు యింత విరివిగా లేవు. అప్పటికి నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టలేదు. (అప్పటికి నాకు ఐదేళ్ళు.) ఆ తఱువాతి ప్రపంచ కప్ క్రీడావళులు (1987, రిలయన్స్ కప్; 1992, బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్) మాత్రం చాలా వఱకు అనుసరించాను, ముఖ్యంగా 1987 నాటికి క్రికెట్ ఆడేవాడిని కనుక. (1992 నాటికి దాదాపుగా ఆపేసానని చెప్పాలి.) ఈ కారణాల వలన కూడా క్రికెట్ లేద్దా మఱో క్రీడ – ముఖ్యంగా “ప్రేక్షక క్రీడలు” (“spectator sports” అని మా అన్న సూచించిన పదబంధం) – మనిషిలో నింపే స్థైర్యం, ఎదుగుదల లాంటివి నాకు పరిచయం లేదని ఒప్పుకోవాలి. (1985-’86 ప్రాంతాల్లో యండమూరి వ్రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవలలో నాయకుడు రేవంత్ ప్రపంచవిజేతను చదరంగం ఆటలో ఓడించి స్వదేశానికి వచ్చిన సందర్భంలో తన ఆప్తమిత్రుడు జేమ్స్‌తో ఒక సంభాషణ కనిపిస్తుంది: “…నీకు తెలుసా, జేమ్స్? కనీసం ప్రాంతీయ క్రీడామండలి సెక్రెటరీ కూడా ఫార్మాలిటీగా రాలేదు.” “కారణం నువ్వు క్రికెట్ ఆటగాడివి కాకుండా చదరంగం ఆటగాడివి కావటమా?” – “కాదు, తెలుగువాడిని కావటం” అన్న జవాబిప్పుడు అప్రస్తుతం – ఆ సంభాషణలోని వాస్తవం కూడా ఒక కారణం నాకు క్రికెట్ అంటే చిన్న చూపు యేర్పడటానికి. అతిప్రాచుర్యం (Hype) కల్పించినదాని పట్ల విముఖత నాలో చిన్నపుడే మొదలయిందనటానికి యిదొక నిదర్శనం.)

ఈ ఉపోద్ఘాతమంతా యెందుకంటే యీసారి ప్రపంచ కప్ టీమ్ ఇండియాదేనని మొదటి నుంచీ నాకెందుకో నమ్మకంగా ఉండింది. (క్రికెట్‌ని తదేకంగా అనుసరించకపోవటం వలన కూడా నాకీ నమ్మకం కలిగి ఉండవచ్చు.) మొదట్లో కొంత పడుతూ లేస్తూ సాగినా ఓటమినెఱుగని రీతిలో సాగటం నిర్ద్వంద్వంగా నా నమ్మకాన్ని పెంచింది. ప్రపంచ కప్ క్రీడావళి మొదలైనప్పుడే (నాకు క్రికెట్ పట్ల ఆసక్తి పెద్దగా లేదని అప్పటికి అతనికి తెలియక) భారత క్రీడాకారచయం (team) అభిమానుల ఆశలను ప్రతిబింబించేలా నేనొక గీతం వ్రాస్తే దృశ్యకం (video) తయారుచేద్దామనుకుంటున్నానని ఒక దర్శక-మిత్రుడు అడిగాడు. అప్పటి నుంచి కొద్దో గొప్పో ఆసక్తితో అనుసరించాను యీ క్రీడావళినీ, ఆటగాళ్ళ పాత్రపోషణను. నిజానికి పల్లవి వఱకు వ్రాసిన తఱువాత ఆ గీతదృశ్యక రూపకల్పన సాధ్యం కాదని తేలినా ఆ పల్లవి మాత్రం పదేపదే నా నమ్మకానికి రూపంగా నిలిచింది. ప్రఖ్యాత బ్రెజిల్ రచయిత పాలో కొయెలో చెప్పిన ఒక సూక్తిని తెనిగిస్తూ వ్రాసిన ఆ పల్లవి యిదీ:

కోట్ల మందిని ప్రతినిధులుగా మీరు నిలిచిన ఆటలో
కోరి వళ్డ్ కప్ తీసుకొస్తారంటు గెలిచే ఆశతో
మది నమ్మిన విజయం కోసం ప్రతి అడుగూ అంకితమైతే
మన ఱేపటి ఉదయం కోసం జగమంతా వెలుగులనీదా!

ఇన్నేళ్ళ కల నిజమవ్వాలని మీ వెంటుందిలా యీ భరతావని!

