అసంభవమై,
ప్రళయకాల జృంభణమై,
లయమే తన లయగా
భూనభోంతరాళాలు ఏకమయ్యేలా
చెలరేగిన కరాళ నృత్యం –
అస్తవ్యస్తమైన ఆంగికంతో
తెలియని సంయోగాన్ని సాధించే యత్నం…
చిరపరిచిత అభ్యాసం,
స్వరపరచని విన్యాసం!
విలయకారుని సాన్నిధ్యంలో
సమయపాలన సరి నైవేద్యం!
లయబద్ధమైన ప్రతి అడుగూ
అహంభావాన్ని దూరం చేస్తూ
విలయమే ఆవహించినట్టు
స్వయంగా సమర్పితమౌతూ
అప్రయత్నంగా
అన్యోన్యత నాహ్వానిస్తూ
అనాలోచితంగా
అధిదేవుని కంకితమౌతూ…
శంకరుని స్వేదామృతగీతాలే
జగన్మాత క్షీరోధృతిపాతాలై,
మనశ్శాంతి సంకేతాలై,
అచంచల విశ్వాసాలై,
లోకనాథుని నిశ్వాసాలై,
శివకరుణాదృక్‌శీకరాలే
సర్వేంద్రియ వశీకరాలై…
స్పందించే జగత్సమస్తం
మౌనాశ్రిత సమ్మోహితం!
పదఘట్టన లేదు,
నవజాతశిశువు లాస్యం తప్ప!
కనులు తెరిచిన తొలి సంభ్రమం –
అస్తిత్వంలో నాస్తి యైనట్టు
భువనఘోషలో చిరు కూడిక –
తుది శ్వాసలోని జీవమే
పరమాద్భుతమైనట్టు…
ఇక నృత్యం లేదు,
ఉచ్ఛ్వాసం లేదు,
సశరీర సాక్ష్యం లేదు,
అత్యుత్తమ జ్ఞానం లేదు,
ఐక్యమయ్యే కారణం లేదు!
ఉన్నది …ఒక్కటే!
(మూలం: <http://parnashaala.blogspot.com/2009/05/blog-post.html> వద్ద మహేశ్ గారు ఉటంకించిన శేఖర్ కపూర్ విరచిత ఆంగ్లకవిత “Dancing with Shiva”.)
షరా: ఆ పుటలోనే ఉన్న మహేశ్ గారి తెలుగు సేత కానీ వ్యాఖ్యాల్లో కనిపించే రేరాజు గారి ప్రయత్నం కానీ ఈ కవితకు మూలం కాదు. అన్నీ ఒకే కవితకు అనుసృజనలు/అనువాదాలు కనుక కొన్ని పదాలు, భావాలు ఒకేలా అనిపించవచ్చు. మూలం కన్నా నాకు మహేశ్ గారి ప్రయత్నమే నచ్చింది. కానీ, చాలా వరకూ సరళమైన భాషతోనే చేసిన మహేశ్ గారి అనువాదంలో యేదో లోపించిందన్న భావన కలిగింది. “చక్కని అనువాదం. కానీ, మరింత చిక్కగా ఉండి ఉండవచ్చు.” అన్న వ్యాఖ్య వారి ఫేస్‌బుక్ గోడ మీద వ్రాసాక నేనూ ప్రయత్నించాలనిపించింది. (రేరాజు గారి అనువాదం చూసే లోపే నేను వ్రాద్దామని నిర్ణయించుకున్నాను కనుక ఆయన అనువాదం నేను “చూసాను” కానీ చదవలేదు.) నా అనువాదం న్యాయం చేసిందని నేను అనుకోవటంలేదు. నిజానికి ఇప్పుడు చూస్తే నా అనువాదం చిక్కగా ఉంది కానీ, చక్కగా లేదనే నా అనుమానం. కానీ, ఒకే ఆంగ్లమూలానికి మూడు అనువాదాలు చదివే అవకాశం ఎప్పుడో కానీ రాదు కనుక ఆ ఉద్దేశమైనా నెరవేరుతుందని నా ఊహ.
బాగుంది. చాలా మంచి ప్రయత్నం.
కాకపోతే చిక్కగా చెయ్యడానికి ఇన్ని పదవిన్యాసాలు అవసరమా అనేది నా సందేహం.
నాకు ఈ కవిత బాగ నచ్చింది. ప్రత్యేకించి ఏ లైన్ బాగుంది, ఏ పంక్తి నచ్చిందని చెప్పలేక పోతున్నా.
చదివి 2 గంటలతర్వాత కారు నడుపుతూ వెళుతుంటే మధ్య మధ్యలో గుర్తొచ్చిన లైన్లు / భావం ఇది…
.
.
లయబద్ధమైన ప్రతి అడుగూ
అహంభావాన్ని దూరం చేస్తూ
విలయమే ఆవహించినట్టు
స్వయంగా సమర్పితమౌతూ
అప్రయత్నంగా
అన్యోన్యత నాహ్వానిస్తూ
అనాలోచితంగా
అధిదేవుని కంకితమౌతూ…
.
.
భాస్కర్: నాకు కూడా ఈ పంక్తులే బాగా పట్టేసాయి.
కత్తి మహేశ్ గారు: ప్రయత్నం హర్షించినందుకు నెనర్లు. మీ కవితతో ప్రేరణనిచ్చినందుకు కూడా మరో సారి నెనర్లు. చిక్కగా చెయ్యవచ్చేమోనని మొదలుపెట్టే ముందు అనుకున్న మాటే కానీ ప్రత్యేకించి కవితలని “engineer” చెయ్యటం పదమూ పదమూ కూర్చటం చాలా కృతకంగా ఉంటుందని నా నమ్మకం. మూలంలోని భావం నాలోకి యింకిన తరువాత ఆ భావం నన్ను నడిపించాలని నా అభిమతం. (ఇది అనువాదాలకే కాదు, “మూలం” అన్నది ఒక అనుభవం/అనుభూతి/సన్నివేశం ఇలా యేదైనా కావచ్చు.) ఈ కవిత కూడా అలా తన పదాలని నా అనుభూతిలో నుంచి తానే యెంచుకుందనే అంటాను.