పాలో కొయెలో రచనలు నేను చదవలేదు, కానీ నా సొంత సూక్తి ఒకటి ఉంది యిలాంటిదే: “మన నిశ్చయాన్ని నిజం చేయటం కన్నా విధికి మఱో యెంపిక లేదు!” (“Fate has no choice than to realize what we determine.”). నా దృష్టిలో టీమ్ ఇండియా సాధించిన యీ విజయానికి కారణం జట్టులోని ఆటగాళ్ళందఱూ త్రికరణశుద్ధిగా అలాంటి సూక్తుల అంతరార్థాన్ని, స్వప్నమాత్రంగా ఉన్న యీ విజయాన్ని “నమ్మటం”… అదీ గత ప్రపంచ కప్ క్రీడావళి అనుభవం నేర్పిన పాఠాలను నిరంతరం స్మరించుకుని నాటి ఉన్మాదాత్మక అభిమానుల ఆగ్రహజ్వాలలో తమ స్థైర్యానికి చితి పేర్చకపోవటం వల్లనే సాధ్యమైందని నా విశ్వాసం. (వెన్నెల్లో ఆడపిల్ల నవలలోనే ఉన్న “విజయమా విజయమా – వస్తూ శిఖరాన్నెక్కిస్తావు, వెళ్తూ పాతాళానికి తోస్తావు…” అన్న వాక్యం యీ సందర్భంగా గమనార్హం. శ్రీశ్రీ వ్రాసిన ఆఁ.. అన్న కవిత కూడా.)

టెండూల్కర్‌కి నేను అభిమానిని కాను. కారణం పైన పేర్కొన్నట్టు అతనికి అందఱూ యిచ్చే అతిప్రాచుర్యమే. కానీ, కేవలం తన శతాలతోనే 10,000 పఱుగులకు చేఱువలో ఉన్న ఆ స్ఫూర్తిమంతుడి మీద, అతని పట్టుదల, మొక్కవోని దీక్ష , నిరంతర సాధనల పట్ల తగుస్థాయి గౌరవమూ ఉంది. (నా మిత్రులకు కొన్నిసార్లు నా వ్యాఖ్యలు అగౌరవంలానూ అనిపించాయంటే అది వాఱి తప్పు కాదు. 15 మంది ఉన్న జట్టులో ఒక్కరికే – ఆ ఒక్కరూ ఎవఱైనా సరే – పేరు రావటం సముచితం కాదనే నా అభిప్రాయం. ఆ పరిస్థితి వలన అతనొక్కడూ నిష్క్రమిస్తే బ్యాటింగ్ ఆర్డర్ మొత్తమూ పేకమేడలా కూలిపోవటం మనమే కోరి తెచుకున్న దౌర్భాగ్యమనిపిస్తుంది నాకు. ఆ పరిస్థితిని కూడా ఎదుఱీదిన స్ఫూర్తిమంతత్వం గతంలోనూ ఉన్నా శ్రీలంకతో జఱిగిన కప్ క్రీడావళి చివఱి ఘట్టంలోనూ నిదర్శనమైందన్న వాస్తవం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం కావాలి.)

క్రికెట్ చరిత్ర పుటలలో పుంఖానుపుంఖాలుగా ప్రస్తావించదగ్గ జ్ఞాపకాలను ప్రోది చేసుకున్న “టెండూల్కర్ స్థాయి” ఒక పాఠమై నిలిస్తే క్రీడలను అనుసరించని, టెండూల్కర్‌ని పూనుకుని కీర్తించని నాలాంటి వాఱితో సహా తరతరాల భారత యువతకు స్ఫూర్తినీయగలదు. ఈ ప్రపంచ కప్ క్రీడావళిలో టీమ్ ఇండియా పన్నిన క్రీడావ్యూహాలు, ప్రదర్శించిన క్రీడాగరిమ, పోరాటపటిమ నుంచి నేర్చుకొదగ్గ విషయాలను గ్రహించకపోతే యీ విజయానికి అర్థం లేదు. ఇన్నేళ్ళ మన కల నిజం చేసారు వాళ్ళు. మఱి మన గుఱించి కలలు కనే మన బంధుమిత్రులకు, మనకు కూడా మనమే ఆ కలలను నిజం చేయాలన్న స్ఫూర్తితో సాగకపోతే 28 యేళ్ళ చరిత్ర పునరావృతికి ఉనికి ఉండదు. క్రీడాస్ఫూర్తిని దైనందిన జీవితంలోనూ అంతస్థం (internalize) చేసుకుని స్వప్నసాకారం సాధించి నేటి మన ఆనందాన్ని మనల్ని నమ్మినవాళ్ళకు కూడా అందిద్దాం.

కొసమెఱుపు: (ఇది క్రికెట్ గుఱించి కాదు. మన దేశస్థుల్లో కొందఱి మౌఢ్యాన్ని గుఱించి, జాత్యహంకారాన్ని గుఱించి.) పాకిస్థాన్ దేశమన్నా, వాఱి క్రికెట్ జట్టు అన్నా సరిపడని ముస్లిమ్ స్నేహితుడు ఒకడున్నాడు నాకు. ముస్లిమ్‌లంతా పాకిస్థాన్ జట్టుకే అభిమానులని తలచే చాలా మంది మూఢత్వానికి సమాధానం అతని ఫేస్‌బుక్ ప్రవర (profile) చూస్తే యెంత మంది అతని లాగానే, మన లాగానే మన దేశాన్ని మన జట్టుని (నా లాగా యిఱుదేశస్థుల సౌభ్రాతృత్వాన్ని ఆశించే వాఱి కన్నా) అమితంగా ప్రేమిస్తారో తెలుస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s